Monday, September 15, 2025
E-PAPER
Homeజాతీయంసుప్రీంకోర్టులో పెండింగ్‌కేసులు 88 వేలకు పైనే..

సుప్రీంకోర్టులో పెండింగ్‌కేసులు 88 వేలకు పైనే..

- Advertisement -

– 34 మంది జడ్జిలతో పూర్తి స్థాయిలో పని చేస్తున్నా గరిష్టస్థాయికి
– మరోవైపు కొత్త కేసుల వరద
న్యూఢిల్లీ :
సుప్రీంకోర్టులో పెండింగ్‌ కేసుల సంఖ్య 88,417 వేలకు పైగా చేరుకుంది. కోర్టు చరిత్రలో ఇది గరిష్టస్థాయి. ఒకవైపు సుప్రీంకోర్టు పూర్తి సామర్థ్యమైన 34 మంది జడ్జీలతో పని చేస్తున్నా పెండింగ్‌ కేసులు ఈ విధంగా పేరుకుపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నేషనల్‌ జ్యుడీషియల్‌ డేటా గ్రిడ్‌ (ఎన్‌జేడీజీ) సమాచారం ప్రకారం సుప్రీంకోర్టులో ఆగస్టు చివరి నాటికి 69,553 సివిల్‌ కేసులు, 18,864 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు కొత్త కేసులు దాఖలు చేయడం కూడా కొనసాగుతోంది. ఆగస్టు సమాచారం ప్రకారం ఈ నెలలో తీర్పు ఇచ్చిన కేసుల కంటే కొత్తగా వచ్చిన కేసుల సంఖ్య అధికంగా ఉంది. ఆగస్టులో 5,667 కేసులను పరిష్కరిం చగా, కొత్తగా 7,080 కేసులు విచారణ ప్రారంభమయింది. పెండింగ్‌ కేసులను తగ్గించడానికి వేసవి సెలవుల్లో కూడా అదనపు ధర్మాసనాలతో పని చేసినా పెండింగ్‌ కేసులు పెరిగాయి. ఈ ఏడాది మే 23 నుంచి జులై వరకు ఉన్న వేసవి సెలవులను ‘పాక్షిక పని దినాలు’గా పేరు మార్చి మొత్తంగా 21 ధర్మాసనాలు కేసులను విచారించాయి. ఈ ఏడాదిలో ఆగస్టు వరకూ 52,630 కొత్త కేసులు దాఖల య్యాయి. అలాగే 46,309 కేసులను పరిష్కరించారు. అలాగే ఈ ఏడాదిలో సుప్రీంకోర్టు ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులను చూసింది. నవంబర్‌లో మరొక ప్రధాన న్యాయమూర్తి (జస్టిస్‌ సూర్యకాంత్‌) నవంబర్‌లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. గతేడాది ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ బిఆర్‌ గవారు పెండింగ్‌ కేసులను తగ్గించడానికి ఎంతగానో కృషిచేసినా.. పెండింగ్‌ కేసులు 82 వేలకు పైగా చేరుకు న్నాయి. కరోనా లాక్‌డౌన్‌ నుంచి పెండింగ్‌ కేసుల సమస్య తీవ్రంగా మారింది. దీంతో జస్టిస్‌ చంద్రచూడ్‌ సుప్రీం కోర్టుల జడ్జీల ఖాళీలను భర్తీ చేయడానికి ఎంతగానో కృషి చేశారు. అలాగే, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ గవై కూడా తమ కొలీజియంల ద్వారా కేంద్రానికి సుప్రీంకోర్టు జడ్జీల పేర్లును వేగంగా సిఫార్సులు చేసేవారు. అయినా పెండింగ్‌ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. అలాగే, గత ప్రధాన న్యాయమూర్తులు, కొలీజియంలు కూడా ‘భారీ పనిభారం’, ‘అధిక ఒత్తిడి’ అంశాలను లేవనెత్తాయి. పనిభారం ఎంతగా ఉందంటే ఒక్క ఖాళీని కూడా కోర్టు భరించలేని స్థితికి చేరుకుందని తెలిపాయి. దీంతోనే సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసు లను వేగంగా ఆమోదించాల్సిన స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది.

