- Advertisement -
- ఎల్‌ఐసీ పాలసీలపై జీఎస్టీ ఎత్తేయాలి
- రూ.9 వేల కనీస పెన్షన్ కోసం ఉద్యమించాలి : రాష్ట్ర సదస్సులో జాతీయ సహాయ కార్యదర్శి నర్సింహారావు పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం కోసం తీసుకొచ్చిన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్(ఎన్‌ఎంపీ) స్కీమ్‌ను రద్దుచేయాలనీ, ఎల్‌ఐసీ పాలసీలపై జీఎస్టీ ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎల్‌ఐసీ ఏఓఐ జాతీయ సహాయ కార్యదర్శి పీఎల్. నర్సింహారావు డిమాండ్ చేశారు. కనీస పెన్షన్ రూ.9 వేల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో ఎల్‌ఐసీ ఏఓఐ యూనియన్ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2019లో దేశ సంపదలో జీతాల వాటా 18.9 శాతం ఉండగా..నేడు అది 15.9 శాతానికి పడిపోయిందని ఎత్తిచూపారు. అదే కాలంలో కంపెనీల లాభాల వాటా 38.7 శాతం నుంచి 51.9 శాతానికి పెరిగిందని వివరించారు. దీనివల్ల యాజమానులు కుబేరులుగా మారుతున్నారనీ, ఉద్యోగులు, కార్మికులు పూటగడవని స్థితిలోకి నెట్టబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 11 ఏండ్లలో రూ.16.35 లక్షల కోట్లు కార్పొరేట్ల మొండి బాకీలను బ్యాంకులు రద్దు చేసి సంపన్నులకు మరింత లబ్ది చేకూర్చిన తీరును వివరించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ మాట్లాడుతూ.. ఇన్సూరెన్స్ చేయగలిగిన స్థోమత ఉన్న జనాభాలో 70 శాతానికి పాలసీలు అందించడం ద్వారా ఎల్‌ఐసి ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని రికార్డ్ స్థాయికి పెంచగలిగిందని తెలిపారు. 99 శాతం క్లెయిమ్ సెటిల్‌మెంట్‌తో ప్రపంచంలో అగ్రగామి సంస్థగా ఎల్‌ఐసీ ఎదిగిందని తెలిపారు. 100 శాతం విదేశీ పెట్టుబడులతో ఇన్సూరెన్స్ కంపెనీలను స్థాపించే వీలు కల్పిస్తూ మోడీ సర్కారు చట్టం చేయడం అన్యాయమని అన్నారు. ఎల్‌ఐసీ ఏఓఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు కుమార్ మాట్లాడుతూ మార్కెట్ పోటీని తట్టుకొని సమర్ధవంతంగా ఆర్ధికాభివృద్ధిలో తోడ్పడటం కోసం నాలుగు సాధారణ బీమా కంపెనీను విలీనం చేయాలనే ఉద్యోగుల డిమాండ్‌ను మోడీ సర్కారు పెడచెవిన పెడుతున్నదని విమర్శించారు. జీవిత బీమా, సాధారణ బీమా వ్యాపారం ఒకే కంపెనీ చేసుకోవడానికి వీలు కల్పిస్తూ కాంపోజిట్ లైసెన్స్ విధానాన్ని విధానాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాలను ప్రతిఘటించాలన్నారు. సెప్టెంబర్ 28న నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో జరిగే ఎల్‌ఐసీ ఏఓఐ తెలంగాణ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆ యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు టి.నాగరత్నం, రాష్ట్ర కోశాధికారి కె.రాం నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -