జనగణనలో ఓబీసీ, ఈబీసీలనూ ప్రత్యేకంగా లెక్కించాలి
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే కేసీఆర్‌కు నోటీసులు : తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత
‘జనగణనలో కులగణన-సమగ్ర చర్చ”పై రౌండ్ టేబుల్
నవతెలంగాణ – బంజారాహిల్స్
జనగణనలో ఎస్సీ, ఎస్టీలతోపాటు ఓబీసీ, ఈబీసీలను ప్రత్యేకంగా లెక్కించాలని, సెన్సెస్ డాక్యుమెంట్‌లో ఓబీసీ కేటగిరీని చేర్చే వరకు ఉద్యమిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఖాజామెన్షన్‌లో గురువారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ”జాతీయ జనగణనలో కులగణన-సమగ్ర చర్చ” అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. జనగణన 2021లో చేయాల్సి ఉండగా కోవిడ్ కారణంగా చేయలేదని చెప్పారు. కులగణనపై అన్ని రాష్ట్రాల్లో డిమాండ్ రావటంతో కేంద్రం అందుకు అంగీకరించిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల కాలం పెట్టి, ఓబీసీ అని లేకుండా కులం అనే కాలం మాత్రమే డాక్యుమెంట్‌లో పెట్టారని వెల్లడించారు. 56 శాతం ఉన్న బీసీల విషయంలో ఎంత గందరగోళం ఉంటుందో ఆలోచించాలని కోరారు. మనం ఇచ్చే అభిప్రాయాలు రిజర్వేషన్ల విషయంలో కేంద్రానికి సూచికలా ఉండాలన్నారు.
కులగణన విషయంలో బీజేపీ మాట తప్పినట్టు స్పష్టంగా తెలుస్తోందన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ అంశంపై చర్చ జరుగుతోందని, తెలంగాణ నుంచి మన అభిప్రాయం కూడా ఇవ్వాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించామని తెలిపారు. కులాలు, వాటి ఉపకులాల నివేదిక జాగృతి సిద్ధం చేస్తుందని కవిత చెప్పారు. ప్రతి కులానికీ అన్ని హక్కులూ సాధించుకునేలా ప్రయత్నం చేద్దామన్నారు. ఈ అంశంలో ప్రతి పార్టీకీ ఒక స్టాండ్ ఉండాలని, కానీ బీఆర్‌ఎస్ మాత్రం ఈ విషయంలో ఏమీ మాట్లాడటం లేదని విమర్శించారు. కులగణనపై అన్ని పార్టీలు తమ స్టాండ్ ఏంటో చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. కులగణలో కులం కేటగిరీతో పాటు సబ్ కేటగిరీ ఉండాలన్నారు. 2011లో రూ.4500 కోట్లతో చేపట్టిన జనగణనలో కాంగ్రెస్ ఏ తప్పు చేసిందో బీజేపీ కూడా ఇప్పుడు అదే చేస్తోందన్నారు. రూ.11 వేల కోట్లు పెట్టి చేపట్టబోయే జనగణనలో బీసీలను మోసం చేసే కుట్ర జరుగుతోందన్నారు. కులాల పేర్లతో పంచాయితీ పెట్టి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికల్లో దీన్నే అజెండా చేద్దామని అన్నారు.
ఎన్నికల కారణంగానే కెేసీఆర్‌కు నోటీసులు
మున్సిపల్ ఎన్నికలు ఉన్నందునే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని కవిత ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసు విచారణ పూర్తి చేసి బాధ్యులను శిక్షించాలన్న ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఈ సమావేశంలో ఇస్మాయిల్, నవీన చారి, మేకపోతుల నరేందర్‌గౌడ్, కోల శ్రీనివాస్, నాగరాజు, అర్చన సేనాపతి, రామకోటి, సల్వాచారి, కావూరి వెంకటేష్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, రాఘవచారి, మహ్మద్ మునవార్ అలీ, రామ కృష్ణ, అనురాధాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.



