Wednesday, July 9, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపేదల కష్టంలో ముందుండేది ఎర్రజెండానే

పేదల కష్టంలో ముందుండేది ఎర్రజెండానే

- Advertisement -

– ప్రభుత్వ భూమి ప్రయివేటు భూమిగా ఎలా మారింది ?
– పేదల గుడిసెలను ప్రయివేటు వ్యక్తులు ఎలా ఖాళీ చేయిస్తారు?
– పేదలకు ఇండ్ల స్థలాలు వచ్చే వరకూ పోరాడుతాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– గచ్చిబౌలి డివిజన్‌ బసవతారక్‌నగర్‌లో పార్టీ బృందం పర్యటన
– ప్రయివేటు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుల ఫిర్యాదు
నవతెలంగాణ-మియాపూర్‌

ప్రభుత్వ భూమి ప్రయివేట్‌ భూమిగా ఎలా మారిందని, పేదల గుడిసెలను ప్రయివేట్‌ వ్యక్తు లు ఎలా ఖాళీ చేయిస్తారని, ఇంత జరుగుతుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేద వారి కష్టంలో ముందుండేది ఎర్రజెండానేనని స్పష్టం చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి డివిజన్‌ గోపన్‌పల్లి గ్రామంలోని పేదల గుడిసెలను కాల్చివేసిన బసవతారక్‌నగర్‌ను మంగళవారం సీపీఐ(ఎం) బృందం పర్యటించింది. గుడిసెవాసులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంది.


ఈ సందర్భంగా గుడిసెవాసులు మాట్లాడుతూ.. ”40 ఏండ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నాుం. ఎప్పుడూ లేనిది.. ఇప్పుడు ప్రయివేట్‌ వ్యక్తులు వచ్చి తమపై బెదిరింపులకు పాల్పడుతూ గుడిసెలు ఖాళీ చేయాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం వారికే వత్తాసు పలుకుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ బృందం బాధితులకు భరోసానిచ్చింది. ఇండ్ల స్థలాలు దక్కే వరకూ అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. 40 ఏండ్లుగా నివాస ముంటున్న పేదలను కొంత మంది ప్రయివేట్‌ వ్యక్తులు కోర్టు పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ప్రజలపై దౌర్జన్యం చేస్తూ వారిని ఆ స్థలం నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. గత ప్రభుత్వం వీరిని ఖాళీ చేయించాలని ప్రయత్నం చేసినప్పుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, నేటి సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాంతవాసుల తరపున నిలబడ్డారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ఈ భూములు ఇక్కడి పేదలకే ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అవ్వగానే నాటి హామీని మర్చిపోయారా అని ప్రశ్నించారు. నాడిచ్చిన హామీని అమలు చేయాలని సీఎంను డిమాండ్‌ చేశారు. ప్రయివేట్‌ వ్యక్తులు పేద ప్రజలను మభ్యపెడుతూ డబ్బులకు లొంగని వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం కనీసం వారికి అండగా నిలవడం లేదన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న వ్యక్తులే ఇలా ప్రవర్తించడం ఏమాత్రం సరైన విధానం కాదని తెలిపారు. ఇది ప్రభుత్వ స్థలం అని కలెక్టర్‌ సుప్రీంకోర్టుకి తెలిపారన్నారు. కోర్టు ఎలాంటి జడ్జిమెంట్‌ ఇవ్వకపోయినా.. తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని ప్రయివేటు వ్యక్తులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. నిజంగానే కోర్టులో ప్రయివేట్‌ వ్యక్తులకు అనుకూలంగా తీర్పు వస్తే ఇక్కడున్న ప్రజలను ఖాళీ చేయించే పద్ధతి ఇది కాదన్నారు.


40 ఏండ్లుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ప్రజలు ప్రయివేట్‌ పట్టాలో ఉన్నప్పటికీ అది పేద ప్రజలకే దక్కుతుందని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని బసవతారక్‌నగర్‌ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సీపీఐ(ఎం), ఇతర వామపక్ష, ప్రజాతంత్ర సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డీజీ నర్సింగ్‌ రావు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్‌, నాయకులు కృష్ణ, అతిక్‌, జార్జ్‌ కృప, అనిల్‌, శ్రీనివాస్‌, జంగయ్య, శివుడు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -