స్థానిక మొక్కలు లేకపోవడంతో ఇతర జిల్లాల నుండి సరఫరా…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరంలో ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట కేంద్రీయ నర్సరీలో మొక్కలు అయిపోవడంతో ఇతర జిల్లాలోని మొక్కలను అశ్వారావుపేట కు తరలించి రైతులకు పంపిణీ చేయడానికి ఆయిల్ ఫెడ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో రాష్ట్రంలోని ఏ ఇతర ప్రాంతంలో పామాయిల్ సాగు చేయాలన్నా అశ్వారావుపేట కేంద్రీయ నర్సరీ నుండే మొక్కలు సరఫరా చేసేవారు. విస్తీర్ణం పెంపుదల తో పాటు ఆయిల్ ఫెడ్ నర్సరీలను విస్తరించడంతో నేడు ఇతర ప్రాంతాలనుండి మొక్కలు ఇక్కడికి తరలిస్తున్నారు.
2023 లో చివరి గా అశ్వారావుపేట లో పామాయిల్ మొక్కలు పెంచారు.అప్పటి నుండి ఇక్కడ మొక్కలు పెంచలేదు. ఈ ఆర్ధిక సంవత్సరం ఉమ్మడి జిల్లాలో మొత్తం 11500 ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తీర్ణం పెంపుకు ఆయిల్ఫెడ్ లక్ష్యంగా కార్యాచరణ చేపట్టింది.అయితే ఇప్పటికే 4594 ఎకరాల్లో మొక్కలు నాటడం పూర్తి చేసారు.మిగతా 6900 ఎకరాలకు సిద్దిపేట,బీచుపల్లి,మహబూబాబాద్ ప్రాంతాల లో పెంచిన మొక్కలను ఇక్కడి రైతులకు ఇవ్వడానికి అశ్వారావుపేట లో సుమారు 3 లక్షల మొక్కలు అందుబాటులోకి తెచ్చామని ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఆయిల్ ఫెడ్ అధికారులు శంకర్,రాధా క్రిష్ణ లు మంగళవారం తెలిపారు.