నవతెలంగాణ-జోగిపేట
డెంగ్యూతో ఓ విద్యార్థి మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగిపేట పట్టణానికి చెందిన కుమ్మరి మధుమతి, భాస్కర్ దంపతుల రెండవ కూతురు యశస్విని (12)కి ఆరు రోజుల క్రితం జ్వరం రావడంతో జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్సలు చేయించారు. మూడు రోజులు చికిత్స పొందినా జ్వరం తగ్గకపోవడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ 2 రోజులు చికిత్స పొందిన తర్వాత యశస్వినికి వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ అని తేలింది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో బాలికను నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం ఉదయం మృతిచెందింది. కాగా, యశస్విని జోగిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతుంది. పరిసరాలు పరిశుభ్రంగా లేవని, ఇంటి చుట్టూ గడ్డి ఎక్కువగా పెరగడంతో దోమలు విలయ తాండవం చేస్తున్నాయని మున్సిపల్ కమిషనర్‌కు చెప్పినా పట్టించుకోలేదని మృతురాలి తండ్రి భాస్కర్ ఆరోపించారు.
డెంగ్యూతో విద్యార్థిని మృతి
- Advertisement -
- Advertisement -