రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శత వసంతంలోకి ఈవిజయదశమితో అడుగుపెట్టింది. 1925 దసరా రోజు ప్రారంభమై స్వయం సేవకుల సమూహంగా ఏర్పడిన సంస్థ ఏం సాధించిందో ఒక్కమాటలో చెప్పాలంటే ”దేశంలో ఒక సమూహాన్ని ఐక్యం చేసింది” అని చెప్పడం కన్నా ఒక సమూహాన్ని వేరొక సమూహం ద్వేషించేలా చేయడంలో సఫలీకృతమైందని కచ్చితంగా చెప్పవచ్చు. వాస్తవ ముఖచిత్రాన్ని ప్రస్తుతించి చెప్పాలంటే హిందువులు, హిందుయేతరులు అన్న స్పష్టమైన విభజన రేఖను గీసింది. రాజకీయాలకతీతంగా ప్రారంభించబడిందని వివరిస్తున్న ఆరెస్సెస్ ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకపోయినప్పటికీ వాటిని శాసిస్తున్న స్థితికి చేరింది. ఈ వందేండ్లలో ఆరెస్సెస్ తను ప్రవచించిన సంస్కృతి, దేశభక్తి అనబడే రూపానికి పూర్తిగా ముసుగు వేసుకొని ద్వేషసాగు చేసింది. అది ముసుగు వేసుకుని పనిచేస్తున్నదన్న సోయి మహామహులైన ఆరెస్సెస్ నాయకులకు కూడా అందనంతగా జరిగిపోయింది. కొందరికి మింగుడు పడకపోయినా ఇదే వాస్తవం.
తనకసలు అవగాహన లేని ఒక మతాన్ని, తనకెప్పుడూ పరిచయం లేని ఒక వ్యక్తిని ద్వేషించే స్వయంసేవకులను ఆరెస్సెస్ తయారు చేసింది. ఇది చాలా దురదృష్టకరం. ఆరెస్సెస్ నాయకుల ద్వారా జనసంఫ్‌ుకి బీజాలు పడిన నాడే దాని కాసింత అస్తిత్వానికి శాశ్వతత్వాన్ని కోల్పోయింది. స్వాతంత్య్ర సంగ్రామంలో తమ పాత్ర ఉన్నదని పాఠ్యపుస్తకాల్లో మార్చవచ్చు కానీ జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన రక్తచరిత్రను చెరిపేయడం అసాధ్యం. తన ఉనికినే ప్రశ్నిస్తున్న ఈ అంశమే ఆరెస్సెస్‌ను భావితరాలముందు దోషిగా నిలబెడుతుంది. ఆరెస్సెస్ దేశ సమైక్యతను సాధిం చిందని చాలామంది దాని నాయకులు, కార్యకర్తలు సంబరపడుతున్నారు. దాదాపు ఇరవై కోట్ల ముస్లిం జనాభాకి సంబంధించి వెయ్యికి మించిన శాసనసభ, పార్లమెంటు బీజేపీ సభ్యుల్లో ఒక్కరికైనా ప్రాతినిధ్యం ఉన్నదా? అందుచేత, ఒక సమూహానికి మాత్రమే నాయకురాలు అయింది తప్ప, దేశం మొత్తానికి నాయకత్వం వహించే అవకాశం లేకుండా తనకు తానే స్వదేశంలో కొందరికి పరాయిగా మిగిలింది. ”ఆరెస్సెస్ పరాయిదని కొందరు అనుకుంటే మాకేంటి, హిందువులందరినీ ఐక్యం చేశాం” అని సమర్థించుకోవచ్చు.
అది స్పష్టమైన సంతృప్తి కాదన్న సంగతివారందరికీ తెలిసినా విస్మరించడం భవిష్యత్తు ప్రమాదాన్ని అంచనా వేయకపోవడమే. మెజారిటీదైనా లేక మైనారిటీదైనా ఒక సమూహాన్ని ఐక్యపరచడం వల్ల దేశానికి అపకారమే. జరుగుతున్న ఈ అపకారాన్ని నివారించాల్సింది కూడా ఆరెస్సెస్ నాయకులే. లేకపోతే భవిష్యత్‌తరాలు పెద్ద మూల్యమే చెల్లించుకుంటాయి. ఇది భయపడో లేక బాధపడో లేక నిరాశతోను అంటున్న విషయం కాదు. ఆధిపత్యం ఎప్పుడూ ఒకపక్షం వహించదు. కాలానుగుణంగా పుట్టుకొచ్చే నాయకుల బలాబలాలను బట్టి ఆధిపత్యపు అరుగులు మారుతూ ఉంటాయి. ఈ క్రమంలో జరిగే హింసల గురించి అంచనా వేయడం కష్టమేమి కాదు. భారతదేశానికీ స్వాతంత్య్రం వచ్చినా, రాకపోయినా భారతదేశంలోని హిందువులంతా ఐక్యం కావాలంటూ మొదలైన ఆరెస్సెస్‌్ ప్రయాణం ఐక్యత పక్కకుపోయి ద్వేషంతో కొనసాగుతున్నది. నిజానికి ఆరెస్సెస్ నాయకుల్లో చాలా తక్కువ మంది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇస్లాంను లేదా క్రైస్తవమతాన్ని అంతమొందించాలని గానీ, తత్సంబంధిత ప్రజలను ఉచకోత కోయాలని గానీ మాట్లాడుతుంటారు.
అయినప్పటికీ ఆరెస్సెస్‌కు దగ్గరగా చేరిన వాళ్లందరిలో పరమత ద్వేషం అంతర్లీనంగా మొదలై అది రగిలి రగిలి ఉన్మాదంలోకి వారిని నెడుతుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే: ఆరెస్సెస్ నాయకులు అనేక సందర్భాల్లో ప్రస్తావించిన అంశాలేమంటే 800 సంవత్సరాల క్రితం ముస్లిం పాలకులు హిందువులను హింసించారు, ఆడవారిని చెరిచారు, బిడ్డలను హతమార్చారు అలా చేసేక్రమంలో తలలు తెగకోశారు, పసిపిల్లలను పైకెగరేసి కింది నుంచి కత్తిపెట్టి పైశాచిక ఆనందాన్ని పొందారు, హిందూ దేవాలయాలను కూల్చివేసి మసీదులను నిర్మించుకున్నారు. అలాంటి చరిత్ర తెలిసి కూడా ఇప్పుడు ప్రస్తుత పాలకులు (కాంగ్రెస్) మౌనంగా ఉంటున్నారు, దీన్ని ఎప్పటికీ మనం క్షమించరాదు అని ప్రసం గిస్తారు. ఇలాంటి దుర్మార్గాలు చరిత్రలో జరిగాయి, వాటిని ఖండించవలసినదే. బౌద్ధస్థూపాలను, బౌద్ధారామాలను కూడా తొలగించి హిందూ దేవాలయాలతో పాటు అనేక అన్యమతస్తుల పూజా మందిరాలను నిర్మించిన దాఖలాలు కూడా ఉన్నవి. అట్టివన్నీ కూడా సంబంధిత కాలాలలోని పాలకుల తప్పిదాలు తప్ప ప్రజలకు ఎలాంటి భాగస్వామ్యం లేదు. కానీ ఈరోజు వాటిని ప్రస్తావించడం వల్ల సాటి ప్రజలపై ద్వేషం పెరుగుతోంది.
ఇప్పుడు కూడా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో అంగీకారపూర్వకంగా నిజాం ప్రభుత్వంతో చేతులు కలిపి, ఆయనకు ”రాజప్రముఖ్” అనే బిరుదును కూడా సత్కరించి గవర్నర్‌గా గౌరవించి విలీనం చేసుకున్న అంశాన్ని రాజకీయం చేస్తూ తెలంగాణ విమోచన జరిగిందంటూ హిందూ ముస్లింల వైరానికి దాన్ని వాడుకుంటున్న సందర్భం స్పష్టంగా ఉన్నది. ఆరెస్సెస్ తలపెట్టిన ”శాఖ కార్యక్రమాల నిర్వహణ” దాని ప్రధాన అస్త్రం. నేడు దేశవ్యాప్తంగా అరవై లక్షల సభ్యత్వానికి విస్తరించడానికి అది ప్రధాన భూమిక. శారీరక దారుఢ్యం కోసం ఆటలు, వ్యాయామం మొదలగు వాటికోసం పసితనంలోని పిల్లలందరినీ జమగూర్చి వారందరికీ పాటలు, శ్లోకాలు నేర్పిస్తూ ప్రతిరోజూ జెండా ఆవిష్కరణ గావించి, ధ్వజ ప్రణామం చేయిస్తూ సమాంతరంగా విద్వేషపూరిత దేశభక్తిని పెంపొందించడంలో అది సఫలీకృతమైంది. అందుకే జాతీయ జెండా కన్నా భారతమాత చిత్రపటంతో ఉన్న ఆరెస్సెస్ కాషాయ జెండాని ఎక్కువగా వారందరూ ఆరాధిస్తూ ఉంటారు. శాఖా కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రతి గ్రామంలో కరణాలను, పటేళ్లను, పట్వారీలను, ముఖద్దమ్‌లను, మోతుబరి కుటుంబాలను ఎంచుకుంది.
సాధారణంగా ప్రజల్లో మంచి ఇన్ఫ్లూయెన్స్ కలిగిన ఇలాంటి వారు స్కూల్ పిల్లలను పిలిచి తమ భూముల్లో లేదా పాఠశాల ఆవరణల్లో క్రమ శిక్షణతో కూడిన వ్యాయామ కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పుడు అందులో ద్వేషం నిండి ఉన్నదని తల్లిదండ్రులు గానీ ప్రజలు గానీ ఏనాడూ భావించలేదు. ఇటువంటి వాటన్నింట్లో దేశభక్తిని జోడించి నూరిపోస్తుంటే అది విషవృక్షం అవుతుందని ఎవరూ ఊహించలేదు. శాఖలో చేరిన మొదట్లో పరమత ద్వేషం ప్రస్తావన ఎవరూ చెయ్యరు. కాస్త సీనియారిటీ పెరిగిన తర్వాత విధ్వంస కోసం ఒక టీమ్‌ని కూడా తయారు చేస్తూ వస్తారు. 1960, 70, 80వ దశకాల్లో అనేక గ్రామాల్లో దర్గాలను మసీదులను కూల్చేసిన ఘటనలు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. ఇక శిశుమందిర్ పేరు న దేశవ్యాప్తంగా నడుస్తున్న పాఠశాలల ప్రత్యక్ష తోడ్పాటు కూడా ఆరెస్సెస్ అభివృద్ధికి ఎంతో దోహదపడింది. సదరు పాఠశాలలో క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం ఉంటుంది. కానీ గులాబీ పువ్వుతో పాటు ప్రాణాంతకంగా కనిపించకుండా దానికిందే పెరిగిన ప్రమాదకరమైన ముల్లులాగే ద్వేషభావన కూడా సమాంతరంగా పెరుగుతుంది. ఇలా పాఠశాల వయసునుండే అంతర్లీనంగా ద్వేషభావనకు గురైన వారందరూ పెరిగి పెద్దయి విశ్వ హిందూ పరిషత్, భజరంగ్‌దళ్ వంటి అనేక సంస్థల్లో పనిచేస్తూ భారతీయ జనతా పార్టీగా అవతరించిన రాజకీయ పార్టీకి సహకరిస్తూ ఉంటారు.
హిందూ మతం ప్రమాదంలో పడిందనీ, ముస్లింల సంఖ్య పెరిగిపోతుందనే అవాస్తవాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలని నమ్మించడంలో దాని అనుబంధ సంస్థలు సఫలమయ్యాయి. తత్ఫలితంగా, దురదృష్టవశాత్తు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల్లో చాలామంది ఈ ఆరెస్సెస్‌కి దగ్గరై ప్రచారకులౌతున్నారు. ”హిందూవోంకా హిందూదేశ్” అనే నినాదంతో ఏర్పాటైన ఆరెస్సెస్‌్ సంస్థ ఇస్లాం, క్రైస్తవేతరులు అందరినీ హిందువులుగా భావించుకుని కోరుకున్నది. అందరూ అతిజాతీయవాదాన్ని పరమత ద్వేషాన్ని కలిగుండాలని కోరుకున్నది తప్ప హిందూ సమాజంలో ఉన్న అసమానతలను, అవకతవకలను ఏనాడూ పశ్నించలేదు. భారతమాత, పుణ్యభూమీ అంటూ భూమికి భగవంతునికి ఇచ్చిన ప్రాధాన్యత మనుషులకు ఇవ్వలేదు. దళితులకు దేవాలయ ప్రవేశాలు లేకపోతే అడిగిన సందర్భాలు లేవు. అంటరానితనం, కులవివక్ష, కుల ఆధారిత హింసాత్మక ఘటనలపై పనిచేసిన సందర్భాలు అరుదు. ఇప్పటికి కూడా రెండు గ్లాసుల విధానం, అంటరానితనం అనబడే సాంఘిక దురాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటిపై నిర్దిష్టంగా ఆరెస్సెస్ పోరాడిన దాఖలాలు లేవు. ఆరెస్సెస్ ఏనాడు కులప్రస్తావన చేయదు. ”నువ్వు ఎవరు” అని ఎవరైనా అడిగితే ”హిందువు” అని సమాధానం చెప్పమంటుంది. కానీ కుల రహితంగా హిందువులందరూ సమానమని మాత్రం ఎప్పుడు చెప్పదు.
భారత సమాజంలో నెలకొని ఉన్న ఆర్థిక అసమానతల గురించి చర్చించడం, కుల వ్యవస్థ నిర్మూలించ బడాలని బహిరంగంగా ప్రస్తావించడం, కులాధిపత్యంతో జరుగుతున్న హింసపై స్పందించడం చాలా తక్కువ. అంతేకాకుండా అది ఆధిపత్య కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంకేతాలు స్పష్టంగా మనకు కనిపిస్తాయి. అనేక సందర్భాల్లో ఆరెస్సెస్ నాయకులు కుల వ్యవస్థ ఉండాలని, ”ఉంటే తప్పేంటి అది సమాజానికి దొరికిన సహజ పరిష్కార మార్గం” అనీ కూడా ప్రస్తావిస్తారు. నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో నిమ్నజాతులుగా పిలువబడేవారు, పై కులాలకు జవాబుదారీగా ఉండాలని బహిర్గతంగా ఒప్పుకుంటారు. మాల మాదిగల వాడలు ఊరి చివరన, మురుగునీరు ప్రవహించే దిక్కున ఎందుకుంటాయని ప్రశ్నిస్తే, తమదైన శైలిలో భాష్యాన్ని చెబుతూ, వారు ఊరికి రక్షణగా ఉండాలి కాబట్టి అలాంటి ఏర్పాటును మన పూర్వీకులు చేశారు, అది దేవుడి ఆజ్ఞ అంటూ సమర్థించు కుంటారు. వ్యక్తి ఆరాధన, కుల ప్రాతిపదికన గౌరవాలు ఇవ్వడాన్ని ప్రోత్సహిస్తారు.గతితార్కిక భౌతిక వాదాన్ని వ్యతిరేకిస్తారు.
అందుకే కమ్యూనిస్టు మెటీరియలిజాన్నీ సమూలంగా తులనాడుతారు. భావవాదం లేదా ఆరాధనతో కూడిన వేడుకోలు ద్వారా మాత్రమే ఫలితాలను ఆశించాలని బోధిస్తారు. అందుకే కార్మిక సంఘాలను నెలకొల్పినా పోరాటాలకు శ్రీకారం చుట్టిన సందర్భాలు చాలా తక్కువ. భావవాదం, అతి జాతీయవాదం, జాతి వివక్ష, కేవలం ఆరెస్సెస్ వంటి సంస్థల ప్రాబల్యం వల్ల మాత్రమే కాకుండా అభివృద్ధి చెందుతున్న ప్రజానీకంలో పెరిగిపోతుండడం ఒక పెద్ద ప్రమాద సంకేతం. ఇవి అమెరికా వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కనిపిస్తుండడం మరింత ఆందోళన కలుస్తున్నది. యూరప్‌లోని అనేక దేశాలు మత రహితంగా, ద్వేశ రహితంగా, సాంప్రదాయ వాదానికి స్వస్తి చెప్పి సమ్మిళిత అభ్యుదయ వాదంతో సాగుతుంటే అలాంటి మార్గాన్ని మనం ఎంచుకోకపోవడం బాధాకరం. భారతదేశమైనా లేదా మరో దేశమైనా, ఆస్తిత్వవాదంతో సాధించే ఆధిపత్యంలో శత్రుత్వం తామే తయారు చేసుకుంటున్నామన్న వాస్తవాన్ని గ్రహించాలి. లేకపోతే మూల్యం తప్పదు. ఇదే పంథాకు మూలమై, నాజీలు మాత్రమే పవిత్రులు, యూదులను అంతమొందించాలని యత్నించిన హిట్లర్ చరిత్ర ఫలితాన్ని మరువరాదు.
జి.తిరుపతయ్య
9951300016