కార్పొరేట్లకు మేలు చేసేలా కేంద్రం కొత్త విత్తన చట్టం: రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైతులకు మేలు చేసేలా రాష్ట్ర విత్తన ముసాయిదా చట్టాన్ని రూపొందిస్తున్నామని తెలంగాణ రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విత్తన చట్టం విత్తన కంపెనీలకు అనుకూలంగా ఉందని విమర్శించారు. విత్తనాలు, రసాయన ఎరువులు ఇలా అన్ని అంశాల్లోనూ మల్టీ నేషనల్ కంపెనీలకే ప్రయోజనాలు చేకూరేలా కేంద్ర చట్టం ఉందని ఎత్తిచూపారు. సోమవారం హైదరాబాద్‌లోని రైతు కమిషన్ కార్యాలయంలో విత్తన చట్టం ముసాయిదా కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో సీడ్ కార్పొరేషన్ చైర్మెన్ అన్వేష్ రెడ్డి, కమిషన్ సభ్యులు రాములు నాయక్, కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, భూమి సునీల్, అగ్రికల్చర్ డైరెక్టర్ బి.గోపి, కమిటీ సభ్యులు దొంతి నర్సింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శివ ప్రసాద్, మెంబర్ సెక్రెటరీ గోపాల్, అగ్రికల్చర్ అడిషనల్ డైరెక్టర్ నర్సింహారావు, కమిషన్ అధికారులు సంధ్యారాణి, హరి, శ్రావ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ…కేంద్రం తీసుకొస్తున్న విత్తన చట్టంలో లోపాలు, రాష్ట్ర విత్తన చట్ట పరిధిలో లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తదితర అంశాలపై చర్చించనున్నారు.
నకిలీ విత్తనాలను అరికట్టడంలో మీద గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తమ ప్రజాప్రభుత్వం రైతాంగానికి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేస్తున్నదనీ, లక్ష 10 వేల కోట్ల రూపాయలు సాయం చేసిందని వివరించారు. ప్రయివేటు విత్తన కంపెనీలు నకిలి విత్తనాలు ఇవ్వడం వల్ల ములుగు జిల్లా ఆదివాసీ రైతులు తీవ్రంగా నష్టపోయారనీ, కమిషన్ చొరవ తీసుకుని రూ.4 కోట్ల పరిహారం అందేలా చూసిందని గుర్తుచేశారు. మిర్చి, పత్తి, వరి విత్తనాలతో రైతులు నష్టపోతున్నారనీ, ఆ అంశాలంన్నిటినీ దృష్టికి తీసుకుని రాష్ట్ర విత్తన చట్ట ముసాయిదా కమిటీని వేసిందని తెలిపారు. ముసాయిదా చట్టం తుదిదశకు చేరుకున్నదన్నారు. అన్వేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. నష్టపోతున్న విత్తన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని పోరాటం చేశామన్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని విత్తన చట్టం తీసుకురావాలని కోరామన్నారు. అందుకే హర్యానాలో పర్యటించామని తెలిపారు. రాష్ట్ర విత్తన చట్టం ద్వారానే రైతులతో పాటు విత్తనోత్పత్తి రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర పరిధిలో చట్టం ఉండాలన్నారు.



