Thursday, January 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిజయ డెయిరీ రైతుల సమస్యలు పరిష్కరించాలి

విజయ డెయిరీ రైతుల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

దాణాను సబ్సిడీపై అందించాలి
గుత్తా అమిత్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిలకు పాడిరైతుల వినతి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
విజయ పాడి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ, సబ్సిడీపై దాణాను అందించాలని తెలంగాణ విజయ పాడి రైతుల పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ కో ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ చైర్మెన్‌ గుత్తా అమిత్‌ రెడ్డి, ఎమ్‌డీ చంద్రశేఖర్‌ రెడ్డిలకు వినతిపత్రాన్ని అందజేశారు. పాడిపశువులకు, దాణా, మినరల్‌ మిక్చర్‌, కాల్షియం, నట్టల గోలీలు అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రతి పదిహేను రోజులకోసారి పాల బిల్లులు చెల్లించాలని విన్నవించారు. టిప్‌ ఫండ్‌ను బీఎమ్‌సీయూల పరిధిలో సమీక్షలు నిర్వహించి ఖర్చుపెట్టాలని విజ్ఞప్తి చేశారు.

ట్రాన్స్‌పోర్ట్‌ కమిటీలు ఏర్పాటు చేయాలనీ, ఫెడరేషన్‌ లాభాలు వచ్చేలా టెండర్లు వేయాలని కోరారు. ప్రతి మూడు నెలలకోసారి సొసైటీ అధ్యక్షలు, కార్యదర్శులతో సమీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతి పాడిరైతుకు కూడా 80 శాతం సబ్సిడీతో పాడి పశువులను ఇవ్వాలని కోరారు. డెయిరీ అధికారులపై ఫిర్యాదులొచ్చినా, రైతులకు నష్టాలపై ఫిర్యాదులొచ్చినా వెంటనే పరిష్కరించాలని విన్నవించారు. పాలసేకరణ, ప్యాడ్‌కు సంబంధించి అన్ని సొసైటీలకు కొత్త మిషన్లు పంపిణీ చేయాలని కోరారు. పాడిరైతులకు, పాడిపశువులకు ఉచితంగా ఇన్సూరెన్స్‌ పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. పాలకు ఎస్‌ఎన్‌ఎఫ్‌ తగ్గించి పాలరేట్‌ను పెంచాలని కోరారు.

తెలంగాణ విజయ పాడి రైతుల పరిరక్షణ సమితి నూతన కమిటీ ఎన్నిక రాష్ట్ర అధ్యక్షులుగా ఇరుకు దేవేందర్‌, ప్రధాన కార్యదర్శిగా గనుప లక్ష్మారెడ్డి
తెలంగాణ విజయ పాడి రైతుల పరిరక్షణ సమితి నూతన కమిటీని సోమవారం హైదరాబాద్‌లో ఎన్నుకున్నారు. 20 జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొని కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఇరుకు దేవేందర్‌(వరంగల్‌), ప్రధాన కార్యదర్శిగా గనుప లక్ష్మారెడ్డి(సిద్దిపేట), రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సాదం రమేశ్‌(జనగామ), కోశాధికారిగా వాలాద్రి అంజిరెడ్డి(సిద్దిపేట) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఉపాధ్యక్షులుగా మహేందర్‌రెడ్డి(రంగారెడ్డి), చింతకుంట తిరుపతి రెడ్డి (కామారెడ్డి), వీరమళ్ల రాజయ్య(మంచిర్యాల), తెల్లపల్లి రాంలింగారెడ్డి(నాగర్‌ కర్నూల్‌), కోట్ల శ్రీనివాస్‌ యాదవ్‌ (కల్వకుర్తి), కాసారపు ధర్మారెడ్డి(జనగామ) ఉండనున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా కుర్రేముల శ్రీనివాస్‌ (జనగామ), శ్యామల ప్రశాంత్‌ రెడ్డి(నాగర్‌ కర్నూల్‌), రవీందర్‌రెడ్డి (మహబూబ్‌ నగర్‌), ఆర్‌. శ్రీనివాస్‌ గుప్తా(నాగర్‌ కర్నూల్‌), నర్సింహారెడ్డి (కామారెడ్డి), రసాల సమ్మయ్య (మహబూబాబాద్‌), రాంనర్సయ్య(యాదాద్రి భువనగిరి), జీవన్‌(సంగారెడ్డి), మాణిక్‌ రెడ్డి (సంగారెడ్డి), పరుచూరి నరేంద్ర(వరంగల్‌) ఎన్నికయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -