నవతెలంగాణ – మిర్యాలగూడ
పాలకులకు మద్యం టెండర్లపై ఉన్న శ్రద్ధ కార్మికుల సమస్యలపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరమని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.సయీద్ అన్నారు. ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం ఆస్పత్రి ఎదుట కార్మికులతో కలసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్టు కార్మికుల టెండర్ కాలపరిమితి ముగిసి రెండు నెలలు గడుస్తున్నా నేటికీ టెండర్ పిలవకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
ప్రభుత్వం నెలలు తరబడి కాలయాపన చేస్తూ సమస్యను జటిలం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నాలుగు పండుగ. ప్రతి నెల వేతనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్మిక చట్టాలను పాటించని గుత్తేదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఊటుకూరి శ్రీను, కార్మికులు జానకి రాములు, శాంతమ్మ, పర్వీన్, మంగమ్మ, ఝాన్సీ, ఏడుకొండలు, శ్రవణ్, జానీ పాల్గొన్నారు.



