Monday, January 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతప్పులు బయటపడ్తాయనే ప్రతిపక్ష నాయకుల వాకౌట్‌

తప్పులు బయటపడ్తాయనే ప్రతిపక్ష నాయకుల వాకౌట్‌

- Advertisement -

ప్రభుత్వ విప్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రతిపక్ష నాయకుల తప్పులు బయటపడ్తాయనే భయంతోనే వాకౌట్‌ చేశారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, విప్‌ బీర్ల ఐలయ్య అన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మాట్లాడారు. అన్నీ దోచుకొని తోకముడుచుకొని పారిపోయారని, మాట్లాడటానికి సమయం ఇవ్వాలని బీఏసీ సమావేశంలో అడిగారని చెప్పారు. మూసీ పునర్జీవనం చేద్దామని మంచి నిర్ణయం తీసుకుంటే చర్చకు రారా అని ప్రశ్నించారు. కమీషన్ల కక్కుర్తితో ‘పాలమూరు రంగారెడ్డి’ని ఎండబెట్టారని ఆరోపించారు. ధైర్యం ఉంటే అసెంబ్లీలో కృష్ణా జలాలపై, పాలమూరు రంగారెడ్డిపై చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ చట్టం పేరు మార్చి, నిధులకు తూట్లు పొడుస్తుంటే కేంద్రంతో ఉన్న దోస్తానాతో బీఆర్‌ఎస్‌ చర్చలో పాల్గొన లేదని ఆరోపించారు. కేంద్రం ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. కేంద్రం చేస్తున్న నష్టం బీఆర్‌ఎస్‌ పార్టీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం పేరు చెబితేనే మోడీకి వణుకు పుడుతున్నదన్నారు.

సమావేశం పెట్టమన్నారు.. వెళ్లిపోయారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, విప్‌ ఆది శ్రీనివాస్‌
కృష్ణా జలాలపై చర్చించేందుకు దమ్మూ, ధైర్యం ఉంటే అసెంబ్లీ సమావేశం పెట్టాలన్న కేసీఆర్‌.. తీరా సమావేశం పెడితే, కేవలం సంతకం పెట్టి రెండు నిమిషాల్లో వెళ్లిపోయారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకుల తప్పులు, అవినీతి ఎక్కడ బయటపడుతాయోనని జంకుతున్నారని, కేసీఆర్‌ చేష్టలతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. మాట్లాడటానికి సమయం ఇచ్చినా కావాలనే గొడవ చేసి హరీశ్‌రావు వాకౌట్‌ చేశారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ భవన్‌లో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ పెడుతున్నారని, కాంగ్రెస్‌ అడిగే ప్రశ్నలకు, కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక తొకముడిచి పారిపోయారని అన్నారు.

కుటుంబ కథా చిత్రాన్ని రక్తి కట్టిస్తున్నారన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు.. అవినీతి జరిగింది వాస్తవం అని కవిత స్వయంగా చెబుతున్నారని తెలిపారు. కృష్ణా జలాలపై చర్చకు కేసీఆర్‌ అసెంబ్లీకి రాకపోతే బీఆర్‌ఎస్‌ను దేవుడు కూడా కాపాడలేడని స్వయంగా ఆయన కూతురే అంటున్నారని అన్నారు. అధికారంలో ఉంటేనే కేసీఆర్‌ సభకు వస్తారా? అని ప్రశ్నించారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఉపాధి హామీ చట్టంపై మాట్లాడాల్సి వస్తుందనే బీఆర్‌ఎస్‌ నేతలు వాకౌట్‌ చేశారని విమర్శించారు. మహాత్మా గాంధీ పేరును చట్టం నుంచి తొలగించొచ్చు కానీ ప్రజల గుండెల్లో నుంచి తీసివేయలేరన్నారు. భవిష్యత్‌లో ఇండియన్‌ కరెన్సీపై ఉన్న గాంధీ ఫొటోను కూడా తొలగిస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టం పేరులో గాంధీ పేరును యథాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. గాంధీ కుటుంబంపై బీజేపీ నేతలు విష ప్రచారం మానుకోవాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -