Saturday, November 8, 2025
E-PAPER
Homeజాతీయంసమగ్ర అధ్యయనంతోనే పరిష్కారం

సమగ్ర అధ్యయనంతోనే పరిష్కారం

- Advertisement -

అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో పినరయి విజయన్‌

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రపంచంలో వ్యవసాయ రంగ సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసినప్పుడే పరిష్కార మార్గాలను కనుగొనగలమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు. ఆ విధంగా అధ్యయనం చేసేందుకు, పరిష్కారాలను కనుగొనేందుకు ఈ అంతర్జాతీయ సదస్సు ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు. ఫౌండేషన్‌ ఫర్‌ ఆగ్రేరియన్‌ స్టడీస్‌ (ఫాస్‌) ఆధ్వర్యాన అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు కేరళలోని తిరువనంతపురంలో గురువారం సాయంత్రం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపై చర్చిస్తున్న ఈ సదస్సును పినరయి విజయన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. భారతదేశం, పలు దేశాల్లో ముఖ్యపాత్ర వహిస్తున్న వ్యవసాయ రంగం అభివృద్ధి చాలా అవసరమని అన్నారు. ప్రజలకు తిండినందించే వ్యవసాయరంగం ప్రపంచీకరణ, సరళీకరణ విధానాల వల్ల తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోందన్నారు. ఈ అంతర్జాతీయ సదస్సు వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలు లోతుగా చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తుందని ఆయన ఆకాంక్షించారు.

సదస్సు ప్రారంభ కార్యక్రమం ప్లీనరీ సెషన్‌కు కన్వీనర్‌, కేరళ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ వికె రామచంద్రన్‌ అధ్యక్షత వహించారు. సదస్సులో ప్రముఖ పాత్రికేయులు ఎన్‌ రామ్‌ సావనీర్‌ ఆవిష్కరించి సీనియర్‌ రైతు నాయకులు ఎస్‌ రామచంద్రన్‌ పిళ్ళైకు అందించారు. సర్వేల రిపోర్టులు, పరిశోధన పత్రాలు త్వరగా ప్రజలకు చేరాలని ఎన్‌ రామ్‌ ఆకాంక్షించారు. అత్యంత వేగవంతమైన ఆధునిక యుగంలో ఆలస్యం నష్టాలకు దారితీస్తుందన్నారు. వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర అమోఘమని, కానీ వారు తీవ్రంగా నిర్లక్ష్యం చేయబడుతున్నారని మహిళా ఉద్యమ నేత బృందాకరత్‌ పేర్కొన్నారు. ఆదివాసీ, దళిత మహిళలు అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. ఎఐకెఎస్‌ అధ్యక్షులు అశోక్‌ ధావలే, ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌, అధ్యక్షులు ఎ విజయ రాఘవన్‌, సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబి, పూర్వ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌, ప్రొఫెసర్‌ వెంకటేష్‌ ఆత్రేయ, ప్రొఫెసర్‌ మధురస్వామి నాథన్‌, ప్రొఫెసర్‌ ఎస్‌ మహేంద్రదేవ్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

దేశంలోని 15 రాష్ట్రాలతో సహా వియత్నం, చైనా, బ్రెజిల్‌ పోర్చుగీస్‌ సహా 25 దేశాల నుండి ప్రొఫెసర్లు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఆదివారం వరకు 25 అంశాలపై ప్రముఖులు పత్రాలు సమర్పించనున్నారు. చెరకు, వరి, ఆక్వా, కొబ్బరి, పాడి, కూరగాయలు, అరటి, కోకో, పొగాకు, మొక్కజొన్న, పండ్ల తోటలు తదితర పంటల్లో రైతాంగ సమస్యలపై ఈ పత్రాల్లో చర్చించనున్నారు. ప్రధానంగా సన్న, చిన్నకారు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల స్థితిగతులు, ఆహార భద్రత, పెరుగుతున్న అసమానతలు ఈ పత్రాల్లో చోటు చేసుకుంటాయని ఫాస్‌ డైరక్టర్లు, నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ, పర్యావరణ పరిస్థితుల్లో వస్తున్న అసాధారణ మార్పులు, వ్యవసాయరంగంపై చూపుతున్న తీవ్ర ప్రభావం, వస్తున్న దుష్ఫలితాలు తదితర అంశాలపైనా చర్చించనున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి బి బలరాం, తెలంగాణ నుంచి సాగర్‌, అరిబండి ప్రసాద్‌, వెంకట్రాములు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -