Thursday, October 16, 2025
E-PAPER
Homeజాతీయంమహా సీఎం ఎదుట మల్లోజుల లొంగుబాటు

మహా సీఎం ఎదుట మల్లోజుల లొంగుబాటు

- Advertisement -

60 మంది సహచరులతో కలిసి ఆయుధాలు అప్పగింత
ఛత్తీస్‌గఢ్‌లో మరో 50 మంది సరెండర్‌

గడ్చిరోలి: మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ అభయ్ బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఎదుట 60 మంది మావోయిస్టు సహచరులతో కలిసి అధికారికంగా లొంగిపోయారు. సీఎం సమక్షంలో వీరంతా తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మల్లోజుల, ఆయన బృందాన్ని సీఎం ఫడ్నవీస్‌ జన జీవన స్రవంతిలోకి ఆహ్వానించారు.
మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమని పేర్కొంటూ అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్‌బ్యూరో నుంచి వైదొలిగారు.

తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడారు. మల్లోజులపై వందకు పైగా కేసులు ఉన్నాయి. మల్లోజుల సొంత రాష్ట్రం తెలంగాణ. పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య, మధురమ్మ దంపతులకు వేణుగోపాల్‌రావు మూడో సంతానం. తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచే వేణుగోపాల్‌, ఆయన రెండో అన్న కోటేశ్వరరావు స్ఫూర్తి పొందారు. చదువు పూర్తయిన అనంతరం తన అన్న పిలుపు మేరకు ఉద్యమంలో ప్రవేశించారు. పార్టీలో ఆయనను అభయ్, సోను, భూపతి, వివేక్‌ పేర్లతో పిలిచేవారు. మల్లోజులపై రూ.6 కోట్ల రివార్డు ఉన్నట్టు గడ్చిరోలి పోలీసులు ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ 50 మంది మావోయిస్టులు బీఎస్‌ఎస్‌ జవాన్ల ముందు సరెండర్‌ అయ్యారు. వీరిపై రూ.50 లక్షల రివార్డు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -