I find my sculptures are evolving to
of greater emotional presence by using
less physical substance
– Ellen Jewett
మునాసు వెంకట్ కొత్త కవితా సంపుటి ‘దాపు’ ఈ నెల 31 న లోకం ముందుకు వస్తుంది. సంచలనం కాకపోవచ్చు. కానీ, ఈ సంచార కవి, సూఫీ కవి అభిభాషణంలో కొత్త జనరేషన్ కవులకు ఒక పాఠ్య గ్రంథం దొరకగలదని మాత్రం చెప్పగలను. దాపు కవితలన్నిటికీ నేను ద్వితీయ శ్రోతను. ఎందుకంటే కవే తన కవితలకు మొదటి శ్రోత కాబట్టి. కవి తన కవిత్వానికి తానెట్లా శ్రోత అవుతాడనేది మీ సందేహం కావొచ్చు. రాస్తున్నప్పుడూ రాసింతర్వాత కవి చాలా సార్లు కవిత్వాన్ని తనకు తాను వినిపించుకుంటాడు.
అక్షర సముదాయం శబ్దం సముదాయంగా మారకముందే అర్థం ఒక బొమ్మలాగా తన ఎదుట నిలబడి వినపడే నిశ్శబ్దం నుండి కవి తన కవిత్వానికి మొదటి శ్రోత అవుతాడు. అట్లా శ్రోతగా తానుపొందిన మాధుర్యంలో పారవశ్యంలో మునకలేసే వెంకట్ కవిత్వానికి నేను రెండో శ్రోతను. అయితే, వెంకట్ కవిత్వానికి నేను రెండు బాధ్యతల రీత్యా తప్పనిసరి శ్రోతను. పాఠకుడిగా మొదటి బాధ్యత, సాహిత్య అధ్యాపకుడిగా రెండో బాధ్యత. మొదటిది వ్యక్తిగత బాధ్యత. రెండోది సామాజిక బాధ్యత. ఈ రెండు బాధ్యతల్లోంచి ఎట్లా విశ్లేషించుకున్నా మునాసు వెంకట్ ఒకAvant- grade poet. ఇది నా నిశ్చితాభిప్రాయం. Avant- grade poet. తమకాలంలో సాంప్రదాయంగా, స్థిరపడిన సాహిత్య పద్ధతులను సవాలు చేస్తూ, సరిహద్దులను దాటి, ప్రయోగాత్మక, రాడికల్ ఆలోచనలతో కొత్త సాహిత్యాన్ని సృష్టిస్తారు. కొత్త శైలులను, పద్ధతులను ప్రవేశపెట్టి, సృజనాత్మకత పరిధులను విస్తరింపజేస్తారు. ఇదివరకటి కావ్యాలు ‘ఎన, వర్జి, మెద, చందమామలు’ ఇప్పుడీ ‘దాపు’ను చూస్తే వెంకట్ మనకు Avant- grade poet. అని అర్థమవుతుంది.
Avant- grade poet.తమ కవితల్లో పాఠకులకు దక్కోణం (point of view) తోపాటు, దృశ్యాన్ని చూసే ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని (View point) నిర్మించి ఇస్తారు. ఇక అక్కణ్ణుంచి కవిత్వం గుండా కవులు దర్శింపజేసే పరిస్థితుల్ని ప్రదేశాల్లో మనం యాత్రచేసి రావొచ్చు. దాపు కావ్యం మనందరికీ ఓ అపురూపమైన ప్రాంత దర్శిని. వీక్షించేందుకు కదలండి.
”వెన్నెలకయిన చీకటికైన/ రాత్రి అంటేనే సంబరం/ పగలు కొలతల మీద ఉంటుంది/ పగలు సచ్చిపోతూ/ రాత్రి బతుకుతుంటా/ పగలుకు ఒంటర్ని/ రాత్రికి ఏకాంతాన్ని/ రాత్రి వొడవకపోతే బాగుండు” (రాత్రుళ్లు). రేయింబవళ్లను అందరూ చూసే దానికి భిన్నంగా సరికొత్తగా చూడటం, కవి తాను రాత్రినే కోరుకోవటం పాఠకుడిగా శ్రోతగా నాకు aesthetic satisfaction ఇస్తుంది.narrative capacity తో రాత్రులను వాక్యాల వంతెన మీద నడిపిస్తూ కవితకు అత్యద్భుతమైన ముగింపునిస్తాడు.
”వింతగొలిపే రాత్రుల్లో/ కలల ముడుపులు కట్టుకుంటూ/ రాత్రి ఓ ఆదిమ తాండవం/ గీ రాత్రులకోసమే/ అనేక పొద్దుల్ని మోసిన/ నెత్తిమీదికెల్లి/ భుజాల మీదిగ/ పొద్దు తిరుగుతుండేది/ గుర్తుండిపోయే/ గీ రాత్రుల్ని తప్ప/ నేనేమీ ఎనకేసుకోలేదు” (రాత్రుళ్లు) ఇదిగో ఈ cutting-edge నాకు అధ్యాపకుడిగా కవికున్నªthe power of a poem conclusionμ’ను తాత్విక ధారను, నిష్కామ సంత్ (సాధువు) స్వభావాన్నిtext గా బోధించేందుకు ఉపయోగపడే పంక్తులు.
కవిత్వం రాయడానికి ఒక్కో కవి వస్తువును ఒక్కోచోట నుండి తెచ్చుకుంటాడు. చీలీకో చికాగోకో వియత్నాంకో డర్బన్‌కో డార్జిలింగ్‌కో వింధ్యా సహ్యాద్రి పర్వతాలకో వెంకట్ వెళ్లడు. తన దాపునున్న, తనకు దాపున్న మనుషులు, చెరువు, చెట్లు, చెలిమెలు, పశుపక్ష్యాదుల్ని, హితమతుల్ని ప్రతిక్షేపిస్తూintrapersonal content:
self-talk, thinking, reflection, imagination, and memory వినిపిస్తాడు. కుల పరిసరం (caste environment)లో కవితలు మనల్ని కలెతిప్పుతాయి. క్యాస్ట్ ఎన్విరాన్‌మెంట్ జాతీయోద్యమం కాలంలో ఆధునిక కవిత్వంలోకి వచ్చింది. అది సంస్కరణవాద సంబంధి, పూర్తిగా రాజకీయ దృక్పథ కవిత్వం. వెంకన్నదీ రాజకీయ దృక్పథ కవిత్వమే. అయితే లిరిక్ లక్షణాలు తొణికిసలాడే సబాల్ట్రన్ జీవితం. డెమోక్రటిక్ స్పిరిట్ తో చేసే ‘ªselftruthμ’ ఆవిష్కరణ. ఫెర్డినాండ్ డెలాక్రోయిక్స్ వ్యాఖ్యానించినట్టు ”చిత్రలేఖనం అంటే ఆత్మలు సమావేశమయ్యే ప్రదేశం”. వెంకట్‌తో సంభాషణలో కవిత్వమూ అంతే.
”పొద్దు ఉరక ఎద్దు ఉరక/ ఎద్దు ఎంట ఎన్ను ఉరక/ ఎన్ను ఎంట మడి కన్నీటి తడి/ పచ్చి పడమటి గూడు చేరింది/ ఏమి సేత సేదలేని సేత/ పాణం ముక్కుల మీదికొస్తుంది/ నిమిషం నిమ్మళం లేదు/ మడికట్ల మీద నుంచే/ మఠాలెంట పడిపోతే బాగుండు” (పాసంగం) అంటూ గ్రామీణ వాదాన్ని వచన కవిత్వంలో స్థాపించి కొనసాగిస్తున్న వెంకట్ political activist, , దాపు కావ్యం ఒక political campaigning.. పాసంగం కవిత పూర్తిగా political dissent.
”నాట్లేస్తే నల్లమబ్బులన్నా కరుగుతయేమోకాని/ ఓట్లేస్తే గీ పాశానపు గుండెలు కరుగలే/ రైతు భూమిని కౌలుకు తీసుకున్నట్టు/ మార్కెటు పార్లమెంటును/ కౌలుకు తీసుకుందేమో/ కన్నీళ్లను కూడా కాంట కొడుతున్నరు/ జెండా పాసంగంతోనే ఎగురుతుంది” (పాసంగం) అంటూ చింతిస్తున్నది, కోపోద్రిక్తుడైనది political dissent లో భాగంగానే బెస్తల జీవన సంక్షోభాన్ని వత్తిపద చిత్రాలతో వర్ణితం చేస్తాడు. ముగింపులో-
”ఇది చాపల కాలం/ ఒక్కొక్కసారి అంతే… కాలం కనికట్టైతుంది/ గ్యాసారం గాలమై కుచ్చుకునేది జాలరికే/ కొన్ని చేపలు మూతులు కొరుక్కుంటున్నాయి/ ప్రేమగా/ కొన్ని జన ఇడుస్తున్నయి/ గాలీ చేపలు కలసి నాట్యంలో ఉన్నయి/ అలసి పోయిన కండ్లమీద/ కూరుపాట్లు కమ్ముకున్నయి/ ఇక కలల సమయం/ తల పడిప్పిన వల” అంటూ పాఠకులను చెరువొడ్డున జాలర్ల చెంత నించోబెట్టి దిగులు తెరల్ని కత్తిరించి కలలపడవ ఎక్కిస్తాడు. ఇట్లా దృశ్యం నుండి దృశ్యానికి నాటకీయతను జోడిస్తాడు.
దాపు కవితలు చదువుతుంటే మనం మన రోకున ఉండం. ఉపచేతన ఆవహించి పడమటింట్లోకి పోతం, తాళ్లమటం తిరిగొస్తం. ఏటి కత్తెతో ఏకాంతంగా మాట్లాడుతం, పెద్దత్తమ్మ విప్పి పెట్టిన సద్దిబువ్వ తినొస్తం, బలగం అందరినీ పలకరించ కదుల్తం, ఎద తడి మిన్ను ముడతది, బాల్యంమంతా మేనతోవలో సంచిరిస్తది. ఊరివే అయినా చెరువునూ వాగులనూ ఆనుకున్న బోరలన్నీ ఎక్కి గాలితీగ మీటుకుంటూ అనేకుడుగా మారిపోతం. ముత్యాలమ్మ చెలకల పితదేవతలకు బోనం సమర్పిస్తం, బాయిగడ్డన మైల బంధాన్ని ముడేసుకుంటం. మల్టీనేషన్ కంపెనీల ఏలుబడిలో కుదువబడ్డ కాలాన్ని విముక్తం చేసేందుకు
వసంత వాగు దాపుకెళ్లి ఇసుక అడుగున మాగిన మట్టిపాట ఎత్తుకుంటం. అవసరానికి వ్యాపారానికి గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మన ఇరుగుపొరుగును పేగుబంధాల్ని రక్తసంబంధీకులందరినీ నిష్కల్మషంగా కలుసుకుని తీరుతం. గల్మట్ల నిలబడి బయటకూ ఇంట్లకూ కలయజూస్తూ డబ్బు గత్తర సోకిన లోకానికి నిజం తెలియజెప్పే కార్యమగ్నులమైతం. దిగులు కమ్మిన మేఘం కింద కనుపాపల తీర్థంలో తానమాడుతూ కవికి సాధనతో అబ్బిన Visual interpretation తో మమేకమవుతం, రెండో ఆకాశమైపోతం.
విలక్షణమైన శైలి, లోతైన భావాలు, విభిన్న విషయాలు, సామాజిక విశ్లేషణ, చారిత్రక అవసరం, విమర్శనాత్మకత, ఫ్యూచరిస్టిక్ విజన్ ప్రసరించే మంచి కవిత్వమే విశిష్ట కవిత్వం. మునాసు వెంకట్ మనకాలపు విశిష్ట కవి.
నిజానికి భావోద్వేగ వ్యక్తీకరణ, అస్పష్టత, సంగీత గుణ సమీకరణమే కవిత్వం. ఈ సమీకరణానికి తగ్గట్టుగా ప్రయోగించిన అలంకారాలకు intellectual ability తోడైతే కవిత్వానికి మంచి, గొప్ప స్థితులనుండి విశిష్ట కవిత్వం స్థాయిని సిద్ధించగలదు.
”ఎవరు లేరిప్పుడక్కడ/ దారులుడిగిపోయి/ పడవబడి బాయిగడ్డ/ పాటి గడ్డయింది/ పచ్చులెగిరే పల్లెమీన/ ఇమానం లేని ఇమానం ఎగిరిపోయింది/ అమ్మమ్మ/ మామ/ ఊరు/ అప్పుడప్పుడు/ తల పైకెత్తి చూస్తే/ చందమామలో కనిపిస్తారు” (మేన తోవ) అంటూ విషాదాంత బాల్యస్మతులను రొమాంటిక్‌గా మలచడం వెంకట్‌కే సాధ్యపడింది. శిల్పాల్లో తక్కువ భౌతిక పదార్థాన్ని ఉపయోగించడం ద్వారా ఎక్కువ భావోద్వేగ ఉనికి కలిగి ఉంటాయంటున్న ఎల్లెన్ జెవెట్ వలె వెంకట్ కూడా వర్తమాన జీవన సంక్షోభాన్ని కళ్లకు కట్టడానికి physical substance పాళ్లు తగ్గించి ntangible substance తో కవిత్వానికి సొగసుగా విశ్వజనీనతను అద్దాడు. ముందుమాటలో ప్రస్తావించినట్టు ”అర్ధరాత్రో అపరాత్రో నా లోపల నడుస్తూ శిగమూగుతు పటమెక్కి పలువరించేదే కవిత్వం. దుఃఖమో ఆనందమో ఆత్మ కరిగి కవిత్వం నా అంతరమంతా మెరిసింది” (సరాన) అంటున్న వెంకట్‌కు కవితా రచన నిత్య వేడుక, ధ్యానస్థితి. ముఖాముఖి కవితో మాట్లాడే అవకాశం నా మాదిరి పాఠకులందరికీ ఉండదు. దాపు పుటల్ని తెరచి చదువుతూ పోతే కవి అనుభవించిన ధ్యాన స్థితి, వేడుక ప్రతి ఒకళ్లకూ తటస్థిస్తాయి.
డా.బెల్లి యాదయ్య, 9848392690
కవి అనుభవించిన ధ్యాన స్థితి వేడుక మనకూ తటస్థిస్తాయి
- Advertisement -
- Advertisement -