Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుసొంతింటితోనే పేదల ఆత్మగౌరవం

సొంతింటితోనే పేదల ఆత్మగౌరవం

- Advertisement -

రాబోయే రెండేండ్లలో నాలుగున్నర లక్షల ఇండ్లు

  • నియోజకవర్గానికో ఏటీసీ కేంద్రం.. ఉపాధికనుగుణంగా నైపుణ్యాల పెంపు
  • విద్యతోనే పేదల జీవితాల్లో వెలుగులు : ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  • భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడులో ఇండ్ల గృహ ప్రవేశం
  • పొంగులేటికి సీఎం ప్రశంసల జల్లు

    నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
    సొంతింటితోనే పేదలకు ఆత్మగౌరవం దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పేదల ఆత్మగౌరవం నిలిపేలా ఇందిరాగాంధీ తీసుకొచ్చిన ‘రోటీ కపడా ఔర్‌ మకాన్‌’ నినాదం సాకారం దిశగా కాంగ్రెస్‌ పాలన సాగుతోందన్నారు. ఇప్పుడు నిర్మిస్తున్న ఇండ్లే కాక రాబోయే రెండేండ్లలో నాలుగున్నర లక్షల ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. విద్యతోనే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు నియోజకవర్గానికో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ)ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గాల వారీగా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు, ఎంపీలతో మంత్రులు సమావేశాలు ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దామరచర్లలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. కమ్యూనిస్టులు సైతం ప్రభుత్వానికి అండగా నిలబడ్డారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 25 లక్షల ఇండ్లను కట్టించిన విషయాన్ని గుర్తు చేశారు. హనుమాన్‌ గుడిలేని గ్రామాలు, తండాలు ఉండొచ్చు కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని ఊరు ఉండొద్దని నిర్ణయించుకున్నామన్నారు. నాడు పోడు పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు, ఫీజురీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత కరెంట్‌.. రాజశేఖర్‌రెడ్డి ఇచ్చారని తెలిపారు. కేసీఆర్‌ పదేండ్ల పాలనాకాలంలో కొత్త రేషన్‌కార్డు ఎట్లుంటదో తెలియదని, కోడలు ఇంటికొస్తే.. ఆడపిల్లను ఓ ఇంటికిస్తే కార్డుల్లో పేరు ఎక్కలేదని అన్నారు.
    పదేండ్లు కార్డుల కోసం కండ్లు కాయలు కాచేలా చూశారని తెలిపారు. రాబోయే పదేండ్లు ఇందిరమ్మ రాజ్యమే ఉండాలని, పేదలందరికీ ఇండ్లు కట్టించాలని ఆకాంక్షించారు. అందుకు అధికారులు సహకరించాలని కోరారు. భూములు అందుబాటులో లేనందున పేదల పిల్లలను ప్రయోజకులను చేసేందుకు రూ.45వేల కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలను స్థాపిస్తున్నామని తెలిపారు. ”పేదలూ చదువుకోండి.. చదువుకేమి కావాలో అడగండీ” అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటిని ప్రశంసలతో ముంచెత్తారు. ఖమ్మం జిల్లా సమయస్ఫూర్తి ఉన్న జిల్లా అని, అందుకే కీలక శాఖలన్నీ ఈ జిల్లాకే ఇచ్చానని తెలిపారు. అంతకుముందు ఇండ్ల గృహప్రవేశాల అనంతరం లబ్దిదారులతో ముచ్చటించారు.

    పేదల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
    పేదల ఆత్మగౌరవం ఇండ్లని, అటువంటి ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదల కోసం పనిచేస్తే కమీషన్‌లు రావని నాటి ప్రభుత్వం భావించిందని, కానీ పేదలతోనే ఆత్మగౌరవం అని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కేసీఆర్‌ దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో 119 ఇండ్లు కట్టించామన్నారు. నాడు కేసీఆర్‌ను ఇల్లు ఇవ్వమని అడిగిన అవ్వ ఇల్లు కూడా నెలరోజుల్లో పూర్తవుతుందన్నారు. ఈ సభలో ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, ఖమ్మం, మహబూబాబాద్‌ ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాంనాయక్‌, నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి, అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావ్‌, కూనంనేని సాంబశివరావు, మట్టా రాగమయి దయానంద్‌, మాలోత్‌ రాందాస్‌నాయక్‌, వివిధ కార్పొరేషన్‌ల చైర్మెన్‌లు మువ్వా విజరుబాబు, రాయల నాగేశ్వరరావు, హౌసింగ్‌ ఎండీ ఎంవీ గౌతమ్‌, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, ఐటీడీఏ పీవో బి.రాహుల్‌, వరంగల్‌ రేంజ్‌ ఐజీ చంద్రశేఖరరెడ్డి, ఎస్పీ రోహిత్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad