87.0 శాతం పోలింగ్ నమోదు
ఓటు వినియోగించకున్న 1,03,406 ఓటర్లు
నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి జిల్లాలోని 5 మండలాల్లో జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రకటించారు. జిల్లాలో రెండవ విడత పోలింగ్ జరిగిన వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత,మదనపూర్ మండలాల్లో మొత్తం పోలింగ్ 87.0 శాతం నమోదైనట్టు జిల్లా ఎన్నికల అధికారి ఆదర్శ్ సురభి తెలిపారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుండి ప్రారంభమై మధ్యాహ్నం 1.00 గంట వరకు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ తీరును కలెక్టరేట్లోని సమావేశం మందిరం నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, సాధారణ ఎన్నికల పరిశీలకులు మల్లయ్య భట్టు, వ్యయ పరిశీలకులు శ్రీనివాస్ తో కలిసి పర్యవేక్షించారు.
జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ నుండి మాత్రమే కాకుండా వనపర్తి మండలం, నాచహళ్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రం, పెద్దగూడెం గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ జరుగుచున్న ప్రక్రియను పరిశీలించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ భద్రతలు కట్టుదిట్టం చేశారని తెలిపారు. నాచహళ్లి గ్రామంలో మీడియాతో మాట్లాడిన కలెక్టర్ ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని తెలియజేశారు. మధ్యాహ్నం 1.00 గంట వరకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకు పోలింగ్ కేంద్రాల గేట్లు మూసి క్యూ లైన్లలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు.
పోలీస్ శాఖ ద్వారా కట్టుదిట్టమైన శాంతిభద్రతలు అమలు చేసినట్టు తెలిపారు. రెండో విడతలో పోలింగ్ జరిగిన వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూరు, అమరచింత మండలాల్లో మొత్తం కలిపి 1,03,406 ఓట్లు పోల్ కాగా, 87. 0% వోటింగ్ పర్సంటేజీ నమోదయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.



