Thursday, July 31, 2025
E-PAPER
Homeజాతీయంపసలేని ప్రధాని ప్రసంగం

పసలేని ప్రధాని ప్రసంగం

- Advertisement -

– ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు దాటవేత
– మంత్రులు, ఎన్డీఏ నేతలదీ అదే దారి
– కాంగ్రెస్‌పై ఎదురు దాడితో సరిపెట్టిన పాలక పక్షం
న్యూఢిల్లీ :
ఆపరేషన్‌ సిందూర్‌పై లోక్‌సభలో 16 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన చర్చకు మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సమాధానం ప్రతిపక్షాలు, విమర్శకులు లేవనెత్తిన అనేక ప్రశ్నలకు జవాబు ఇవ్వలేకపోయింది.
ఏన్డీఏలోని పలువురు నేతలు ఆపరేషన్‌ సిందూర్‌ను సమర్ధించడంతో పాటు పనిలో పనిగా కాంగ్రెస్‌పై విమర్శలు సంధించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పాటు పలువురు అధికార పక్ష సభ్యులు ప్రతిపక్షాలను పాకిస్తాన్‌, ఇస్లాం మద్దతుదారులుగా చిత్రీకరిస్తూ హేళన చేశారు. తమను తాము స్వచ్ఛమైన హిందూ జాతీయతావాదులుగా చెప్పుకునే ప్రయత్నం చేశారు.
జవాబు లేని ప్రశ్నలు
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంగా అంత ర్జాతీయ సమాజం ఎదుట పాకిస్తాన్‌ను దోషిగా నిలిపేం దుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ఐఎంఎఫ్‌, ఏడీబీ వంటి ఆర్థిక సంస్థల నుంచి ఆ దేశం ఏ విధంగా రుణాలు పొందిందన్న ప్రతిపక్షాల ప్రశ్నపై కూడా ప్రభుత్వం స్పందించలేదు. అమెరికా సైనిక దినోత్సవం సందర్భంగా పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఫీల్డ్‌ మార్షల్‌ అసీమ్‌ మునీర్‌కు ఆహ్వానం ఎలా వచ్చింది? ఇటీవల ట్రంప్‌ నుంచి ఆయనకు విందు ఆహ్వానం ఎలా వచ్చింది? అనే ప్రశ్నలకూ ప్రభుత్వం వద్ద సమాధానం లేకుండా పోయింది. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్‌కు చైనా అందించిన సాయం పైన, ఉగ్రదాడి తర్వాత ఏ దేశం కూడా పాకిస్తాన్‌ చర్యను ఎందుకు ఖండించలేదన్న అంశం పైన కూడా ప్రభుత్వం వివరణ ఇవ్వలేకపోయింది.

భద్రతా వైఫల్యంపై బిక్కమొహం
ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వలేక బిక్కమొహం వేసుకున్న పాలక పక్ష మంత్రులు కాంగ్రెస్‌ హయాంలో జరిగిన దౌత్య వైఫల్యాలను ఏకరువు పెట్టారు. పహల్గాం దాడి సమయంలో చోటుచేసుకున్న నిఘా వైఫల్యంపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు ఎవరూ ఒక్క వివరణ కూడా ఇవ్వలేకపోయారు. ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి ఆ తర్వాత అక్కడి నుంచి ఎలా తేలికగా తప్పించుకోగలిగారన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. పాలక పక్ష సభ్యులు చేసిందల్లా ప్రతిపక్షాలు లేవనెత్తిన చట్టబద్ధమైన ఆందోళనలను తోసిపుచ్చడం. దాడి జరిగినప్పుడు బైసారన్‌ లోయలో సరైన భద్రతా ఏర్పాట్లు ఎందుకు జరగలేదు? క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలు ఎందుకు అందలేదు? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి మౌనమే సమాధానంగా వచ్చింది.
అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఆపరేషన్‌ సిందూర్‌ను నిలిపివేయాలని ఏ ప్రపంచ నేత తనను కోరలేదని చెప్పిన ప్రధాని మోడీ, ట్రంప్‌ పేరును ప్రస్తావించకుండా దాటవేశారు. రెండు గంటల పాటు చేసిన ప్రసంగంలో ఆయన పహల్గాం ఉగ్రదాడికి దారితీసిన కారణాలేమిటో వివరించలేదు.

నష్టం జరిగిన మాట నిజమే
ఇక ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత యుద్ధ విమానాలకు జరిగిన నష్టంపై ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు కూడా ప్రభుత్వం సమాధానాన్ని దాటవేసింది. ఇలా ప్రశ్నించిందుకు పలువురు ఎన్డీఏ నేతలు ప్రతిపక్షాలను ఎగతాళి చేశారు. బెదిరించారు. ప్రతిపక్ష నాయకులను పాకిస్తాన్‌ మద్దతుదారులుగా ముద్ర వేశారు. ప్రతిపక్షం సంధించిన ప్రశ్నకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సరైన సమాధానాన్ని ఇవ్వలేకపోయారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రశ్న వేశాయంటూ నిందించారు. మొత్తంమీద ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌కు కొంత నష్టం జరిగిందనే వాదనతో ఆయన ఏకీభవించినట్లే కన్పించారు. అంతిమంగా ఫలితమే ముఖ్యమని చెప్పుకొచ్చారు.

రాహుల్‌ సవాలుకు జవాబే లేదు
ఏప్రిల్‌ 22, జూన్‌ 17 మధ్యకాలంలో ట్రంప్‌, మోడీ మధ్య ఎలాంటి ఫోన్‌ సంభాషణలు జరగలేదని విదేశాంగ మంత్రి జైశంకర్‌ గతంలోనే చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో అనేక దేశాల నేతలు ప్రధానికి ఫోన్‌ చేశారని, మధ్యవర్తిత్వం ప్రసక్తే లేదని మోడీ వారికి స్పష్టం చేశారని కూడా తెలిపారు. జైశంకర్‌ గతంలో చెప్పిన విషయాలనే మోడీ మంగళవారం సభలో పునరుద్ఘాటించారు. ప్రభుత్వం సరిగా వ్యవహరించి ఉంటే రెండు దక్షిణాసియా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి తానే కారకుడినని ట్రంప్‌ ఎందుకు చెప్పుకుంటారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ట్రంప్‌ అబద్ధాలు ఆడుతున్నారని చెప్పాల్సిందిగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రధానిని సవాలు చేశారు. అయితే ప్రభుత్వం తన సమాధానంలో ఆ విషయాన్నే ప్రస్తావించలేదు.

ట్రంప్‌ ప్రకటనలపై మౌనం
పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను జులై28న ఉమ్మడి సైనిక చర్యలో మట్టుపెట్టామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించి అధికార పక్షంలో ఉత్సాహాన్ని నింపారు. అయితే పహల్గాం దాడిపై ప్రతిపక్షాలు లేవనెత్తిన పలు ప్రశ్నలు, సందేహాలకు ప్రభుత్వం నుంచి విశ్వసనీయ సమాధానం లభించలేదు. పాలక పక్ష సభ్యులు తమ ప్రసంగాలలో ప్రతిపక్షాలపై ఎదురు దాడి చేసేందుకే ఎక్కువగా ప్రయత్నించారు. భారత్‌, పాక్‌ మధ్య కాల్పుల విరమణ కుదరడానికి తానే కారకుడినంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదే పదే చేసిన ప్రకటనలపై ప్రధాని తన సమాధానంలో పెదవి విప్పలేదు. కాల్పుల విరమణపై భారత కంటే అమెరికాయే ముందుగా ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చిందో కూడా ఎవరూ వివరించలేదు. మోడీ, షా, జైశంకర్‌, రాజ్‌నాథ్‌…వీరిలో ఎవరూ ప్రతిపక్షాల సందేహాలను నివృత్తి చేయలేకపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -