విజయవంతమైన సీఐటీయూ రాష్ట్ర మహాసభలు : విలేకర్ల సమావేశంలో చుక్క రాములు, పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లు రద్దయ్యే వరకు దీర్ఘకాలిక పోరాటాలు నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర ఐదో మహాసభలో నిర్ణయించుకున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. నాలుగు లేబర్ కోడ్‌ల వల్ల కార్మికులకు జరిగే నష్టంపై చర్చించి, పోరాటాలకు రూపకల్పన చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2026లో జాతీయ సెలవుల్లో మేడేని మినహాయించటం దుర్మార్గమని విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా కార్మికవర్గం 8 గంటల పనిదినంతో పాటు అనేక హక్కులను సాధించుకున్న ఈ పోరాట స్ఫూర్తిని నేటి తరానికి కనుమరుగు చేసే కుట్రకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించేందుకు నిర్ణయించుకుందని తెలిపారు.
శ్రమశక్తి నీతి-2025ను వెంటనే ఉపసంహరించాలని మహాసభ డిమాండ్ చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కనీస వేతనాల జీవోలను పెరిగిన ధరలకనుగుణంగా సవరించాలని డిమాండ్ చేశారు. అన్నిరకాల కార్మికులకు కనీస వేతనం రూ.26వేలుగా నిర్ణయించాలని, అసంఘటితరంగ కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని ఈ నెల చివరి వరకు సీఐటీయూ స్వతంత్ర కార్యాచరణలో భాగంగా అన్ని స్థాయిల్లోని నాయకులు, కార్యకర్తలు సాధారణ కార్మికవర్గాన్ని చైతన్య పర్చాలని నిర్ణయించినట్టు తెలిపారు.
వచ్చే ఏడాది జనవరి 19న కార్మిక- కర్షక ఐక్యతా దినంగా కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గ్రామస్థాయి వరకు ఐక్య కార్యాచరణలో వేలాదిమంది భాగస్వామ్యంతో జిల్లా కేంద్రాల్లో కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలపై భారీ సభలు, ప్రదర్శనలు నిర్వహించాలని మహాసభ నిర్ణయించిందని పేర్కొన్నారు. జనవరి, ఫిబ్రవరిలో అన్ని కార్మిక సంఘాలతో ఐక్యంగా ఆందోళనలు జరిపి, జాతీయ స్థాయిలో తలపెట్టబోయే దేశవ్యాప్త సమ్మెతో సహా దీర్ఘకాలిక పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చిందని తెలిపారు. ఈ నెల 31, 2026 జనవరి 1-4 వరకు విశాఖపట్నంలో సీఐటీయూ 18వ జాతీయ మహాసభల సందర్భాన్ని పురస్కరించుకొని డిశెంబర్ 15న పారిశ్రామిక ప్రాంతాలు, మండల, జిల్లా కేంద్రాల్లో సీఐటీయూ సభ్యుడి ఇండ్లపై జెండాలెగిరేయాలని పిలుపునిచ్చారు. విలేకర్ల సమావేశంలో కోశాధి కారి వంగూరు రాములు, ఎస్వీ రమ, జె వెంకటేశ్, కూరపాటి రమేష్,ఈశ్వర్‌రావు,పిసుధాకర్ పాల్గొన్నారు.



