Sunday, July 13, 2025
E-PAPER
Homeఎడిట్ పేజినల్ల చట్టాలకు ఎరుపు సమాధానం

నల్ల చట్టాలకు ఎరుపు సమాధానం

- Advertisement -

చీకట్లో పెద్దల సభ ఆమోదించిన నల్ల చట్టాలను దేశం మొత్తంగా ఎర్ర జెండా రెపరెపలు వెక్కిరించాయి. చరిత్రలో ఎన్నో ప్రాణాలొడ్డి తెచ్చుకున్న ఎనిమిది గంటల పనివిధానాన్ని మార్చడం మాకు సుతరామూ ఇష్టంలేదని సమ్మెతో తేల్చేశాయి కార్మిక సంఘాలు. పెహల్గావ్‌ ముష్కరులదాడి జరిగాక మేలో ఉండవలసిన సమ్మెను జూలై తొమ్మిదికి వాయిదా వేసిన కార్మిక సంఘాలు నిజమైన దేశభక్తి కలిగిన సంఘాలు. మృతుల కుటుంబాలకు ఎటువంటి ఆటంకం కలుగకూడదని తమకు తామే నిర్ణయం తీసుకున్నాయి. అదీ కాక పెహల్గావ్‌ మారణకాండ, అహ్మదాబాద్‌ విమాన ప్రమాదాల సందర్భంగా వచ్చే క్లెయిముల విషయంలో ప్రభుత్వ బీమా కంపెనీలు సులుభతరం చేస్తామని ప్రకటించడం, తరువాత చేయడం వెనుక ఉన్న ఉద్యోగుల దేశభక్తీ చూశాం. దేశభక్తిని మోస్తున్న మీడియా ఈ వార్తను కార్మిక సంఘాల దేశభక్తిగా గుర్తించి రాయడం అటుంచి చిన్నగానైనా వేయలేదు. సింగరేణిని కాపాడుకోవడంలో, విశాఖ ఉక్కును కాపాడుకోవడంలో ఉన్న దేశభక్తిని ఈ మీడియా రాయదు, వాటిని అమ్మేద్దామని ప్రయత్నాలు చేసేవారి గురించి రాస్తుంది.
ఒక సమ్మె అయిపోయింది. ఎటు చూసినా ఎర్ర జెండాలు, బ్యానర్లు, నినాదాలు. రహదారులన్నీ ఎర్రని నదులైనాయి. తిరిగి అన్నీ ఒకచోట చేరి ఎర్ర సముద్రమైనాయి. ఇలాంటి ఎర్రసముద్రాలు దేశంలో ఎన్నో కనిపించాయి. ఏ అనుమానమూ లేక వాటిల్లో పాల్గొన్నవారున్నారు, అనుమానాలున్నా కలిసి నడిచిన వాళ్ళున్నారు, నాయకుల పైనా, సంఘాలపైనా నమ్మకం అది. ఇదంతా తమకు సంబంధం లేదని ఆఫీసుల్లో పనిచేసుకున్నవాళ్ళూ ఉన్నారు. ఎందుకంటే తమ నాయకులు పిలుపివ్వలేదని కొన్ని అధికారుల సంఘాల వాళ్ళు సమ్మెలోకి రాలేదు. ఏమైనా నల్ల చట్టాల వల్ల నష్టపోయేవాళ్ళలో, బాధపడేవాళ్ళలో ఈ సమ్మెకు రానివాళ్ళూ ఉంటారు. ఆ విషయం తరువాత తెలుసుకుంటారు వాళ్ళు.
రాజకీయులు మాత్రం ‘ఆ…! ఈ సమ్మెలతో ఏమవుతుంది.. మన ఓట్లు మనకు పడతారు… అప్పుడు వీళ్ళేమి చేస్తారు’అని అనుకుంటు న్నారు. ఆ వేసే ఓట్లలో ఈ ఎర్రసముద్రపు కార్మికులు, వాళ్ళ కుటుంబాలు, బంధువులు కూడా ఉన్నారని మరిస్తే ఇక అంతే. తమ ప్రియమైన మిత్రులకు దోచిపెడితే చాలునన్న భక్తిలో పొంగిపోతే రేపు వాళ్ళు కాపాడలేరు సరికదా అదే స్నేహితులు నీవు రాకపోతే తమ పనులు చేసిపెట్టడానికి ఇతరులను వెదుక్కుంటారు. ఇది వ్యాపార లక్షణం, చరిత్రలో రుజువైన సత్యం. రాజకీయాల్లో శాస్వత మిత్రులు, శత్రువులు ఉండరని చెబుతారు. అలాగే ఈ వ్యాపార రాజకీయ స్నేహం కూడా గాలివాటంగా ఉంటుందని ఇంతకు ముందు చూశాం, ఇకముందూ చూస్తాం.
ఆవాజ్‌ దో హం ఏక్‌ హై, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, పాత పింఛను అందరికీ కావాలి.. మొదలైన నినాదాలు ఈ సమ్మెలో మిన్నంటాయి. సమ్మెకు ఇంతమంది మద్దతు ఉందా అని అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. కడుపు మండినవాళ్ళు ఎప్పుడైనా రోడ్డెక్కుతారు, తమకు న్యాయం చేయాలని మొదట మామూలుగా అడుగుతారు. వినకుంటే అందరినీ కూడగట్టి గట్టిగా నిరసన తెల్పుతారు. ఇక ఎంతకీ వినడం లేదని అర్థమయ్యాక సమ్మె చివరి అస్త్రంగా వాడతారు. అంతే తప్ప ఎవరూ ఊరకే సమ్మె చేయరు. చిన్న పాపైనా తన కోర్కెలు తెల్పడానికి, తన నిరసన తెల్పడానికి గట్టిగా ఏడుస్తుంది, అరుస్తుంది, తన బొమ్మలు విసిరి కొట్టి మరీ సమ్మె చేస్తుంది. అలాంటిది జీవితంలో ఎన్నో కష్టాలు చూసి, అనుభవించిన కార్మికులు ఎర్ర జెండానే తమ కష్టాలు తీర్చే ఏకైక సాధనమని గట్టిగా నమ్మడం వెనుక ఆ ఎర్ర జెండా చేసిన త్యాగాలే ఓ బలమైన నిదర్శనం. కార్మికుల నమ్మే నిజమైన సిందూరం ఈ ఎర్రజెండా.
‘కొంతమంది కుర్రవాళ్ళు ముందు యుగం దూతలు’ అని మహాకవి రాశాడు ఎప్పుడో. అలా రాజకీయాల్లో, ప్రజా సేవలో నిత్యం మనుగడ సాగించే నాయకులు ఎర్రజెండా చేతపట్టి ఎప్పుడూ ముందుకే మునుముందుకే సాగుతున్నారు. ఆటుపోట్లు జీవితంలోని ఏ విషయంలోనైనా అతి సహజం. అలాంటి వాటికి సమాధానాలు కనుక్కొని ఎర్రజెండా ముందుకు కదుల్తుంది, అందరినీ కదిలిస్తుంది మరి. జీవితంలో ఆశ అన్నదాన్ని కోల్పోకపోవడమే విజయానికి మార్గమని వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఒక పక్క చెబుతుంటే దాన్ని మన కళ్ళముందు చేసి చూపిస్తున్నది ఎర్ర జెండా. ప్రవాహంలో కొట్టుకుపోయేవారికీ, ప్రవాహానికి ఎదురీదేవారికి తేడా ఎప్పుడూ ఉంటుంది. పోరాడేవారి వాహినిలో కలిస్తే ఎవరికైనా బలం వస్తుంది.
అనుమానాలతో, అధైర్యంతో ఎవరూ ముందుకు పోలేరు. కొన్ని చారిత్రక సత్యాల్ని పరిశీలిస్తే పోరాడితేనే విజయం దక్కుతుందని తెలుస్తుంది. జీనాహైతో మర్‌నా సీకో.. కదంకదం పర్‌ లఢ్‌నా సీకో.. అని ఊరకే అనలేదు. అలాగే సమైక్యంగా చేసే ఏ పనీ విఫలంకాదు. ఇప్పుడు జరిగిన సమ్మె కూడా అలాంటిదే. ధైర్యాన్ని కోల్పోయినవారు వెనుతిరిగితే, అదే ధైర్యాన్ని పోగొట్టుకోకుండా ముందుకు ఉరికేవాళ్ళే ఈ సమ్మెకు పిలుపునిచ్చి అందరినీ ఒక వైపుకు మళ్ళించి తమ సత్తా చాటారు, ఇక ముందూ చాటుతారు. నిజంగానే ఈ నల్ల చట్టాలకు ఎర్రజెండా సమాధానం చూశాక అనుమానాలతో ముందుకు రానివాళ్ళు కూడా ముందుకురావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తామూ ఆ జెండా, అజెండా పట్టుకొని ముందుకుపోవడమే మంచిదని ఎందరో గ్రహించారిప్పుడు…
జంధ్యాల రఘుబాబు
9849753298

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -