నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సామాన్యుడికి నిజమైన భద్రత దొరుకుతోందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు పడ్డ పేదలకు ఇప్పుడు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా సొంతింటి కల కలిగిన ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో గూడు లేని పేదల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి మంత్రి కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. ఇప్పటికే మొదటి విడత కింద అర్హులకు ఇండ్ల మంజూరు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కాగా.. రాబోయే ఏప్రిల్ నెలలో ప్రతి నియోజకవర్గానికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయించబోతోందన్నారు. ప్రభుత్వం ఎన్ని ఆర్థిక సవాళ్లను ఎదుర్కుంటున్నప్పటికీ… పేదల ఆత్మగౌరవం కోసం నిర్మించే ఇళ్ల విషయంలో వెనకడుగు వేయబోమని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇల్లు చేరేలా యంత్రాంగం పనిచేస్తోందన్నారు.