జైళ్ల కంటే దారుణంగా బెగ్గర్స్‌ హోమ్స్‌
ప్రభుత్వాలు నిర్వహిస్తున్న బెగ్గర్స్‌ హోమ్స్‌ జైళ్ల కంటే దారుణంగా ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బెగ్గర్స్‌ హోమ్స్‌ను దాతృత్వ సంస్థలుగా ప్రభుత్వాలు నడుపుతున్నాయని విమర్శించింది. ఇలాంటి హోమ్స్‌ను వ్యక్తి పునరుద్ధరణ, నైపుణ్యాభివృద్ధి, సమాజంలో తిరిగి విలీనం చేసే కేంద్రాలుగా భావించాలని కోర్టు స్పష్టం చేసింది. బెగ్గర్స్‌ హోమ్స్‌లో ‘అధిక రద్దీ, అపరిశుభ్ర పరిస్థితులు, ఏకపక్షం లేదా అసంకల్పిత నిర్బంధం, వైద్య చికిత్స నిరాకరణ, మానసిక-శారీరక అవసరాలను నిర్లక్ష్యం చేయడం, వ్యక్తిగత స్వేచ్ఛపై పరిమితులు, జైలు లాంటి వాతావరణం’ వంటివి కేవలం విధాన వైఫల్యం కాదని, రాజ్యంగంలోని ఆర్టికల్‌ 21 (జీవించే హక్కు)ను ఉల్లంగించడమేని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న బెగ్గర్స్‌ హోమ్స్‌ నిర్వహణను మెరుగుపర్చాలని దాఖలైన పిటిషన్‌పై ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు ఈ విషయాలను వెల్లడించింది. పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌ల ధర్మాసనం ఈ నెల 12న తీర్పును వెలువరించింది. ఆదివారం తీర్పు పూర్తి పాఠం అందుబాటులోకి వచ్చింది. నిరుపేదలు, జైళ్లలో ఖైదీలకు అందే ప్రాథమిక రాజ్యాంగ రక్షణలను కూడా బిచ్చగాళ్లు కోల్పోతున్నారని తీర్పులో కోర్టు పేర్కొంది. బెగ్గర్స్‌్‌ హోమ్స్‌ రాజ్యాంగబద్ధమైన ట్రస్ట్‌ అని, వీటి ద్వారా అత్యంత దుర్బల వర్గాలకు అధిక రక్షణ, గౌరవం, ఆరోగ్యం, ఆశ్రయం, గోప్యత, మానవీయ ఓదార్పు వంటి హక్కులకు ప్రభుత్వం హామీ ఇస్తుందని కోర్టు తెలిపింది. ఇవి సమగ్ర పునరావాస సేవలతో నిండిన స్వభావంతో ఉండాలని, సామాజిక న్యాయం లభించే స్థలాలుగా గుర్తించాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా బెగ్గర్స్‌ హోమ్స్‌లో ఆరోగ్య పరీక్షలు, ఆడిట్‌లను నిర్వహించాలని ఆదేశించింది. బెగ్గర్స్‌ హోమ్‌లో ప్రవేశం పొందిన వ్యక్తులకు 24 గంటలలోపు తప్పనిసరి తనిఖీలు, ఈ గృహాలలో అందించే ఆహారం యొక్క పోషక ప్రమాణాలను ద్రువీకరించడానికి అర్హత కలిగిన డైటీషియన్‌, కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి మౌలిక సదుపాయాలను సమీక్షించడం, రద్దీ- అంటు వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి అధికారులు, వృత్తి శిక్షణ లభ్యత, మహిళలు లేదా పిల్లలకు గోప్యత, భద్రత, విద్య- కౌన్సెలింగ్‌ను కల్పించడానికి ప్రత్యేక సౌకర్యాలు ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. అలాగే, భిక్షాటన చేస్తున్న పిల్లలను ఈ గృహాలలో నిర్బంధించరాదని, జువెనైల్‌ జస్టిస్‌ (పిల్లల సంరక్షణ రక్షణ) చట్టం 2015 ప్రకారం బాలల సంక్షేమ సంస్థలకు పంపాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -