Thursday, October 16, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఎర్రజెండాతోనే మానవాళికి విముక్తి

ఎర్రజెండాతోనే మానవాళికి విముక్తి

- Advertisement -

ఇట్టమల్ల ఏసోబు సంస్మరణసభలో..సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
సీపీఐ(ఎం) మండల కార్యాలయానికి శంకుస్థాపన

నవతెలంగాణ-చివ్వెంల
నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకూ కమ్యూనిస్టుగా జీవించిన ఇట్టమల్ల ఏసోబు జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, ఖమ్మం మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలోని వెంకట్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు, చివ్వెంల తొలి ఎంపీపీ ఇట్టమల్ల ఏసోబు సంస్మరణ సభ నిర్వహించారు. ఏసోబు చిత్రపటానికి తమ్మినేని వీరభద్రం పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అధ్యక్షతన నిర్వహించిన సభలో తమ్మినేని మాట్లాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. దోపిడీ వ్యవస్థ పోవాలంటే అది కమ్యూనిస్టుల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ప్రపంచ మానవాళికి విముక్తి కల్పించేది ఎర్రజెండా మాత్రమేనని తెలిపారు.

అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న భారత రాజ్యాంగాన్ని మనువాద బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని విమర్శించారు. ప్రజలకు చెందాల్సిన దేశ సంపద మొత్తాన్ని అదానీ, అంబానీలకు బీజేపీ ప్రభుత్వం కట్టబెడుతోందన్నారు. అనేక హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 23 నెలల పాలనలో నేటికీ ఏ ఒక్క వాగ్దానం అమలు చేయలేదన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం అనుసరించిన వాటినే కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బిల్లును గవర్నర్‌, రాష్ట్రపతి ఆమోదించలేదన్నారు. రిజర్వేషన్లకు బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. కడవరకూ కమ్యూనిస్టుగా బతికిన ఇట్టమల్ల ఏసోబు ఆశయాన్ని ముందుకు తీసుకుపోతామన్నారు.

కార్యాలయ నిర్మాణానికి కుటుంబసభ్యుల స్థల వితరణ
ఇట్టమల్ల ఏసోబు జ్ఞాపకార్థం చివ్వెంల మండలకేంద్రంలో మూడుగుంటల స్థలాన్ని ఆయన కుటుంబ సభ్యులు సీపీఐ(ఎం) కోసం, ప్రజా ఉద్యమాల కోసం అందజేశారు. ఈ స్థలంలో సీపీఐ(ఎం) చివ్వెంల మండల కమిటీ కార్యాలయ నిర్మాణానికి తమ్మినేని వీరభద్రం, చెరుపల్లి సీతారాములు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏసోబు కుటుంబసభ్యులను వారు అభినందించారు. అనంతరం ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో రూపొందించిన కడదాక కమ్యూనిస్టుగా బతికిన ఇట్టమల్ల ఏసోబు అనే స్మృతి గీతం ఆడియోను తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వర్లు, సీపీఐ సీనియర్‌ నాయకులు ఖమ్మంపాటి అంతయ్య, ఇస్లావత్‌ రామచంద్రనాయక్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, పారేపల్లి శేఖర్‌రావు, చెరుకు ఏకలక్ష్మి, కోటగోపి, నాయకులు పేరుమల్ల రాజారావు, బొమ్మిడి లక్ష్మీనారాయణ, ఇట్టమల్ల స్టాలిన్‌, ఖమ్మం పాటిరాము, ఇట్టమల్ల కిరణ్‌, వేల్పుల వెంకన్న, బచ్చలకూర రామ్‌చరణ్‌, బొప్పాని సులేమాన్‌, పల్లేటి వెంకన్న, కొల్లూరిబాబు, కలగాని సోమయ్య, దుర్గయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

జీవితాంతం ప్రజాసేవకు అంకితమైన ఏసోబు : మల్లు లక్ష్మి, చెరుపల్లి సీతారాములు
తన జీవితాంతం పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన మహానేత ఏసోబు అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి, సీనియర్‌ నాయకులు చెరుపల్లి సీతారాములు అన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన ఉన్నత చదువులు చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రజా ఉద్యమాలే ఊపిరిగా భావించి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా పనిచేశారని అన్నారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకుడిగా ఉన్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -