Thursday, December 25, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిపట్టాలెక్కిన పంచాయతీలు

పట్టాలెక్కిన పంచాయతీలు

- Advertisement -

రాష్ట్రంలోని పంచాయతీలు పరిపాలనా పట్టాలెక్కాయి. అపాయింటెడ్‌ డే నాడు ప్రమాణ స్వీకారం చేసిన కొత్త సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు కొలువుదీరారు. వారి అధికారాలు, విధులను గుర్తుచేస్తూ ముఖ్యమంత్రి కరదీపికను ఇటీవల ఆవిష్కరించారు. ఈసారి ఎన్నికల్లో యువత అత్యధిక స్థానాల్లో బాధ్యతల్లోకి వచ్చారు. రిజర్వేషన్లకు మించి మహిళలు గెలుపొందారు. మొత్తం గ్రామాల్లో 86.4 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలే విజయం సాధించడం గమనార్హం. అందులోనూ ముఫ్పై ఒక శాతం నిరక్షరాస్యులుండగా, యాభై నాలుగు శాతం పట్టభద్రులు పంచాయతీల్లోకి అడుగుపెట్టారు. మొత్తం 12,728 గ్రామాలకుగాను 11,947 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. 1205 ఏకగ్రీమయ్యాయి. మిగతావి రకరకాల కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలావుండగా రెండేండ్లు ఆలస్యంగా నైనా ఎన్నికలు నిర్వహించారు. ఒక అంకం పూర్తయింది. అసలుది ఇప్పుడే ప్రారంభమైంది. కొత్త నాయకత్వానికి పంచాయతీ ల్లోని సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. కనీసం మౌలిక వసతులకు నోచుకోని గ్రామాలు కోకొల్లలు. అంతదాక ఎందుకు పంచాయతీ భవనాల్లోనే సరైన వసతులు కరువయ్యాయి.

నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు గ్రామ ఖాతాల్లోని ఖాళీ ఖజానా వెక్కిరిస్తున్నది. మహిళా సర్పంచులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. సమయాను కూలంగా ఎన్నికలు జరగలేదనే కారణంగా కేంద్ర ప్రభుత్వం రూ.3500 కోట్లను ఆపేసింది. ఆర్థికలేమి పేరుతో రాష్ట్ర ప్రభుత్వమూ అరకొర నిధులే ఇస్తున్నది. గ్రామసీమలే ప్రగతి పట్టుగొమ్మలని జాతిపిత గాంధీజీ అన్న మాటలు ఇక్కడ మననం చేసుకోవాల్సిన సందర్భమిది.ఇంతకాలం ప్రత్యేకాధికారుల పాలనలో మగ్గిన పంచాయతీల పరిస్థితి ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’లా తయారైంది. గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, రోడ్ల నిర్వహణ, స్ట్రీట్‌ లైట్లు, ప్రజారోగ్యం తదితర సమస్యలు గ్రామాలను దీర్ఘకాలికంగా పీడిస్తున్నాయి. వీటి పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన సాధారణ నిధులూ సమ యాను కూలంగా అందడం లేదు. దీంతో పరిస్థితులు దయనీయమయ్యాయి. కనీసం పారిశుధ్య నిర్వహణ, ఇతర అవసరాల కోసం వాడుకునే ట్రాక్టర్లల్లో డీజిల్‌ నింపలేని దారుణ పరిస్థితులు దాపురించాయి.

ప్రతి వ్యక్తికి రూ.900 నుంచి రూ.1400 వరకు వచ్చే పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం ఇప్పటికే నిలిపేసింది. కాగా మాజీ సర్పంచులు, చిన్న కాంట్రాక్టర్లు టెండర్లు తీసుకుని వడ్డీలకు తెచ్చిన సొంత డబ్బులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడితే బిల్లులివ్వకుండా ప్రభుత్వాలు సతాయిస్తున్నాయి. సుమారు రూ.2700 కోట్ల మేర బిల్లులను పెండింగ్‌లో పెట్టాయి. దీంతో వీరంతా వడ్డీవ్యాపారుల ఒత్తిళ్లను ఎదుర్కొవాల్సి వస్తున్నది. బిల్లుల సాధనకు ధర్నాలు, నిరసనలు కొనసాగుతున్నాయి. అప్పుల భారం పెరిగి పలువురు మాజీ సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలోనే కాకుండా నీటిపారుదల శాఖ, మిషన్‌ భగీరథ, రోడ్లు, భవనాలు తదితర శాఖల్లోనూ చిన కాంట్రాక్టర్లకు ఆశనిపాతమవుతున్నది. గత సర్పంచులు మానవహక్కుల కమిషన్‌కు సైతం తమ బిల్లులను మంజూరు చేయించాలంటూ ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్‌ సర్కారు హయాం నుంచే ఈ బకాయిలు పేరుకుపోయాయి. ఇంకా కొన సాగుతున్నాయి. ప్రభుత్వాలు స్థానిక సర్పంచ్‌లు, చిన్నవాళ్లను కాదని పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేస్తున్నాయనే ఆరోపణలు, విమర్శలు సైతం దీర్ఘకాలంగా ఉన్నాయి.

పంచాయతీరాజ్‌ చట్టం 2018 ప్రకారం పంచాయతీల విధులు, బాధ్యతలపై స్పష్టత కరువైంది. పంచాయతీల్లో సిబ్బంది లేరు. కార్యదర్శులు స్థానికంగా ఉండటం లేదనే విమర్శలు. ఇన్ని సమస్యలుండగా, ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కారు పంచాయతీలపై పిడుగేసింది. సాధారణ ప్రజలను ఆకలికి చంపేందుకు ప్రయత్నిస్తున్నది. వామపక్షాల చొరవతో యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసింది. దాన్నిప్పుడు వీబీ జీ రామ్‌ జీ పథకంగా మార్చేసి నిరుపేదల నోటికాడ బువ్వను నిర్ధాక్షిణ్యంగా లాగేసుకుంది. చట్టం ద్వారా హక్కుగా వచ్చే ఉపాధి పనులను పథకంగా మార్చేసి ప్రజలను బిచ్చగాళ్లను చేసింది. ఉపాధి చట్టం నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి గ్రామీణపేదల బతుకులను ప్రశ్నార్థకం చేసింది. కేంద్రం 60:40 నిష్పత్తిలో ఈ పథకానికి నిధులు వెచ్చించాలంటూ షరతులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం మోపింది. ఇదిలావుండగా పంచాయతీలకు ఖాళీ బొక్కసాలిచ్చి కొత్త పాలకవర్గాలను తెచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదు. స్థానిక పాలన సాగదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -