అనుభవాలు ఎప్పుడు గొప్పవే, ఆ అనుభవం నుండి ఆవేదన అక్షరమైతే నది ప్రవాహంలా కవిత్వం నిత్యం ప్రవహిస్తుంది. ఆ కవిత్వం స్వచ్ఛమైన ఊరి గాలిలా ఊరి జీవితాలను అక్కున చేర్చుకుంటే అద్భుతమైన కాన్వాస్ లా కవిత్వం మనసును హత్తుకుంటుంది. అలాంటి కవిత్వాన్ని రాసిన అనిశెట్టి రజిత తన తాజా కవితా సంపుటి కాలం కాన్వాస్ మీద.
నిత్యం కవిత్వం చదువుతూ ఉన్నా కొన్ని కొన్ని కవితలు చదివినప్పుడు మాత్రమే మన సంస్కతి, జీవన విధానం మన కళ్ళ ఎదుట అగుపిస్తాయి. అప్పుడు ఎంతో ఉద్వేగానికి లోను కాక తప్పదు, మరి ఊరి కవిత్వం చదివినప్పుడు ఇది ఎక్కువ కనబడుతుంది.
పల్లె ‘ రా బిడ్డా’ అని చేతులు చాపి
అవ్వోలె పావురంగా పిలిచేది
కాళ్ళకు నీళ్లిచ్చి పల్కరిచ్చి
గుడ్ల నీరు దూరంగా తడిమేది
ఈ పుస్తకంలో కవిత్వమంతా ఊరే కనబడుతుంది. పలుకోనాల్లో ఊరిలోని ప్రేమ కల్మషం లేని మనుషుల మనుసులను చక్కగా ఆవిష్కరించారు. కవిత్వం నిండా మంచి అభివ్యక్తి ఉంది, మట్టిని, మనిషిని ప్రేమగా తన కవిత్వంలోకి ఒంపారు. ఊరిలోని గాలిని పీల్చినప్పుడు ఎంత హాయి అనిపిస్తుందో మనసుకి అంతటి హాయిని రజిత కవిత్వం చదువుతుంటే మనకు అనిపిస్తుంది.
”ఊరంటే ఉట్టి మట్టి కాదు/ మట్టి! మనిషి! ఉత్పత్తి!
ఊరంటే జనజీవన తంత్రం!/ సూర్యునితో కలెదిర్గే శ్రమయంత్రం..!”
ఇలా చాలా కవితలలో ఊరే కవిత వస్తువు అవుతుంది. భిన్నమైన వస్తువుల మీద రాసినప్పటికీ కొన్ని కొన్ని కవితలు చదువుతుంటే ఎక్కడో ఉన్న మనం ఊరిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. మారుతున్న పల్లె జీవన చిత్రాన్ని చూసి ”ఆ పల్లె జాడ ఏడ”? అంటూ ఒకప్పటి పల్లె వాతావరణానికి ఇప్పుడున్న వాతావరణానికి తేడను ఈ కవితల్లో చక్కగా చెప్పారు. అదేవిధంగా హైదరాబాద్ నగరం గురించి ”విశ్వ ప్రేమ కావ్యం” కూడా హైదరాబాద్ పైన తనకున్న ప్రేమను ఈ కవితల్లో చెప్పారు. స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మరియు చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాల గురించి కూడా ఈ పుస్తకంలో చక్కటి కవితలు చూస్తాము.
తెలంగాణ జన జీవితాలను గుర్తుకు తెచ్చే భాష ఈ కవితలలో చూడవచ్చు. 50 కవితలు అనేక భిన్న కోణాలను స్పశిస్తుంది.
(ఆగస్టు 11న అనిశెట్టి రజిత మరణించారు. ఆమెకు నివాళి)
– గాజోజి శ్రీనివాస్
9948483560న