Thursday, July 31, 2025
E-PAPER
Homeతాజా వార్తలుముంచుకొస్తున్న ముంపు

ముంచుకొస్తున్న ముంపు

- Advertisement -

– కుప్పకూలిన రిటర్నింగ్‌ వాల్‌ని సందర్శించే తీరికలేదా?
– రామయ్యను ముంచుతూ దొంగ దండాలు పెడుతున్న బీజేపీ నాయకులు
– ముంపుపై స్పందించకుంటే కాంగ్రెస్‌, బీజేపీకి గుణపాఠం తప్పదు : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు
– పార్టీ ఆధ్వర్యంలో ముంపు ప్రాంతాల అధ్యయన యాత్ర
నవతెలంగాణ-భద్రాచలం

ఓ వైపు ముంపు ముంచుకొస్తున్నా కాంగ్రెస్‌ పాలకులు మేల్కొనకుండా మీనమేషాలు లెక్కపెట్టడం సరైనది కాదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి వచ్చే ముంపుపై అఖిలపక్షాన్ని కలుపుకొని కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఓ వైపు భద్రాద్రి రామయ్యను ముంచుతూ మరోవైపు దొంగ దండాలు పెడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ముందు ఐదు పంచాయతీలను తెలంగాణలో కలిపి రామయ్య భూములకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. బుధవారం సీపీఐ(ఎం) భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కరకట్ట రక్షణ, పోలవరం ముంపు అధ్యయన యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన జరిగిన ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. కరకట్ట రక్షణ గోడ కూలి నెలరోజులవుతున్నా తాజా, మాజీ ఎమ్మెల్యేలు గాని, ఎంపీ, మంత్రులు గాని సందర్శించకుండా పదవుల కోసం కొట్టుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పట్టణంలోని శివారు కాలనీలకు ముంపు ప్రమాదం ముంచుకొస్తున్నా ప్రజాప్రతినిధుల్లో ఎలాంటి స్పందన లేదని అన్నారు. ఐదు పంచాయతీలను భద్రాచలంలో కలపడం ద్వారా రామయ్య భూములకు శాశ్వత పరిష్కారం దక్కుతుందన్న విషయం తెలిసినప్పటికీ విభజన పేరుతో చిచ్చురేపి ఇప్పుడు రామయ్య భూములపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌.. కరకట్ట నిర్మాణానికి రూ.2000 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పి ఇక్కడ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. పోలవరం బ్యాక్‌ వాటర్‌తో భద్రాచలానికి కలిగే ముంపునకి కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలే బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ముంపు అధ్యయన యాత్ర పేరుతో కుప్పకూలిన రక్షణ గోడ నుంచి సుభాష్‌ నగర్‌ ప్రాంతం వరకు పర్యటన నిర్వహించి లోతట్టు ప్రాంత ప్రజలతో మమేకమై వారి సమస్యలను చర్చించామని అన్నారు. సుభాష్‌ నగర్‌ కాలనీ వద్ద నిర్మిస్తున్న కరకట్ట పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, లేని పక్షంలో ఆగస్టులో గోదావరి వరద రూపంలో పెనుప్రమాదం సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఈ యాత్రకు ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘీభావం తెలిపింది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రంశెట్టి వెంకట రామారావు, పారిల్లి సంతోష్‌ కుమార్‌, డి. సీతాలక్ష్మి, పట్టణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -