Monday, October 27, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుసామ్రాజ్యవాదాన్నిఎదిరించేది ఎర్రజెండానే

సామ్రాజ్యవాదాన్నిఎదిరించేది ఎర్రజెండానే

- Advertisement -

కమ్యూనిస్టులకు సీట్లు, ఓట్లతో సంబంధం లేదు
బీసీ రిజర్వేషన్లకు బీజేపీయే దోషి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
పాషా, నరహరి ఆశయ స్ఫూర్తితో ఉద్యమాలు
ఇబ్రహీంపట్నంలో కామ్రేడ్‌ పాషా, నరహరి 36వ వర్ధంతి సభ

నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
అమెరికన్‌ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించేది ఎర్రజెండా మాత్రమేనని, దోపిడీ, పేదలు, అణిచివేత, అవినీతి, అరాచకత్వం ఉన్నన్ని రోజులు ఎర్రజెండా బతికే ఉంటుందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. కమ్యూనిస్టులను లేకుండా చేయాలని చూస్తున్న సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ, పాలక పక్షాలు.. ముందు పేదరికం, దోపిడీ లేని సమాజాన్ని నిర్మించాలని హితవు పలికారు. పాషా, నరహరి అమరుల ఆశయ స్ఫూర్తితో భవిష్యత్తు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అమరవీరులు పాషా, నరహరి 36వ వర్ధంతిని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ఆదివారం నిర్వహించారు.

అంతకు ముందు ఆర్టీసీ డిపో నుంచి చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ముందుగా పాషా, నరహరి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.సామెల్‌ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో తమ్మినేని మాట్లాడారు. ఎర్రజెండా నాయకత్వంలోనే పేదలు, రైతులు, కూలీలు ఉద్యమించి తన హక్కులు సాధించుకుంటున్నారని అన్నారు. కమ్యూనిస్టులకు సీట్లు, ఓట్లు ముఖ్యం కాదన్నారు. ఉద్యమాల్లో హత్యలు, లాఠీలు, తూటాలు, కేసులకు ఎర్రజెండా నాయకత్వం ఎదురొడ్డి నిలబడుతోందని తెలిపారు. 170 ఏండ్ల చరిత్ర కలిగిన కమ్యూనిజం పడి లేచిన కెరటంలా విస్తరిస్తోందన్నారు.

నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమాలు విస్తరిస్తున్నాయని తమ్మినేని అన్నారు. అమెరికన్‌ సామ్రాజ్యవాదాన్ని సైతం ఎర్రజెండా ఎదిస్తోందన్నారు. అమెరికా రూ.37 లక్షల కోట్ల డాలర్ల అప్పుల్లో కూరుకుపోయిందని, ఈ అప్పుల నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాల మీద సుంకాలు విధిస్తోందని తెలిపారు. దాంతో అన్ని దేశాలూ వణికిపోతున్నాయన్నారు. చైనా మాత్రమే అమెరికాను ఎదిరించి నిలబడుతుందని తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు అడ్డు పడుతోందన్నారు. 42శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే గవర్నర్‌ సంతకం చేయకుండా, కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపకుండా బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారని అన్నారు. రిజర్వేషన్లను అడ్డుకోవడంలో అసలు దోషీ బీజేపేనని విమర్శించారు.

కేంద్రంలో బీసీ జనగణన చేయాలని అన్ని రాజకీయ పక్షాలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినా మోడీ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు సాధించుకునేందుకు అన్ని రాజకీయ పక్షాలు ఢిల్లీలో కూర్చొని తేల్చుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజాంగాన్ని లేకుండా చేయాలని చూస్తున్న మోడీ ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో ఫోర్త్‌ సిటీ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేద రైతుల నుంచి భూములు లాక్కొంటోందని తమ్మినేని అన్నారు. మరోవైపు త్రిబుల్‌ఆర్‌ పేరుతో రైతుల నుంచి భూములు తీసుకుంటుందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌.. నేడు అదే ఫార్మాసిటీని కొనసాగించడం ఏమిటని ప్రశ్నించారు. మరోవైపు ఫ్యూచర్‌ సిటీ పేరుతో మరిన్ని భూములను కాంగ్రెస్‌ ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. ఈ విధానం సరైనది కాదన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అప్పుడే పాషా, నరహరిలకు నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, కార్యదర్శివర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్‌, డి.రాంచందర్‌, బి.సామెల్‌, జగదీష్‌, కందుకూరి జగన్‌, ఏర్పాల నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు అలంపల్లి నర్సింహ, రావుల జంగయ్య, సీహెచ్‌ బుగ్గరాములు, సీహెచ్‌ జంగయ్య, డి.కిషన్‌, కె.శ్రీనివాస్‌రెడ్డి, గోరెంకల నర్సింహ, పి.జగన్‌, పి.అంజయ్య, మున్సిపల్‌ కార్యదర్శి ఎల్లేశ్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శంకర్‌, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి ప్రకాష్‌ కరత్‌, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -