Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సుప్రీం చీఫ్ జస్టిస్ పై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి

సుప్రీం చీఫ్ జస్టిస్ పై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపేట
భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి పై బూటు విసిరి దాడికి పాల్పడ్డ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని నిరసిస్తూ శుక్రవారం మండల కేంద్రంలో ఉన్న తాసిల్దారు కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు రాజు ఎంఎస్పి పార్టీ జిల్లా అధ్యక్షులు కరిగేళ్ల దశరతం మాదిగలు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయి దళితుడు కావడం వల్లనే ఈ దాడి జరిగిందని అన్నారు. గవాయ్ స్థానంలో అగ్రకులాలకు చెందిన జడ్జి ఉంటే ఈ దాడి జరిగి ఉండేది కాదని అన్నారు. గవాయిపై జరిగిన దాడితో దళితుల ఆత్మగౌరవం ప్రమాదంలో పడింది అని అన్నారు. దళితులు ఉన్నత స్థానంలో ఉండడాన్ని ఉన్నత వర్గాలకు చెందిన శక్తులు జీర్ణించుకోలేక పోతున్నాయని అన్నారు.

ఈ సంఘటన జరిగి పది రోజులు గడుస్తున్న ఇప్పటికీ నేరస్తుడి మీద కేసులు పెట్టకపోవడం, అరెస్ట్ చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై జరిగిన దాడిపై కేసు నమోదు చేయకపోతే ఈ దేశంలో సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ప్రశ్నించారు. ఇకనైనా తక్షణమే దాడి చేసిన నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వెంటనే కేసు నమోదు చేయాలని అలాగే ఈ సంఘటన వెనుక ఉన్న శక్తులను గుర్తించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

నిందితుని అరెస్ట్ చేసేంతవరకు,  దళితులకు రక్షణ కల్పించేంతవరకు ఈ పోరాటం ఆగదని అన్నారు. మందకృష్ణ మాదిగ  పిలుపు మేరకు అక్టోబర్ 27న లక్షలాది మందితో హైదరాబాదులో దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనను నిర్వహించి తీరుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు దానం జగన్ రాజు మాదిగ అబ్బాసల్లీ వెంకటయ్య, నాగయ్య, మంగి రాజేష్, కట్నాల శివ, నరిగే, ఉషాన్న, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -