పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి
సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.
వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సిపిఐ(ఎం) వినతి
నవతెలంగాణ-వైరాటౌన్
వైరా నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రస్తుత పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కోసం వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలను పరిష్కరించాలని, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌళిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు. మంగళవారం సీపీఐ(ఎం) వైరా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలను పరిష్కరించాలి కోరుతూ స్థానిక వైరా ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యను ప్రభుత్వం బలోపేతం చేయాలని, నిరుపేద విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలి అన్నారు.
సీపీఐ(ఎం) బృందం వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులు, అధ్యాపకులతో చర్చించి గుర్తించిన ప్రధానమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. శిధిలవ్యవస్థలో ఉన్న పాత భవనాన్ని తొలగించి నూతన భవనాన్ని నిర్మించాలని, ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేసిన 3.5 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని, విద్యార్థులకు లైబ్రరీ ఏర్పాటు చేయాలని, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మంజూరు చేసిన రూ.25 లక్షల నిధులను వెంటనే విడుదల చేసి అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని అన్నారు. ఫిజికల్ డైరెక్టర్ పోస్టును భర్తీ చేయాలని, బాలబాలికలకు ఎస్ఎం హాస్టల్ స్వంత భవనాలు నిర్మించాలని, విద్యార్థులకు మరుగుదొడ్లను నిర్మించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ మంజూరు చేయాలని, వైరా నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలని, సైన్స్ విద్యార్ధులకు ల్యాబ్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని తెలిపారు.
విద్యార్థులకు గేమ్స్ మెటీరియల్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ(ఎం) వినతికి స్పందించిన ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు కేటాయింపు చేయించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, వైరా డివిజన్ కమిటీ సభ్యులు తూము సుధాకర్, వైరా పట్టణ నాయకులు కొంగర సుధాకర్, పైడిపల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.



