పన్నుల రూపంలో తీవ్ర ప్రభావం
యూఎస్ ఎంపీల ఆందోళన
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. భారత్‌పై విధించిన అధిక సుంకాలు వాస్తవానికి అమెరికన్ల పైనే పన్నుల భారంగా మారుతున్నాయని యూఎస్ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. భారతదేశం నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ విధించిన సుంకాలను సవాలు చేస్తూ అమెరికా ప్రతినిధుల సభకు చెందిన ముగ్గురు సభ్యులు డెబోరా రాస్, మార్క్ విసి, రాజా కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని, ప్రతికూల ఫలితాలనిస్తాయని, అమెరికన్ వినియోగదారులు, వ్యాపార సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వాదించారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్రతినిధులు డెబోరా రాస్, మార్క్ విసి, కృష్ణమూర్తి శుక్రవారం ప్రవేశపెట్టారు. ముఖ్యంగా 2025 ఆగస్టు 27న విధించిన అదనపు 25 శాతం సెకండరీ టారిఫ్‌లు లక్ష్యంగా ఈ తీర్మానం ఉంది. అధిక సుంకాలు తన సొంత రాష్ట్రమైన నార్త్ కరోలినాలోని ప్రజలను ఇప్పటికే ఇబ్బందులు పెడుతున్నాయని రాస్ తెలిపారు. ”నార్త్ కరోలినా ఆర్థిక వ్యవస్థ వాణిజ్యం, పెట్టుబడులు, భారతీయ అమెరికన్ కమ్యూనిటీ ద్వారా భారత్‌తో విడదీయలేని బంధాన్ని కలిగి ఉంది” అని ఆమె అన్నారు.
వేల సంఖ్యలో ఉద్యోగాలు, బిలియన్ల కొద్దీ పెట్టుబడులు భారతీయ కంపెనీలతో ముడిపడి ఉన్నాయని, ఈ సుంకాలు ఆ కీలక భాగస్వామ్యాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు.ఈ సుంకాలు కుటుంబాలపై ప్రత్యక్ష భారంగా మారాయని మార్క్ విసి వివరించారు. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న సామాన్య ఉత్తర టెక్సాస్ ప్రజలపై ఈ చట్టవిరుద్ధమైన సుంకాలు పన్నుల్లా మారుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ టారిఫ్ చర్యలు సరఫరా గొలుసులకు, అమెరికన్ కార్మికులకు హానికరమని కృష్ణమూర్తి విమర్శించారు. ”అమెరికా ప్రయోజనాలను లేదా భద్రతను పెంపొందించడానికి బదులుగా, ఈ సుంకాలు సరఫరా గొలుసులకు అంతరాయం కలిగిస్తున్నాయి, ఖర్చులను పెంచుతున్నాయి” అని ఆయన అన్నారు. ఈ సుంకాలకు స్వస్తి చెప్పడం ద్వారా అమెరికా, భారత్ ఆర్థిక, భద్రతా సంబంధాలు బలోపేతమవుతాయని తెలిపారు.



