26న కేజీబీవీ, యూఆర్‌ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగుల ‘చలో అసెంబ్లీ’
ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతకు ఉద్యమం
శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా.. కనీస వేతనాల కోసం డిమాండ్
18వేల మంది ఉద్యోగులకు అండగా టీఎస్ యూటీఎఫ్
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సమాన పనికి సమాన వేతనం.. కనీస వేతనాలు.. ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత కోసం.. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా.. టీఎస్ యూటీఎఫ్ నడుం బిగించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18,000 మంది కస్తూర్బా గాంధీ బాలికల నిలయాలు(కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్‌ఎస్), సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత కోసం ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా వివిధ దశల్లో ఆందోళనలు చేపడుతోంది. వినతిపత్రాలు, కలెక్టరేట్ల వద్ద ధర్నాలు తదితర కార్యక్రమాలు చేపట్టింది. అయినప్పటికీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడంతో ఈనెల 26వ తేదీన అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది.
కనీస వేతనాలకు నోచుకోని స్థితి
రెండు దశాబ్దాల నుంచి కేజీబీవీ, యూఆర్‌ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగ, ఉపాధ్యాయులు కనీసం వేతనాలకు నోచుకోవటం లేదు. తీవ్ర శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా వారికి ఇచ్చిన హామీలు అమలు కావటం లేదు. తమ భవిష్యత్ ఏమిటని వారు ఆవేదన చెందుతున్నారు. వారి ఆవేదనను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. టీఎస్ యూటీఎఫ్ దీనిపై అనేక పర్యాయాలు ఆందోళనలు నిర్వహించింది. ఫలితంగా కొన్ని సమస్యలు పరిష్కార మయ్యాయి. ఇంకా కొన్ని అపరిష్కృతంగానే ఉన్నాయి. దీనిపై సుప్రీంకోర్టు సైతం మందలించినా పెద్దగా చలనం లేదనే విమర్శ ప్రభుత్వాలపై ఉంది.
సమాన పనికి సమాన వేతనం కోసం..
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కేజీబీవీ, యూఆర్‌ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. వారికి కనీస వేతనం బేసిక్ పే చెల్లించాలి. పీఆర్సీ సిఫారసు చేసిన విధంగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సాధారణ సెలవుల వినియోగానికి అర్హత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. నెలకు రెండు సాధారణ సెలవులు అనే పరిమితిని ఎత్తేయటంతోపాటు రెగ్యులర్ ఉపాధ్యాయులకు వర్తించే అన్ని రకాల సెలవులు ఇవ్వాలని అడుగుతున్నారు. హెల్త్ కార్డులు ఇచ్చి నగదు రహిత వైద్యం అందించాలని కోరుతున్నారు. హాస్టల్స్ నిర్వాహణ కోసం కేర్ టేకర్‌లను నియమించాలంటున్నారు. సీఆర్‌టీలు, పీజీ సీఆర్టీలకు నైట్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాల్సి ఉంది.
చిన్న కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న తీరు వారి భద్రతను ప్రశ్నార్ధకంగా మార్చింది. కేజీబీవీలలో పనిచేస్తున్న అన్ని రకాల పోస్టుల జాబ్ చార్ట్ ను అప్డేట్ చేయాలి, వారి డ్యూటీ టైమింగ్స్‌పై స్పష్టతనిస్తూ మార్గదర్శకాలు జారీ చేయాలి, మెస్ చార్జీలు ఒక నెల అడ్వాన్స్‌గా మంజూరు చేయాలి. రెండో శనివారం ఆప్షనల్ హాలిడే వినియోగానికి అవకాశం కల్పించాలి.. రిటైర్మెంట్ సందర్భంగా అంగనవాడీల తరహాలో బెనిఫిట్స్ నిర్ణయించాలి.. రెసిడెన్షియల్ పద్ధతిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో కేజీబీవీ, యూఆర్‌ఎస్ ఉద్యోగులకు క్వార్టర్స్ వసతి కల్పించాలి.. యూఆర్‌ఎస్‌లకు సొంత భవనాలు నిర్మించాలి.. స్కూల్ యాక్టివిటీస్‌పై ప్రతిరోజూ ఫొటోలు వాట్సప్‌లో పెట్టమనటం విరమించాలి.. ఎస్ వోను ప్రిన్సిపాల్‌గా, పీజీ సీఆర్టీలను జేఎల్స్‌గా, సీఆర్టీలను సీఆర్పీలుగా లేదంటే స్కూల్ అసిస్టెంట్స్‌గా గుర్తించి ఆ పోస్ట్ బేసిక్ పే ఇవ్వాలనే డిమాండ్‌లను సంబంధిత ఉద్యోగులు ఎప్పటినుంచో విజ్ఞప్తి చేస్తున్నారు.
రెసిడెన్షియల్ పద్ధతిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో కేజీబీవీ, యూఆర్‌ఎస్ ఉద్యోగులకు క్వార్టర్స్ కల్పించాలని, కేజీబీవీ స్టాప్ ఫ్యాట్రన్‌తో సమానంగా యూఆర్‌ఎస్‌లో సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. అదేవిధంగా, పీఆర్సీ సిఫారసు చేసిన ప్రకారం కేజీబీవీ, యూఆర్‌ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ ప్రతి సంవత్సరం రూ.వెయ్యి ఇంక్రిమెంట్ ఇవ్వాల్సి ఉంది. కేజీబీవీలోని జూనియర్ కళాశాలలకు అదనపు సిబ్బందిని అదనపు నిధులను కేటాయించాలి, జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం అదనంగా ఇద్దరు పీడీలు, ఇద్దరు అకౌంటెంట్లను నియమించాలని కోరుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులందరికీ రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీకి అనుగుణంగా కేజీబీవీ, యూఆర్‌ఎస్ కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా అవసరమైతే సూపర్ న్యూమరి పోస్ట్ సృష్టించి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా అనేక డిమాండ్ల పరిష్కారం కోసం వారు ఉద్యమిస్తున్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగులపై నిర్లక్ష్యం తగదు
షేక్ రంజాన్- టీఎస్ యూటీఎఫ్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు
అనేక ఏండ్లుగా విధుల్లో ఉన్న కేజీబీవీ, యూఆర్‌ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఉద్యోగ భద్రత లేకుండా.. దిన దిన గండంగా విధులు నిర్వహిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే విధానం వీరి విషయంలో అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు అండగా టీఎస్ యూటీఎఫ్ దశల వారీ పోరాటాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఈనెల 26న చలో అసెంబ్లీకి పిలుపు నిచ్చాం. ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం.



