- సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎమ్డి జహంగీర్
నవతెలంగాణ-భువనగిరి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దేశంలో ఒక చారిత్రక ఘట్టమని ఈ పోరాట వల్లనే భూమి బుక్తి వెట్టి చాకిరి నుండి ప్రజలకు విముక్తి అయిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ రైతాంగ సాయుధ రైతాంగ విప్లవ పోరాట వారోత్సవాలు భాగంగా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణం జడ్పీ కార్యాలయంలో ఉన్న స్వతంత్ర సమరయోధుల స్మారక చిహ్నం, రాజాపేట మండలం రేణిగుంట లో చింతలపూడి రాంరెడ్డి విగ్రహానికి, కాచారం దుంపల మల్లారెడ్డి స్మారక స్థూపానికి, ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో అమర జీవి ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలాదేవి ఆరుట్ల నరసింహారెడ్డి ఇతర అమరవీరుల స్థూపాలకు, గుండ్ల గూడెం ఎసిరెడ్డి నరసింహారెడ్డి, గుండాల ఆత్మకూర్ పులిగిల్ల గ్రామాలలో ఉన్న అమరుల స్మారక స్తూపాలకు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎమ్డి జహంగీర్ మాట్లాడారు. చారిత్రాత్మకమైన 11 ఆంధ్ర మహాసభ 1944లో భువనగిరిలో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిందన్నారు. ఆ సభలోనే మితవాద వర్గంగా, అతివాద వర్గంగా మహాసభ చిలిపోయిందన్నారు. అతివాద వర్గానికి రావి నారాయణరెడ్డి అధ్యక్షుడు అయ్యారన్నారు. నిజాం నిరంకుశ విధానాన్నికి, జమీందారు విధానానికి వ్యతిరేకంగా పల్లెల్లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సంఘాలను స్థాపించారన్నారు. ఈ పోరాటంలో నేలకొరిగిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని పేర్కొన్నారు. భూమికోసం, భుక్తి కోసం, దొరతనం నుండి విముక్తి కొరకు ఆనాటి నుండి పోరాటం సాయుధ రూపాన్ని సంతరించుకుందన్నారు.
ఈ చారిత్రాత్మకమైన పోరాటంలో హిందువులు, ముస్లింలు అనే భేదం లేకుండా రైతులు, కష్టజీవులు ఐక్యంగా భూస్వాములకు, నైజాం కు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. వీర తెలంగాణ పోరాటాన్ని నిజాం ముస్లిం పై హిందువులపోరాటంగా మతోన్మాదులు చిత్రీకరిస్తున్నారన్నారు. ఇలాంటి వక్రీకరణ చరిత్ర వల్ల వారు చరిత్రహీనులవుతారని తెలిపారు.బందగి, షోయాబుల్లా ఖాన్ లాంటి ఎందరో మహానుభావులు దొరలపై, నిజాం పైతమ ప్రాణాలను అర్పించారన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటం పై బీరాలు పలికిన కాంగ్రెస్ పార్టీ పోలీస్ చర్య తర్వాత అన్ని అరిష్టాలకు మూలమైన నిజాం రాజును దొరలను విచారణ జరపలేదన్నారు నిజామును రాజు ప్రముఖ్ గా చేసి తిరిగి ఫ్యూడల్ శక్తులు దేశ్ముకులు, దొరలు, భూస్వాములు, పటేల్, పట్వారిలు ఒక కూటమిగా తయారు చేసుకుని గ్రామాలకు రావడానికి ప్రయత్నించారన్నారు. కమ్యూనిస్టులు సాయుదా పోరాట వీరులై ఫ్యూడల్ శక్తుల కిరాతాకలని ఎదురుకున్నారన్నారు. వ్యవసాయ విప్లవ కార్యక్రమానికి ముందుకు తెచ్చి భూపోరాటాన్ని చేసిందన్నారు. వెట్టిచాకిరిలో మగ్గిన ప్రజలను చేరదీసి పోరాట దళాలుగా తర్ఫీదునిచ్చిందన్నారు.
ఒకవైపు ఫ్యూడల్ శక్తుల్ని, మరోవైపు రజాకార్లను, ఆ తర్వాత మిల్ట్రీని ఎదుర్కొంటూ ప్రజా కళారూపాలు రహస్య ప్రదర్శనలు ఇచ్చేటట్లు చేసింది కమ్యూనిస్టు పోరాటాలే అని పేర్కొన్నారు. మత, కుల, ప్రాంత భాష పరిమితుల కతీతంగా ఆనాడు కమ్యూనిస్టుల నాయకత్వంలో వివాహాలు వితంతు వ్యవహాలు జరిగాయి అన్నారు. అరచేతి అయిదువేళ్ళు బిగుసుకోని, పిడికిలిగా సంఘటితంగా పడి పోరాట విజయాలను సాధించిందన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ మాట్లాడుతూ ఆంధ్ర మహాసభ విప్లవ కమ్యూనిస్టు పార్టీగా మారి సాయుధ రహితంగా పోరాటంగా మారిందన్నారు వీర తెలంగాణను అజయంగా అభివృద్ధి చేశాయన్నారు దొరల దుర్మార్గాలను కండగట్టి భూ పోరాటాన్ని ముందుకు తెచ్చారన్నారు.
వెట్టి చాకిరి, దాసిల వ్యవస్థ, దోపిడీ, అణిచివేత, భూముల జప్తు, పాడి పశువుల స్వాధీనం లాంటి వ్యవస్థలపై కమ్యూనిస్టులు పోరాడి విజయం సాధించారన్నారు. రజాకార్ల సైన్యానికి కాసిం రాజ్వి అధ్యక్షులుగా ఉంటే విసునూరి రామచంద్రారెడ్డి ఉపాధ్యక్షులుగా పని చేశారన్నారు. గ్రామాలపై పడి దోచుకుంటుంటే కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సంఘం ఏర్పడ్డాయన్నారు. దోపిడి పై సాగిన పోరాటాన్ని కొందరు నేడు మతోన్మాదం వైపు మళ్లించడానికి కృషి చేశారన్నారు. ఇలాంటి ఘటనలు తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన ప్రజలు తిప్పికొట్టారన్నారు. నాడు జరిగిన పోరాటాన్ని ప్రజలకు వివరించడానికి నేడు సిపిఎం ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామ గ్రామానికి వెళ్లి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామన్నారు.
ప్రజలు ప్రశ్నించే గుణం రావాలన్నారు దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంటపాక శివ, ఈర్లపల్లి ముత్యాలు, కొలుపుల వివేకానంద, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, ఆయా గ్రామాల మండల పట్టణ సిపిఎం కార్యదర్శులు, కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.