Friday, October 31, 2025
E-PAPER
Homeకవితసముద్రం

సముద్రం

- Advertisement -

సముద్రం..
నాలో నేను నాతో నేను
మాట్లాడుకునే సమయం.
నా మనసు గాయాలకు
మందు పూసే లేపనం.
సముద్రం..
ఆకాశం ముందుకు వంగి
ముఖం చూసుకునే అద్దం.
అలలు ఆలపిస్తున్న
ఒక సమ్మోహన గీతం.
సముద్రం..
నేనంటే నేనని పరిగెత్తుకొచ్చి
కాళ్లను చుట్టేసే
కెరటాల మమకారం.
ఒడ్డున కూర్చోబెట్టి
ముచ్చటించే చిన్ననాటి నేస్తం.
సముద్రం.. గిలిగింత పెడుతూ
పాదాల దగ్గరే తచ్చాడే
పిల్లికూనల స్పర్శ.
నింగికి నేలకు నడుమ
గీసిన ఒక సరళరేఖ.
సముద్రం..
తీరం దాకా
తన చేతులను చాపి
పిలుస్తున్న అమ్మ.
ఆ పిలుపుకి పెద్దలైనా సరే ..!
అలలతో పాటు ఆడి పాడి
ఆనందపడే పసిపిల్లలే.
– శైలజ బండారి, [email protected]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -