Saturday, December 20, 2025
E-PAPER
Homeఆటలుసిరీస్‌ సొంతమాయె

సిరీస్‌ సొంతమాయె

- Advertisement -

ఆఖరు వన్డేలో భారత్‌ ఘన విజయం
తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య ధనాధన్‌ షో
వరుణ్‌ చక్రవర్తి, జశ్‌ప్రీత్‌ బుమ్రా మ్యాజిక్‌

నవతెలంగాణ-అహ్మదాబాద్‌ : ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ టీమ్‌ ఇండియా 3-1తో సొంతమైంది. శుక్రవారం అహ్మదాబాద్‌లో జరిగిన ఆఖరు టీ20లో ఆతిథ్య భారత్‌ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 232 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (65, 35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (31, 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించటంతో 10 ఓవర్లలో 118/1తో పటిష్టంగా నిలిచిన సఫారీలు.. బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి మ్యాజిక్‌కు తేలిపోయారు. విరామం తర్వాత వరుస వికెట్లు పడగొట్టిన భారత్‌ మ్యాచ్‌ను చేతుల్లోకి తీసుకుంది. 20 ఓవర్లో 8 వికెట్లకు దక్షిణాఫ్రికా 201 పరుగులే చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగుల భారీ స్కోరు చేసింది. తిలక్‌ వర్మ (73, 42 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌), హార్దిక్‌ పాండ్య (63, 25 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. భారత పర్యటనలో టెస్టు సిరీస్‌ను 2-0తో సాధించిన దక్షిణాఫ్రికా.. వన్డే సిరీస్‌ను 1-2, టీ20 సిరీస్‌ను 1-3తో ఓటమిపాలైంది.

తిలక్‌, హార్దిక్‌ షో
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. అభిషేక్‌ శర్మ (34) ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో ధనాధన్‌ జోరు చూపించగా.. సంజు శాంసన్‌ (37) సైతం 4 ఫోర్లు, 2 సిక్సర్లతో చెలరేగాడు. దీంతో తొలి వికెట్‌కు భారత్‌ 63 పరుగులు జోడించింది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (5) మరోసారి నిరాశపరిచాడు. నం.3 బ్యాటర్‌ తిలక్‌ వర్మ (73), ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య (63) అర్థ సెంచరీలతో చెలరేగారు. సంజు శాంసన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించిన తిలక్‌ వర్మ.. హార్దిక్‌ పాండ్యతో కలిసి విధ్వంసం సష్టించాడు. పాండ్య, తిలక్‌ నాల్గో వికెట్‌కు 115 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించారు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో తిలక్‌ వర్మ 30 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా.. నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 16 బంతుల్లోనే హార్దిక్‌ ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఈ ఇద్దరి జోరుతో 17.4 ఓవర్లలోనే భారత్‌ 200 మార్క్‌ చేరుకుంది. పాండ్య నిష్క్రమించినా.. శివమ్‌ దూబె (13 నాటౌట్‌) ఓ ఫోర్‌, సిక్సర్‌తో చెలరేగాడు. ఆఖరు ఓవర్లో తిలక్‌ వర్మ రనౌట్‌గా అవుటయ్యాడు. 20 ఓవర్లలో భారత్‌ 5 వికెట్లకు 231 పరుగులు చేసింది.

డికాక్‌ మెరిసినా..
232 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (65) దంచికొట్టాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ ఓవర్లో రెండు సిక్సర్లు, ఫోర్లతో 23 పరుగులు పిండుకున్న డికాక్‌.. వరుణ్‌ చక్రవర్తిని సైతం ఉతికారేశాడు. దీంతో తొలి ఆరు ఓవర్లలో సఫారీలు 67 పరుగులు పిండుకున్నారు. ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 30 బంతుల్లో అర్థ సెంచరీ బాదిన డికాక్‌.. దక్షిణాఫ్రికాను లక్ష్యం దిశగా నడిపించాడు. మరో ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌ (13) తోడుగా తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించిన డికాక్‌… డెవాల్డ్‌ బ్రెవిస్‌ (31)తో కలిసి రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించాడు. 10 ఓవర్లలో 118/1తో సఫారీ ఫేవరేట్‌గా నిలిచింది. విరామం తర్వాత బంతి అందుకున్న బుమ్రా.. డికాక్‌ను అవుట్‌ చేయగా.. ఆ తర్వాత హార్దిక్‌ బ్రెవిస్‌ను సాగనంపాడు. వరుణ్‌ ఒకే ఓవర్లో మార్‌క్రామ్‌ (6), ఫెరీరా (0)లను మాయ చేయటంతో సఫారీలు కష్టాల్లో పడ్డారు. మార్కో యాన్సెన్‌ తనదైన శైలిలో దూకుడు చూపించినా.. మరో ఎండ్‌ నుంచి సహకారం దక్కలేదు. వరుణ్‌ చక్రవర్తి (4/53) నాలుగు వికెట్లతో మాయ చేశాడు.

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌ : 231/5 (తిలక్‌ వర్మ 73, హార్దిక్‌ పాండ్య 63, సంజు శాంసన్‌ 37, బాచ్‌ 2/44)
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ : 201/8 ( క్వింటన్‌ డికాక్‌ 65, డెవాల్డ్‌ బ్రెవిస్‌ 31, వరుణ్‌ 4/53, బుమ్రా 2/17)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -