బస్‌భవన్ ఎదుట స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ధర్నా
లేకపోతే నిరాహారదీక్షలు : రాజిరెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్(ఐఎన్‌టీయూసీ) డిమాండ్ చేసింది. ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు హైదరాబాద్‌లోని బస్సు భవన్ వద్ద శుక్రవారం జరిగిన ధర్నాకు ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి ముఖ్య అతిదిగా¸ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వస్తే ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరిస్తామనీ, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారని అన్నారు. కానీ అవేవీ అమలు కాలేదని విమర్శించారు. రాబోయే పీఆర్‌సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను తెస్తామని చెప్పినా ఇంతవరకు ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదని స్పష్టం చేశారు. పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రేస్ పార్టీ అభయ హస్తం మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన సమస్యలేవీ పరిష్కారం కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైన ఆర్టీసీ కార్మికుల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు. సమస్యలు పరిష్కరించక పోవడంతో కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. అదనపు ప్రధానకార్యదర్శి డి.గోపాల్ మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యం క్షేత్రస్థాయిలో కార్మికులపై పెంచుతున్న పనిభారాలను తగ్గించాలని కోరారు. వేధింపులు, అక్రమ సస్పెన్షన్లు, అక్రమ బదిలీలు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు కొవ్వూరు యాదయ్య అధ్యక్షత వహించగా ఉప ప్రధానకార్యదర్శి నగేష్ పటేల్, కోశాధికారి యం.వి.ఎన్ రావు, ప్రచార కార్యదర్శి కె.మనోహార్, రాష్ట్ర కార్యదర్శి బొడిగె వెంకటేష్ గౌడ్, నాయకులు ఈ.శంకరయ్య్య, ,గౌరెల్లి క్రిష్ణ, జి.పర్వతాలు బి.జక్రయ్య తదితర రాష్ట్ర కమిటీ నాయకులతో వివిధ డిపోలు నుండి వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు



