బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని వ్యాఖ్యలు హాస్యాస్పదం: సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-తల్లాడ
ఖమ్మంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేసిన వ్యాఖ్యలు కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్న చందంగా ఉన్నాయని, సీపీఐ(ఎం)ను బీజేపీలో విలీనం చేయమనడం హాస్యాస్పదంగా ఉందని, పగటి కలలు మానుకోవాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం హితవు పలికారు. ప్రమాదకరమైన బీజేపీ మతోన్మాదాన్ని లౌకిక శక్తులు ఏకమై నిలువరించాలని పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలోని జీఎన్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నాయకులు మోరంపుడి పాండు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. బీహార్‌లో ఓడిపోతామనే భయంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ముస్లిం, క్రిస్టియన్లను పాక్, బంగ్లాదేశీయులుగా పేర్కొంటూ ఓట్లను తొలగించిందని విమర్శించారు. 60 లక్షల ఓట్లు తొలగిస్తే తాము పోటీ చేసి ఏం లాభమని, పోటీ చేయడం లేదని, ఎలక్షన్లను బైకాట్ చేస్తున్నట్టు తేజస్వి యాదవ్ ప్రకటించారని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టారని, దీన్ని సీపీఐ(ఎం) పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. ఇండియా, బ్రిటిష్ వ్యాపార ఒప్పందం, జీరో టారిఫ్ మన దేశ ఉత్పత్తిదారులను తీవ్రంగా నష్టపరుస్తుందని అన్నారు. అక్కడ సబ్సిడీపై వస్తువులను తయారు చేసి తక్కువ ధరకు భారత్‌లో విక్రయిస్తారని, స్థానికంగా తయారు చేసిన వస్తువులకు గిట్టుబాటు ధర లభించదని, ఉత్పత్తిదారులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అణిచివేత ధోరణిని అవలంబిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను ఇప్పుడిప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, దానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధం అవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫమైందన్నారు. స్థానిక ఎన్నికల ముందు కొద్దిగా నిధులు విడుదల చేసి పథకాలు అమలు చేస్తున్నట్టు రుచి చూపిస్తున్నారని విమర్శించారు. అరకొర నిధులు విడుదల చేయడం వల్ల పథకాలు ఏవీ పూర్తయ్యే అవకాశం లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు బేస్‌మట్టం స్థాయిలోనే ఆగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు గ్రామాల్లోని సమస్యలపై పోరాడుతూ పార్టీని పటిష్టం చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీనియర్ జిల్లా నాయకులు తాతా భాస్కరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదినేని రమేష్, జిల్లా కమిటీ సభ్యులు చల్లమాల విఠల్‌రావు, సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ రావు, నాయకులు అయినాల రామలింగేశ్వరరావు, మాదాల వెంకటేశ్వరరావు, గాయం తిరుపతిరావు, కొలికపోగు సర్వేశ్వరరావు, జాజిరి జ్యోతి, మిట్టపల్లి నాగమణి, పి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
లౌకిక శక్తులు ఏకమై.. బీజేపీ మతోన్మాదాన్ని నిలువరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES