8.8 తీవ్రతతో భూకంపం
రష్యా, అమెరికా, జపాన్ తదితర దేశాల్లో
భూ ప్రకంపనలు… సునామీ హెచ్చరికలు
12 అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్న రాకాసి అలలు
సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు
నవతెలంగాణ నెట్‌వర్క్
తూర్పు ఆసియా తీర ప్రాంతం…ముఖ్యంగా పసిఫిక్ మహా సముద్ర పశ్చిమ తీరంలో రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో బుధవారం తీవ్ర భూకంపం సంభవించింది. దీంతో రష్యా, అమెరికా, జపాన్ తదితర దేశాలకు సునామీ హెచ్చరికలు, అడ్వైజరీలు జారీ అయ్యాయి. సముద్రపు అలలు కాలిఫోర్నియా తీరాన్ని తాకాయి. భూకంపం కారణంగా రష్యాలోని కురిల్ దీవులు, జపాన్ ఉత్తర ప్రాంతంలోని అతి పెద్ద ద్వీపం హక్కైడో, హవాయి తీరంలో సునామీ ప్రభావం కన్పిస్తోంది. ఇండోనేషియా, మలేసియా దేశాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సునామీ అలలను వీక్షించేందుకు ఎవరూ తీర ప్రాంతం వద్దకు వెళ్లవద్దని అమెరికా జాతీయ వాతావరణ సేవల విభాగం ప్రజలను హెచ్చరించింది. ఫొటోలు తీసేందుకు కూడా ప్రయత్నించొద్దని తెలిపింది.
లంగారా ద్వీపాన్ని తాకిన తర్వాత సునామీ అలలు టోఫినోకు చేరుకుంటాయని, ఆ తర్వాత అలల తాకిడి పెరుగుతుందని అధికారులు తెలిపారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో మెరీనాలు, బీచ్‌లు, సముద్రానికి సమీపంలోని ప్రాంతాలలో ప్రజలను ఖాళీ చేయించాలని సూచించారు. కమ్చట్కా ద్వీపకల్పంలో సంభవించిన భూకంపం 1952 తర్వాత వచ్చిన అత్యంత శక్తివంతమైన ఉపద్రవమని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని ప్రకంపనలు రావచ్చునని, వాటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా ఉండవచ్చునని వారు అంచనా వేశారు. మార్కెస్వాస్ దీవులను సునామీ అలలు నాలుగు మీటర్ల ఎత్తున తాకవచ్చునని ఫ్రెంచ్ పాలినేసియా ప్రజలను హెచ్చరించింది.
ఒరేగాన్ సరిహద్దుకు దక్షిణంగా పదిహేను మైళ్ల దూరంలో ఉన్న క్రెస్సెంట్ పట్టణాన్ని మూడున్నర అడుగుల ఎత్తన సునామీ అలలు ముంచెత్తాయి. మరోవైపు సునామీ హెచ్చరికలను జారీ చేసిన కాంబోడియా ప్రభుత్వం పసిఫిక్ తీరం వెంబడి ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. బీచ్‌లను మూసివేశారు. హవాయి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరదనీటిని గమనిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచిస్తున్నారు. జపాన్, హవాయి, అలాస్కాను తాకిన అలలు కాలిఫోర్నియా తీరాలకు చేరాయి. రష్యాలోని కొన్ని ప్రాంతాలలో భూకంపం కారణంగా భవనాలు దెబ్బతిన్నాయి. న్యూజిలాండ్ ప్రభుత్వం కూడా తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. బలమైన, అసాధారణమైన గాలులు వీయవచ్చునని, అనూహ్య పరిణామాలు సంభవించ వచ్చునని హెచ్చరించింది. కొన్ని చోట్ల సునామీ ముప్పు తప్పడంతో అడ్వైజరీలు జారీ చేశారు. రష్యాలోని కమ్చాట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో అధికారులు పసిఫిక్ తీరం అంతటా సునామీ హెచ్చరికలు చేశారు. ముఖ్యంగా అలస్కా, హవాయిల్లో 10 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉత్తర కురిల్ దీవుల నుంచి హవాయి ద్వీప సమూహం వరకు, అలాగే యూఎస్ పశ్చిమ తీరానికి సునామీ ముప్పు పొంది ఉందని పేర్కొన్నారు. దీంతో తీరంలోని విమానాశ్రయాలను, హార్బర్‌లను మూసివేశారు. ఫ్లైట్స్‌ను క్యాన్సిల్ చేశారు. అంతేకాక అమెరికా వాతావరణ విభాగం కూడా కీలక హెచ్చరిక జారీ చేసింది. సునామీ తీవ్రతను తేలిగ్గా తీసుకోవద్దని, ఫొటోల కోసం తీరానికి వెళ్లవద్దని హెచ్చరించింది. ఒక్క అలతో సునామీ రాదని, అలలు పలుమార్లు వస్తాయని, సముద్రం నుంచి తీరానికి వచ్చే నీటి పరిమాణం భారీగా ఉంటుందని పేర్కొంది.
అలస్కాను తాకిన సునామీ
పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం (పీటీడబ్ల్యూసీ) సునామీ అలలు ఇప్పటికే తీరప్రాంతాలను తాకడం ప్రారంభించాయని నిర్దారించింది. ప్రస్తుతం హవాయిలోని ఓహు ఉత్తర తీరంలోని హలైవాలో ఓ సునామీ అల 4 అడుగుల (1.2 మీటర్లు) ఎత్తుతో ఎగసిపడిందని పేర్కొంది. అంతేకాదు అలలు దాదాపు 12 నిమిషాల వ్యవధిలో పలుమార్లు వచ్చినట్టు తెలిపింది.
అత్యంత శక్తివంతమైన భూకంపం
రష్యా తీరంలో సంభవించిన ఈ భూకంపం (8.8 తీవ్రత) ఆధునిక ప్రపంచ చరిత్రలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) పేర్కొంది. అయితే ఈ భూకంపం తరువాత వరుసగా పలుమార్లు భూమి కంపించిందని, అందులో రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో సంభవించిన ఓ భూకంపం కూడా ఉందని తెలిపింది. హవాయి, అలస్కాలోని అలూటియన్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలు సహా, ఉత్తర కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. పీటీడబ్ల్యూసీ, నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఓఏఏ) రెండూ ఈ సునామీలపై నిరంతర నిఘా ఉంచాయి.
జపాన్‌లో తీరప్రాంతాలను ఖాళీ చేస్తున్న ప్రజలు
మరోవైపు జపాన్‌లోనూ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు 2 మిలియన్ల మంది ప్రజలు తీర ప్రాంతాలను ఖాళీ చేయాలని అధికారులు సూచించారు.
ఫిలిప్పీన్స్‌లో…
పసిఫిక్ తీరంలో 3 అడుగుల కంటే తక్కువ ఎత్తులో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని ఫిలిప్పీన్స్ అధికారులు హెచ్చరించారు. అందువల్ల సముద్ర తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాస్తవానికి ఇవి పెద్ద అలలు కాకపోయినప్పటికీ, ఇవి తీరప్రాంతంలోకి చొచ్చుకువచ్చి, గంటల తరబడి అలానే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
న్యూజిలాండ్‌లో..
న్యూజిలాండ్ తీరంలో బలమైన, అసాధారణ ప్రవాహాలు, అనూహ్యమైన ఉప్పెనలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కనుక బీచ్‌లు, నౌకాశ్రయాలు, నదీ పరివాహక, నదీ ముఖద్వారాల వద్ద ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వాస్తవానికి న్యూజిలాండ్ భూకంప కేంద్రం నుంచి దాదాపు 6000 మైళ్లు (9,600 కి.మీ) దూరంలో ఉంది.
చైనాకు ముప్పు
సునామీ ఎఫెక్ట్ చైనాపై కూడా ఉంది. అంతేకాక సునామీతోపాటు సైక్లోన్ ప్రమాదమూ ఉంది. దాంతో షాంఘైలోని 28 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విమానాలు, బోట్ సర్వీసులను నిలిపివేశారు. ప్రస్తుతం తూర్పు చైనాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి.
వణికిన తూర్పు ఆసియా తీరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES