– రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించాలి : కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు
నవతెలంగాణ- భూపాలపల్లిటౌన్
మనుషుల మధ్య అసమానతలను స్థిరపర్చడమే ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ విధానమని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు అన్నారు. మనుస్మృతి, మనువాదానికి వ్యతిరేకంగా.. రాజ్యాంగ రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా కేంద్రం కారల్ మార్క్స్ నగర్‌లోని శ్రామిక భవన్‌లో సోమవారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో ”అంబేద్కర్ ఆశయాలు.. నేటి తరం కర్తవ్యాలు” అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. మనుస్మృతి భావజాలాన్ని మట్టుపెట్టకపోతే మరో వెయ్యి ఏండ్లయినా దేశ ప్రజల మధ్య ఐక్యత అసాధ్యమని చెప్పారు. తల్లి గర్భం నుంచి మనుషులు జన్మిస్తారని, కానీ మనుస్మృతి దానిని అంగీకరించదని చెప్పారు. అసమానతలను స్థిరపరచడానికి చాతుర్వర్ణ వ్యవస్థను సమాజంపై రుద్దిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థను దోపిడీ సాధనంగా పేదల ఐక్యతకు ఆటంకంగా కొనసాగిస్తుందని అన్నారు. దేశంలో సామాజిక అసమానతలు, వివక్షతకు కారణం మనుధర్మ శాస్త్రమని తెలిపారు. కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంద సంపత్ మాట్లాడుతూ.. రాజీవ్ యువశక్తి పేరిట దరఖాస్తులు చేసుకున్న అర్హులైన లబ్దిదారులందరికీ తక్షణమే రుణాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇసునం మహేందర్, గుర్రం దేవేందర్, జిల్లా ఉపాధ్యక్షులు అత్కూరి శ్రీధర్, నాయకులు పొట్టయ్య, చందు, సంతోష్ కుమార్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
అసమానతలు పెంచడమే ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ విధానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



