Tuesday, December 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంముదిరాజ్‌లను బీసీ-డి నుంచి ఏలోకి మార్చాలి

ముదిరాజ్‌లను బీసీ-డి నుంచి ఏలోకి మార్చాలి

- Advertisement -

మండలి డిప్యూటీ చైర్మెన్‌ బండ ప్రకాష్‌
కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి
కుల గణన డాటా ఆధారంగా సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

ముదిరాజ్‌ సామాజిక తరగతిని బీసీ-డీ గ్రూపు నుంచి బీసీ-ఏ గ్రూపులోకి మార్చాలన్న చిరకాల డిమాండ్‌ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని శాసనమండలి డిప్యూటీ చైర్మెన్‌ బండ ప్రకాష్‌ ముదిరాజ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రధాన డిమాండ్‌ అని, ఈ అంశం ప్రస్తుతం బీసీ కమిషన్‌ వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ తమ మ్యానిఫెస్టోలో ముదిరాజ్‌ సామాజిక తరగతిని బీసీ-డి నుంచి బీసీ-ఏ కు మారుస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంపై తక్షణమే స్పందించి, బీసీ కమిషన్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే బీసీ కులగణన ప్రక్రియ పూర్తయినందున, ఆ డాటా ఆధారంగా కమిషన్‌ నుంచి నివేదికను తెప్పించుకొని, ముదిరాజ్‌ల రిజర్వేషన్‌ అంశాన్ని వెంటనే కొలిక్కి తేవాలని పభుత్వాన్ని కోరారు.

కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ : ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రెండు మూడ్రోజుల్లో సభను ముగిద్దామనే ప్రయత్నం చేస్తున్నారని, కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. అందులో భాగంగానే కాళేశ్వరం, ఇతర కేసుల్లో చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు ఉన్నాయన్నారు. హెచ్‌ఐఎల్‌టీ పాలసీపై చర్చ ఎందుకు లేదని ప్రశ్నించారు. రూ.వేల కోట్ల విలుమైన భూములను అన్యాక్రాంతం చేస్తున్నారన్నారు. గ్లోబల్‌ సమ్మిట్‌పై వైట్‌ పేపర్‌ రిలీజ్‌ చేసే దమ్ము, ధైర్యం ఉందా రేవంత్‌ రెడ్డి? అని ప్రశ్నించారు. మహిళలకు, నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలపై చర్చ చేసే దమ్మూ, ధైర్యం లేదన్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. గ్రామాల్లో, పట్టణాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. శాంతి భద్రతలు, ఆస్పత్రుల్లో వసతులు, రోడ్లు ఇలా చాలా సమస్యలు ఉన్నాయన్నారు.

నిమిషాల వ్యవధిలో కేసీఆర్‌ రావడం..వెళ్లిపోవడం..: ఎమ్మల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌
కేసీఆర్‌ వస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు చాలా హడావిడి చేశారని, కేసీఆర్‌ రావడం, సంతకం పెట్టడం, వెళ్లిపోవడం నిమిషాల వ్యవధిలో జరిగిపోయిందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మీడియా పాయింట్‌ వద్ద అన్నారు. మరణించిన ఎమ్మెల్యేలకు సంతాపం ప్రకటించకుండా వెళ్లిపోయారంటే శాసన సభ సభ్యులపై ఉన్న గౌరవం ఏంటో అర్థం అవుతుందన్నారు. కేసీఆర్‌ వస్తున్నారంటే హడావిడి ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు. అసెంబ్లీని కేసీఆర్‌ కుటుంబం రాజకీయ వేదికగా మార్చుకోవద్దన్నారు. ఒక ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్‌ అసెంబ్లీ చర్చల్లో పాల్గొనాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై మాత్రమే కాదు.. గడిచిన పదేండ్లలో కృష్ణా నీటి వాటాల విషయంలో జరిగిన నష్టంపై కూడా అసెంబ్లీలో చర్చ జరుగుతుందని చెప్పారు. అసెంబ్లీని మామా, అల్లుల్ల గొడవకు వేదికగా మార్చుకోవద్దన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలను రాజకీయంగా వాడుకోకుండా సలహాలు, సూచనలు కేసీఆర్‌ ఇస్తారని ఆశిస్తున్నామన్నారు.

పెండింగ్‌లో ఉద్యోగుల డీఏలు : ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి
ఉద్యోగుల డీఏలు పెండింగ్‌ ఉన్నాయని ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి అన్నారు. అసెంబ్లీలో మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. పీఆర్సీ గురించి స్పష్టత లేదన్నారు. ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలన్నారు. బహుళ అంతస్తులకు అనుమతులు ఇస్తున్నారని, అక్కడ అనుకోని ఘటనలు జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. రోడ్ల పరిస్థితి బాగాలేదన్నారు. పటాన్‌చెరు రెవెన్యూ డివిజన్‌కు అనుమతి వచ్చినా అమలు కాలేదన్నారు. యూనివర్సిటీల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ ఖాళీలు 70శాతం ఉన్నాయి.. వాటిని వెంటనే భర్తీ చేయాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

కేసీఆర్‌ స్పీకర్‌ను గౌరవించాలి : ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య
దళిత స్పీకర్‌ను కేసీఆర్‌ గౌరవించాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య అన్నారు. కేవలం సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి వెళ్లారన్నారు. చనిపోయిన వారికి నివాళులు అర్పించకుండా కేవలం మూడు నిమిషాల్లో కేసీఆర్‌ అసెంబ్లీ నుంచి తిరిగి వెళ్లిపోయారన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే కేసీఆర్‌ అసెంబ్లీ చర్చల్లో పాల్గొనడం లేదన్నారు. అసెంబ్లీ చర్చల్లో పాల్గొనని కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు..? ఎమ్మెల్యే పదవి ఎందుకు..? అని ప్రశ్నించారు. గ్రామాల్లో కోతుల బెడద ఉందని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పదేండ్లు దోచుకున్న కేసీఆర్‌ ఫాంహౌస్‌కు పరిమితం అయ్యారని విమర్శించారు. ఈ దోచుకున్న సొమ్ముకోసం కేటీఆర్‌, హరీశ్‌రావుకు మధ్య విబేధాలు వచ్చాయని ఆరోపించారు. ఆ క్రమంలో కవితను పార్టీ నుంచి తరిమేశారన్నారు.

మొక్కుబడి సంతకం పెట్టడానికి వస్తున్న కేసీఆర్‌
పదేండ్లు ముఖ్యమంత్రిగా చేసి.. రెండేండ్లు అసెంబ్లీకి రాకుండా కేసీఆర్‌ మొక్కుబడిగా సంతకం పెట్టడానికి వచ్చారని బీర్ల ఐలయ్య విమర్శించారు. నీటి వాటాపై చర్చలో కేసీఆర్‌ పాల్గొనాలన్నారు. ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీ చర్చలో కేసీఆర్‌ పాల్గొనాలన్నారు. కేసీఆర్‌ హయాంలో ఎంత నీటి వాటాలో దోపిడీ జరిగింది.. మా హయాంలో మేం ఏం చేశామో చెబుతామన్నారు. కృష్ణా నీటి వాటాల విషయంలో గతంలో సంతకం పెట్టి దోపిడీకి కారణమైన విషయం కేసీఆర్‌ మరిచిపోయారా? అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు-రంగారెడ్డిపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనకు, కాంగ్రెస్‌ రెండేండ్ల ప్రజా పాలనకు తేడా చూపిస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నామన్నారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేశామన్నారు. కేటీఆర్‌ తండ్రి చాటుగా ఎమ్మెల్యే అయ్యారు తప్ప స్వశక్తితో కాదన్నారు. తమ ప్రజా పాలనలో మహిళలకు తెలంగాణలో ఆత్మగౌరవాన్ని పెంచామన్నారు. తమ సంక్షేమాన్ని చూసి ఓర్వలేక నేడు కేసీఆర్‌ వక్రబుద్ధితో మాట్లాడుతున్నారన్నారు. ఈ ఒక్కరోజు సంతకం పెట్టడానికి కాకుండా, ప్రతి రోజూ కేసీఆర్‌ అసెంబ్లీ చర్చల్లో పాల్గొనాలన్నారు. పార్టీ ఫిరాయింపులకు నాంది పలికిన కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు నేడు ఆ అంశంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

ఇలా వచ్చి అలా వెళ్లిన కేసీఆర్‌ : ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
ప్రతిపక్ష నాయకుడిగా చర్చలో పాల్గొంటారని అనుకుంటే, కేసీఆర్‌ అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లారని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గతంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై జీవో ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయే అన్నారు. ప్రాజెక్టు వ్యయం పెంచి, రీడిజైన్‌ చేసి ప్రాజెక్టును పక్కన పెట్టిన ఘనత బీఆర్‌ఎస్‌ వాళ్లదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక వస్తే ఎక్కడ వారి తప్పులు బయట పడతాయో అని తప్పులు, అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. అనుమతులు లేకున్నా ప్రాజెక్టులు కట్టారన్నారు. రేపు జరగబోయే మున్సిపల్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -