పైప్ బ్యాండ్ (బాలికలు) పోటీల్లో తెలంగాణకు మొదటిస్థానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సమగ్ర శిక్ష తెలంగాణ ఆధ్వర్యంలో గురు, శుక్రవారాల్లో రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో నిర్వహించిన దక్షిణ ప్రాంత బ్యాండ్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఆండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యార్థి బృందాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. బ్రాస్ బ్యాండ్ (బాలురు, బాలికలు), పైప్ బ్యాండ్ (బాలురు, బాలికలు) విభాగాల్లో దక్షిణ ప్రాంత స్థాయిలో విజేతగా నిలిచిన బృందాలు ఢిల్లీలో జరగబోయే జాతీయ స్థాయి బ్యాండ్ పోటీకి సౌత్‌జోన్ నుంచి ప్రాతినిధ్యం వహించనున్నాయి. ముగింపు కార్యక్రమంలో సీఎం సలహాదారు కె.కేశవరావు, పాఠశాల విద్య సంచాలకులు డాక్టర్ ఈ.నవీన్ నికోలస్, జాయింట్ డైరెక్టర్ రాజీవ్ తదితరులు హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ పోటీల్లో బ్రాస్ బ్యాండ్ (బాలురు) పోటీల్లో తెలంగాణ రెండో స్థానాన్ని, బాలికల విభాగంలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. పైప్ బ్యాండ్ (బాలికల విభాగం)లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.



