Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeదర్వాజరహస్యోద్యమకారుడి నినాదం

రహస్యోద్యమకారుడి నినాదం

- Advertisement -

త్రిపురనేని శ్రీనివాస్‌ కవిత్వంలో చిత్రమైన ఆకర్షణ వుంది. చదువుతున్నప్పుడు ఆసక్తిని పెంచుతుంది. కుతూహలం కలిగిస్తుంది. ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా ‘హో’లో శ్రీనివాస్‌ చేసిన పని నిశ్చల నిశ్చితాల మీద, నిలవ నీటి స్థితి మీద, గిడసబారిన అభిప్రాయాలు, దృక్పథాలపైన ఒక విధమైన దాడి చేశాడు. చాలావాటిని తిరస్కరించాడు, వ్యతిరేకించాడు. పేచీ పడ్డాడు. ససేమిరా తనకు ఏకాభిప్రాయం ఎన్నో విషయాలపై లేదని ప్రకటించాడు.
”ఇతరులతో విభేదించండి/ ఇతరులు ఏకీభవిస్తారు” అన్నాడు.
అలాగే తనతో ఎవరు ఏ విషయంగా విభేదించినా సరే ఆ విభేదం ఏమిటో? ఎందుకు విభేదించబడుతున్నాడో వినేవాడు. తెలుసుకునేవాడు. ఈ ‘విభేదం’ ఘర్షణ కాదు. ఇద్దరూ కలిసి ఏర్పరచుకోవలసిన ప్రజాస్వామిక స్థలం అని బలంగా నమ్మాడు. భాష కాదు అతనికి కావలసింది భావం. అందుకే ‘మాట్లాడడం కాదు, సంభాషణ’ కావాలంటాడు. ఇతరులను మెప్పించడానికి ఎక్కడా ప్రయత్నించలేదు. ఇతరులను ఒప్పించడానికి కూడా విముఖుడు. తానొక ప్రతిపాదన లేదా ప్రకటన లాంటిది కవిత్వంలో చేస్తాడు. దానితో అంగీకరిస్తావో లేక కాదంటావో నీ ఆలోచనా పరిధికి సంబంధించినది గానే చూస్తాడు. నీ ఆలోచన విస్తృతమైనదే అయితే నువ్వు అంగీకరిస్తావు. అది సంకుచితమైనదే అయితే పరిపరివిధాలుగా తలపడతావు. నిర్హేతుకంగా తలపడితే అది నీ ఆలోచనా పరిథిని, పరిమితికి సూచికగా మారుతుంది.
‘హో’లోని తొలి కవితోనే ఇలా అంటాడు… ”వస్తూనే అనుకున్నాను కొత్తగా వద్దు/ పాతగానే మాట్లాడతామని/ కొన్ని కొత్త సంగతులను/ పాతగా చెబితేనే కొత్తగా అర్థమవుతాయి” అన్నాడు.
అలాగని కొత్తగా చెప్పడానికి ప్రయత్నమే చేయలేదని కాదు, తాను చెప్పే విషయాలలోని గ్రహించాల్సినవి ఏమిటో స్పష్టత వున్నవాడు కనుక, సమాజం లేదా వ్యక్తి అవగాహనాశక్తి ఎంత వుందో అంచనా వున్నవాడు కనుక ఇలా చెప్పగలిగాడు.
శ్రీనివాస్‌ కవిత్వంలోని టోన్‌ మరీ దృఢమైంది. ”మానవజాతి ప్రచురణ కర్త ఎవరు/ ఈ ప్రపంచాన్ని ప్రచురించినదెవరు/ అచ్చు తప్పుల్ని సరిదిద్దాలి” అని ప్రకటించగలిగినంత సాహసం. వ్యవస్థలన్నీ గిడసబారాయి. కొత్త ఆలోచనలను ఆహ్వానించే, ఆమోదించే విశాలత్వం లేదు. ఈ రెండూ కోల్పోయిన స్థితిలో మనుషులున్నప్పుడు పదునైన మాటతో తీవ్ర ఆక్షేపణతో, స్థిరచిత్తంతో తాను చెప్పవలసిన విషయాన్ని చెపుతాడు.
శ్రీనివాస్‌ సమత్వాన్ని ఆశించాడు. ఎక్కువ తక్కువలు లేవని విశ్వసించాడు. తాను నమ్మిన సత్యాన్ని పాటించాడు. ఈ క్రమంలో ఆధిపత్యాలపై త్రి.శ్రీ. తీక్షణంగా విరుచుకుపడతాడు. పెళ్లి, కుటుంబం, రాజ్యం ఈ మూడూ అధికార సంబంధాలకు, ఆధిక్యతలకు, అణచివేతకు, పీడనకు, స్వేచ్ఛలేని స్థితికి మూలమని నిర్థారించాడు. తన కవిత్వం ద్వారా ఈ మూడింటిపై కలిగించాల్సినంత ఏహ్యతను కలిగిస్తాడు.
”నీవు లేకపోతే ప్రపంచమే లేదని బిందెల కొద్దీ ప్రేమ కురిపిస్తారు/ కొందరు నిబద్ధతా ప్రేమికులు. అది అమాయకత్వంతో కాదు/ అడలసెన్సూ కాదు. రాముటికాలంనాటి మురికిరక్తం./ వొక స్త్రీకి వొక పురుషుడనీ నైతికత్వం/ వోV్‌ా యేం వన్‌ ప్లస్‌ వన్‌ వైభవం!” అంటూ పరిహసించాడు.
”ఈ దేశంలో ప్రేయసీ ప్రియులు లేరు/ అందరూ భార్యాభర్తలే. వోV్‌ా యేం వైవాహిక వైభవం” అని ఎగతాళి చేస్తాడు. ప్రేమ వివాహాలు చేసుకున్నవారు, ఆంక్షలు, కట్టుబాట్లను ధిక్కరించి, నియంత్రణ, అదుపు లేని సమాజం కోసం కలగన్నవారు సైతం – ”ఇప్పుడు వారు కలగనడం/ మానేసి పిల్లల్ని కంటున్నారు. వోV్‌ా యేం సంతాన వైభవం!” అంటూ వెక్కిరించాడు. ‘మాంగల్యం తంతునానేనా మనుజీవన నిర్బంధం’ అని కటువుగానే చెప్పాడు.
ఉద్యమ పోకడల మీద, సిద్ధాంతాలు, వ్యూహాలు, ఎత్తుగడల పట్ల తనకున్న అభ్యంతరాలనూ ప్రకటించాడు. విమర్శ కూడా చేశాడు. అయినా సరే ‘చలన సూత్రాలు మహత్తర కవిత్వం’ అని పలికిన వాటికి, పారవశ్యంతో పాడిన వాటికి, అనేక త్యాగాలను కళ్లారా చూసి వేదన చెందినవాటికి విప్లవోద్యమంలో మమేకం తప్ప మరొకటి కనిపించదు.
”స్మృతులు రహస్యోద్యమాలని అతడు గుర్తించాడు/ స్మారక స్థూపాలు నెత్తుటి పొత్తిళ్లని అతడు అర్థం చేసుకున్నాడు/ భూమిలో కుక్కేసిన జెండాకర్ర వేళ్లు సారిస్తోందని అతడు భయపడ్డాడు/ జీవితాన్ని చంపెయ్యటమే కాదు/ మరణాన్ని కూడా చంపెయ్యాలని అతడు పగబట్టాడు”.
ఇందులో ‘అతడు’ ఎవరో గుర్తించడం కష్టమేమీ కాదు. సముద్రాల్ని సమావేశపరచమని, రక్కసి పొదల్ని నిద్ర లేపమని, పర్వతాలకు భాష నేర్పమని, చివరకు ‘అసెంబ్లీ చుట్టూ స్మారకస్తూపాల్ని మోహరించండి’ అని పిలుపు నిచ్చిన వాడికి ఉద్యమం పరాయిదెందుకవుతుంది.
”ప్రభుత్వం హత్యలు చేస్తోంది/ నల్లని అచ్చులో వున్న ఈ మూడు పదాలను ఎవరూ హత్య చేయలేరు” అని నిర్ద్వందంగా పలికాడు.
విప్లవం నేల రాలితే/ త్యాగం గాయపడుతుంది/ రహదారి నడక మానేస్తుంది/ అమరుడికైనా సమరుడికైనా/ తాత్కాలిక అపజయం తప్పదు కదా” అన్నప్పుడు తాను ఎంతగా ఉద్యమంపై విమర్శ పెట్టినా ఉద్యమం గురించి అచంచల విశ్వాసం శ్రీనివాస్‌ది.
తెలుగు సాహిత్య సమాజంలో రావలసిన మార్పు కోసం నిరీక్షించాడు. ఆ మార్పు క్రమానికి శ్రీకారం చుట్టాడు. భయము అనే చాటాల్సిన ఒక విశేషాన్ని గుర్తించిన వాడు. దళిత కవిత్వాన్ని వెల్లువెత్తటానికి దారి చూపినవాడు. ‘మొత్తం శతాబ్దం గుర్తుపెట్టుకునే మార్పు కోసం’ పరిశ్రమించినవాడు. ‘యుద్ధం మనమీద కాదు మనది కూడా’ అని తేల్చి చెప్పినవాడు. తానే అన్నట్లుగా ‘జీవితాన్నే కాదు/ మరణాన్ని కూడా బతికించుకోవాలి”.
– సీతారాం

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad