Monday, December 29, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలునేటి నుంచి సభాపర్వం

నేటి నుంచి సభాపర్వం

- Advertisement -

ఉదయం 10.30 గంటలకు ఉభయ సభలు ప్రారంభం
అసెంబ్లీ ఏర్పాట్లపై సమీక్షించిన మండలి చైర్మెన్‌, అసెంబ్లీ స్పీకర్‌
సభకు రానున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌
ఢకొీనేందుకు రెఢ అంటున్న సీఎం రేవంత్‌ రెడ్డి
కృష్ణా, గోదావరి జలాలే ఎజెండాగా అసెంబ్లీ
వీబీ జీ రామ్‌ జీ, సర్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు
ఈసారైనా ప్రజా సమస్యలు చర్చకొచ్చేనా?
మెట్రో, ఉపాధి భారాలపై సర్కారు ఏం చెప్తుందో?

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ నేతల విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాష్ట్రంలో బయట రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కిన నేపథ్యంలో…సోమవారం నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలకు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్‌ రానుండటంతో సభ లోపలి వాతావరణం కూడా మరింత వేడెక్కనుంది. శాసనసభకు హాజరయ్యేందుకు వీలుగా ఆయన ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌ నుంచి ఆదివారం నాటికే హైదరాబాద్‌ నందినగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ నీటి వాటాలపై ఇరు పక్షాల నేతలు పరస్పరం నిప్పులు చెరగబోతున్నారనేది స్పష్టంగా కనబడుతోంది. ఈ మేరకు అధికార, ప్రధాన ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న శాసనసభ, శాసనమండలి సమావేశాల నిర్వహణకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వాటిపై మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

అసెంబ్లీని ఎన్ని రోజులు నడపాలనే దానిపై సోమవారం నిర్వహించబోయే సభా వ్యవహారాల సంఘం (బీఏసీ) సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు. అయితే మంగళ, బుధవారాలు అసెంబ్లీకి సెలవులిచ్చి, నూతన సంవత్సరం ప్రారంభం రోజైన బుధవారం ఉభయ సభలను పున:ప్రారంభించాలని చైర్మెన్‌, స్పీకర్‌ నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో తమదే పై చేయంటూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పరస్పరం ప్రకటనలు గుప్పించాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ‘పొలిటికల్‌ హీట్‌’ మొదలైంది. మాజీ సీఎం కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమవేశంలో చేసిన వ్యాఖ్యలతో ఆ హీట్‌ మరింత హీటెక్కింది. ప్రతిగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన కామెంట్లు, కౌంటర్‌గా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. దీంతో గత పది రోజుల నుంచి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య తిట్లు, శాపనార్థాలు, బూతు పురాణాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు సోమవారం నుంచి అసెంబ్లీ ప్రారంభం కాబోతోన్న నేపథ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలపై గత బీఆర్‌ఎస్‌ హయాంలో చేసుకున్న ఒప్పందాలు, ఆ సందర్భంగా ఆనాటి సీఎం కేసీఆర్‌ చేసిన సంతకాలను సభలో అంకెలు, సంఖ్యలు, గణాంకాలతో వివరించటం ద్వారా ప్రధాన ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన డీపీఆర్‌ను కేంద్రం తిప్పిపంపినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదంటూ చెప్పటం ద్వారా అధికార ప్రతిపక్షాన్ని డైలమాలో పడేయాలన్నది బీఆర్‌ఎస్‌ వ్యూహంగా కనబడుతున్నది. ఈ రకంగా ఆ రెండు ప్రధాన పార్టీలు.. నీళ్లే ఎజెండాగా, ఒకరిపై మరొకరు పై చేయి సాధించుకోవటమే లక్ష్యంగా కత్తులు నూరుతున్నాయి. అందువల్ల రాష్ట్రంలోని అసలు సిసలు సమస్యలు ఈసారైనా చర్చకొస్తాయా? లేదా? అన్నది వేచి చూడాలి. ప్రధానంగా ఆరు గ్యారెంటీల అమలు నత్తనడకన సాగుతోంది.

ఆసరా పింఛన్ల పెంపు, తులం బంగారం, చదువుకునే అమ్మా యిలకు స్కూటీలు, వ్యవసాయ కూలీలకు నెలకు రూ.వెయ్యి, ఆటోవాలాలకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఆర్థిక సాయం, మహిళా సమాఖ్యల్లోని మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రైతు భరోసా పెంపు తదితర హామీల అమలు కోసం పేదలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న మహాలక్ష్మి (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) బాగానే అమలవుతున్నప్పటికీ మహిళా ప్రయాణీకుల సంఖ్యకు సరిపడా బస్సు లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పండగలు, పెండిండ్ల సీజన్లలో బస్సులు లేక, ఉన్నా వాటిలో సీట్లు సరిపోక మహిళలు గొడవలు పడుతున్న ఘటనలు వెలుగు చూశాయి. అయితే గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటికి వడ్డీలకే ప్రభుత్వ ఆదాయం సరిపోతోందని, అందువల్ల సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నామని సర్కారు చెబుతోంది.

పదేండ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్‌ రూ.8.50 లక్షల కోట్లు అప్పులు చేశారని కాంగ్రెస్‌ వాదిస్తోండగా, తమ హయాంలో కేవలం రూ.2.50 లక్షల కోట్ల రుణాలే తీసుకున్నామంటూ బీఆర్‌ఎస్‌ తోసిపుచ్చటం గమనార్హం.మెట్రో రైల్‌ ప్రాజెక్టును ప్రభుత్వం టేకోవర్‌ చేసుకున్న నేపథ్యంలో రూ.13 వేల కోట్ల భారం ఖజానాపై పడింది. ఉపాధి హామీ చట్టాన్ని మార్చిన కేంద్రం, దాని స్థానంలో వీజీ రామ్‌జీ చట్టాన్ని తీసుకొచ్చింది. అందులోని నిబంధనల ప్రకారం మరో రూ.20 వేల కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. మరోవైపు తెలంగాణలోనూ సర్‌ను అమలు చేసి తీరతామంటూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ప్రకటించిన దరిమిలా… దాంతోపాటు వీజీ రామ్‌ జీ బిల్లును కూడా వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానించనుందని సమాచారం. ఆ తీర్మానాలను కేంద్రానికి పంపనున్నారని స్పీకర్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -