నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి ఆర్టీసీ పాత బస్టాండ్ ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని సీపీఐ(ఎం) టౌన్ కమిటీ కార్యదర్శి పరమేశ్వర చారి కోరారు. వనపర్తి పట్టణ సీపీఐ(ఎం) టౌన్ కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి ఆర్టిసి డిపో అధికారి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుకు వినతి పత్రం మంగళవారం అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న పాత బస్టాండ్ ను తాత్కాలికంగా వినియోగంలోకి తెచ్చారు. కానీ దాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని పాత బస్టాండ్ కాంపౌండ్ స్థలంలో పూర్తి స్థాయిలో సిసి బెడ్ నిర్వహించాలని డ్రైనేజీ సమస్య లేకుండా చూడాలన్నారు.
వచ్చి పోయే ప్రయాణికులకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. ప్రయాణికులు కూర్చోవడానికి షెడ్డు ఏర్పాటు చేసి కుర్చీలు ఏర్పాటు చేయాలని ఆవరణ లోపల పూల మొక్కలు ఏర్పాటు చేయాలన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పాత బస్టాండ్ ముందు పూల వ్యాపారం చేసుకుంటూ జీవనం గడిపే వారికి షట్టర్లతో డబ్బాలు ఏర్పాటు చేసి కిరాయికి ఇవ్వాలన్నారు. లైటింగ్ ఏర్పాటు చేయాలని ఎక్కడ అన్యాక్రాంతం కాకుండా పాత బస్టాండ్ విస్తరణ ఎంత ఉందో అంత పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోవాలని సీపీఐ(ఎం) గా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ కార్యదర్శి పరమేశ్వరాచారి, గంధం గట్టయ్య, గంధం మదన్, జి, బాలస్వామి, రమేష్, నందిమల్ల రాములు, బీసన్న తదితరులు పాల్గొన్నారు.



