పాతబస్తీకే మణిహారంగా బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు
ప్రారంభానికి సన్నాహం
అభివృద్ధి పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని పాతబస్తీలో నిజాం కాలం నాటి చారిత్రక చెరువుకు హైడ్రా ప్రాణం పోసింది. కబ్జాలను తొలగించి ఊపిరందించింది. ఆక్రమణలతో ఆనవాళ్లే కోల్పోయిన చెరువును బతికించింది. చరిత్రను తవ్వి తీసిన మాదిరి చెరువును రూపొందించి హైడ్రా చారిత్రక వైభవాన్ని చాటింది. పాతబస్తీకే మణిహారంగా బమ్ -రుక్న్-ఉద్-దౌలా చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. జనవరిలో ఈ చెరువు ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న చరిత్రకు ప్రాణం పోస్తున్నామని, ప్రతి విషయం లోనూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువు వద్దకు స్థానికులు సులభంగా చేరుకునేలా రహదారులతోపాటు ప్రవేశ ద్వారాలుండాలని సూచించారు. చెరువు చుట్టూ బండ్‌పై వాకింగ్ ట్రాక్‌లు, లోపలి వైపు ఫెన్సింగ్ పనులను పరిశీలించారు. చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ఏర్పాటు చేస్తున్న ప్లే ఏరియాలను పరిశీలించారు. వృద్ధులు సేదదీరే విధంగా అక్కడ గజబోలు నిర్మాణాలు నలువైపులా ఉండేలా చూడాలన్నారు. పార్కులు, ఓపెన్ జిమ్‌ల ఏర్పాట్లను పరిశీలించారు.
విహార కేంద్రంగా తీర్చిదిద్దాలి
పాతబస్తీలో నేషనల్ పోలీస్ అకాడమీకి చేరువలో అభివృద్ధి చేస్తున్న బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును విహార కేంద్రంగా తీర్చిదిద్దాలని హైడ్రా కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఔషధ గుణాలున్న వృక్ష జాతితో పాటు, మొక్కలను చెరువు చుట్టూ నాటాలని సూచించారు. నిజాం కాలంలో చెరువు నిర్మాణంలో వాడిన రాతిని వినియోగించి కట్టడాన్ని పటిష్టం చేయాలన్నారు. ఇన్‌లెట్‌లు, ఔట్‌లెట్‌లు విశాలంగా ఉండేలా చేపట్టిన నిర్మాణాలను చూశారు. రాజేంద్రనగర్, ఆరాంఘర్ ఇలా 10 కిలోమీటర్ల మేర చెరువుకు వర్షం నీరు వచ్చేలా ఇన్‌లెట్లు నిర్మించాలని, ఈ ప్రాంతంలో వరద కష్టాలకు ఈ చెరువు చెక్‌పెట్టేలా చూడాలని సూచించారు. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘాను పటిష్టం చేస్తున్నారు.



