Wednesday, December 17, 2025
E-PAPER
Homeబీజినెస్మార్కెట్లకు రూపాయి బెంబేలు

మార్కెట్లకు రూపాయి బెంబేలు

- Advertisement -

సెన్సెక్స్‌ 500 పాయింట్ల పతనం
రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరి


ముంబయి : రూపాయి ఆల్‌టైం రికార్డ్‌ పతనం దలాల్‌ స్ట్రీట్‌ను బెంబేలెత్తించింది. మరోవైపు అంతర్జాతీయ ప్రతికూలాంశాలు, భారత స్టాక్‌ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ)లు భారీగా తమ నిధులను తరలించుకుపోవడం, దేశీయ ఆర్థిక వ్యవస్థలోనూ సానుకూల సంకేతాలు కానరాకపోవడంతో ఇన్వెస్టర్లకు అమ్మకాలకు తెరలేపారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 534 పాయింట్లు లేదా 0.63 శాతం పతనమై 84,679.86కు పడిపోయింది. అదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 167 పాయింట్లు లేదా 0.64 శాతం నష్టంతో 25,860కి పరిమితమయ్యింది. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ సూచీ 0.78 శాతం, స్మాల్‌ క్యాప్‌ సూచీ 0.69 శాతం చొప్పున నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 91కి చేరడం ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన కలిగించింది.

భారీ అమ్మకాల ఒత్తిడితో ఒక్క పూటలోనే మదుపర్ల సంపద దాదాపు రూ.3 లక్షల కోట్లు కరిగిపోయింది. బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.467.6 లక్షల కోట్లకు పడిపోయింది. ఇంతక్రితం సెషన్‌లో 471 లక్షల కోట్లుగా ఉంది. ముఖ్యంగా మెటల్‌, రియల్టీ, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఎటెర్నెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌ షేర్లు అధికంగా 5 శాతం వరకు నష్టపోయిన వాటిలో ఉండగా.. మరోవైపు టైటాన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, ట్రెంట్‌ షేర్లు అధికంగా ఒక్క శాతం మేర లాభపడ్డాయి. నిఫ్టీలో రియాల్టీ, ప్రయివేటు బ్యాంకింగ్‌ సూచీలు 1 శాతం చొప్పున, ప్రభుత్వ బ్యాంక్‌ సూచీ 0.89 శాతం, ఐటి 0.84 శాతం చొప్పున నష్టపోయాయి. 139 స్టాక్స్‌ ఏడాది కనిష్టానికి పడిపోయాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -