‘ఉపాధి హామీ’ రద్దుతో గిరిజనులకు తీవ్ర అన్యాయం
అటవీచట్టాల రద్దుకు కేంద్రం కుట్ర
మోడీ విధానాలపై ప్రశ్నించేందుకు చంద్రబాబు, జగన్‌లకు భయమెందుకు? : బీవీ రాఘవులు
పోలవరం అక్రమాలపై న్యాయ విచారణ జరపాలి: వి.శ్రీనివాసరావు
చింతూరులో ఘనంగా సీపీఐ(ఎం) అమరవీరుల సంస్మరణ సభ
రాజమహేంద్రవరం : ప్రజల తరఫున పోరాడిన నిజమైన విప్లవకారులు మార్క్సిస్టులని, మార్క్సిస్టు సిద్ధాంతాన్ని అనుసరించిన కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఈ మేరకైనా విద్య, వైద్యం, మౌలిక వసతులు కల్పించబడ్డాయంటే అది సీపీఐ(ఎం) పోరాట ఫలితమేనని వివరించారు. సీపీఐ(ఎం) అమరవీరుల సంస్మరణ సభ చింతూరులోని పాత ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో ఆదివారం జరిగింది. పార్టీ ఏఎస్‌ఆర్ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో భాగంగా బత్తుల భీష్మారావు భార్య హైమావతి రచించిన భీష్మారావు పుస్తకాన్ని వేదికపై ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యఅతిథి రాఘవులు మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేస్తున్న తమ పార్టీ నేతలైన బత్తుల భీష్మారావు, బండారు చందర్రావులను 40 సంవత్సరాల క్రితం మావోయిస్టులు పొట్టన పెట్టుకున్నారని గుర్తు చేశారు.
అక్కడి నుంచి మొదలై శ్యామల వెంకటరెడ్డి, పులి రామయ్య, పట్రా ముత్యం వంటి వారిని కూడా హత్య చేశారని వివరించారు. కుంజా బొజ్జి, సున్నం రాజయ్య వంటి సుమారు 30 మంది నాయకులు ఓవైపు పాలకులు, మరోవైపు మావోయిస్టుల నిర్బంధాలను ఎదుర్కొని గిరిజన ప్రజలకు అండగా నిలబడి అనేక సేవలందించారని గుర్తుచేశారు. అటువంటి వారందరినీ స్మరించుకునేందుకే ఈ సంస్మరణ సభ అని తెలిపారు. తుపాకులతో విప్లవం రాదని, విప్లవాన్ని ప్రజలు తీసుకొస్తారని ఆనాడే పుచ్చలపల్లి సుందరయ్య తదితర ముఖ్య నేతలు సైద్ధాంతికంగా వివరించారని, తమ పార్టీ అనుసరించిన సిద్ధాంతం గొప్పదని రాఘవులు అన్నారు. ప్రస్తుతం పాము తన పిల్లలను చంపుకొని తిన్నట్టుగా మావోయిస్టు పార్టీ ముఖ్య నేతలు కొందరు బీజేపీ పంచన చేరి వ్యవహరిస్తున్న తీరును వివరించారు.
మోడీ ప్రభుత్వం అనుసరిస్తోన్న ఆపరేషన్ కగార్‌ను, హిడ్మాలాంటి అనేకమంది మావో యిస్టులపై జరిగిన అక్రమ ఎన్‌కౌంటర్లను ప్రశ్నించినది సీపీఐ(ఎం) ఒకటేనని తెలిపారు. ప్రజాస్వామ్య యుతంగా నిర్వహించే పోరాటాలలో కలిసి వచ్చి వామపక్ష ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తోన్న గిరిజన వ్యతిరేక విధానాలను రాఘవులు వివరించారు. అటవీ హక్కుల చట్టాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని తెలిపారు. పీసా, 1/70 వంటి చట్టాలకు మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దుతో గిరిజన ప్రాంతాల్లో ఉపాధికి పూర్తిగా గండిపడుతుందని, లేబర్ కోడ్స్ పేరుతో కార్మికుల హక్కుల హననం జరుగుతోందని తెలిపారు. ఏపీలో ప్రజలకు అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
యోగి విధానాలను అమలు చేస్తామంటే రాష్ట్ర ప్రజలు ఉద్యమిస్తారు : వి శ్రీనివాసరావు
సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ పాలన తీసుకొస్తామంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఆదిత్యనాథ్ పాలనలో నేరాలు రికార్డు స్థాయిలో నమోదైన విషయాన్ని గుర్తుచేశారు. అటువంటి విధానాలను ఇక్కడ అమలు చేస్తామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమిస్తారని హెచ్చరించారు.
పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్ మాట్లాడుతూ ఎర్రజెండా గత వైభవాన్ని పునరుద్ధరించేందుకు అమరవీరుల స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఐద్వా తెలంగాణ రాష్ట్ర నాయకులు బత్తుల హైమావతి, సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర నాయకులు మచ్చ వెంకటేశ్వరరావు, ఎజె.రమేశ్, నర్సారెడ్డి, ఎఎస్‌ఆర్ రంపచోడవరం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు, సున్నం రాజులు, లోతా రామారావు, పి.వెంకట్, మట్ల వాణిశ్రీ, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అమరవీరుల సంస్మరణ సభ నేపథ్యంలో చింతూరు ఎరుపెక్కింది. ఎక్కడ చూసినా ఎర్రజెండాల తోరణాలే కానవచ్చాయి. అమరవీరుల చిత్రపటాలకు రాఘవులు, శ్రీనివాసరావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లర్పించారు.



