దుర్గామాత గుడి నుంచి దళితుల గెంటివేత
దసరా వేడుకల్లో పెత్తందారుల దుశ్చర్య
తెలకపల్లి మండలం జంగమోనిపల్లిలో ఘటన
పెత్తందారులు తిన్నాకే దళితులకు భోజనాలు
వందేండ్లుగా దేవుని మొహం చూడని దళితులు
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
‘దళితులు మందిరంలోకి వస్తే గుడి మైలబడ్తది. ఆ గ్రామంలో ఏ గుడిలోకీ దళితులు రావడానికి వీల్లేదు. వందేండ్లుగా ఈదమ్మ, కోట మైసమ్మ, ఎల్లమ్మ దేవాలయాల మొహాన్ని దళితులు చూడలేదు. పెండ్లి, పేరంటాల్లో సైతం పెత్తందారులు భోజనం చేసిన తర్వాతే దళితులకు అన్నం పెడతారు. దసరా సందర్భంగా దుర్గామాత పూజకెళితే పొద్దస్తమానం నిలబెట్టి గుడి నుంచి బయటకు గెంటేశారు. పొలం పనుల్లో కూలీకిపోయినా, ఒక దగ్గర కూర్చొని భోజనం చేయడానికి నిరాకరిస్తారు. ఇప్పటికీ ఆ గ్రామంలో దాహం వేసినా దళితులకు చెంబుతో నీటిని ఎత్తిపోస్తారు. పెత్తందారులు దళితులపై కొనసాగిస్తున్న వివక్షను ప్రశ్నించిన యువతపై దాడికి పాల్పడుతున్నారు. ఇదంతా నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం జంగమోనిపల్లి గ్రామంలో వందేండ్లుగా నడుస్తున్న చరిత్ర. గురువారం దసరా పండుగ సందర్భంగా దళితులను గుడిలోకి రాకుండా అడ్డుకున్నారు.
దసరా సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జంగమోనిపల్లిలో దుర్గామాతను నిలబెట్టారు. తొమ్మిది రోజుల పూజల అనంతరం దుర్గాదేవిని నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ భక్తులు వచ్చి దుర్గామాతను పూజిస్తుంటారు. కాగా, దసరా రోజు దళితులు గుడి దగ్గర టెంకాయలు చేత పట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించారు. ఆ తర్వాత కొంతమంది యువకులు వచ్చి ”మీరు దేవాలయంలోకి వస్తే మా ఆరోగ్యాలు చెడిపోతాయి. శరీరం పోట్లు, మంటలు లేస్తాయి. దేవుడు శపిస్తాడు. మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి” అంటూ దళితులను గెంటేశారు. ఇదే విషయాన్ని దళితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలికి వచ్చినా, పెత్తందారులు దళితులను ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నారు.
మొరపెట్టుకున్నా వినలేదు..
ఒక టెంకాయ కొట్టి వెళ్ళిపోతామని, దేవుడిని తాకబోమని ఎంత చెప్పినా వినలేదు. దళిత బాధితులు పోతుల శైలజ, కాసిం పోతుల వెంకటయ్య, శేఖర్, పుష్ప తదితరులు ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకు టెంకాయ కొట్టనిస్తారేమోనని ఎదురు చూశారు. అయినా అగ్రకులాల యువకుల కు కనికరం రాలేదు. వారి ఇంటి పని అంతా తామే చేస్తామని, గుడిలో పూజ చేస్తే తప్పేంటి అని అడిగితే.. గుడి తమదని, తాము నిర్మించిన గుడిలోకి మీరెలా వస్తారని దాడికి పాల్పడే ప్రయత్నాలు చేశారని బాధితులు వాపోయారు.
మీ తాతలు, తండ్రుల లాగా ఉండండి
‘మీ తాతలు, తండ్రులు ఏనాడు మాకు ఎదురు నిలబడలేదు. చెప్పిన పని చేశారు. పెట్టింది తిన్నారు. మీరేమో గుడి, బడి అంటూ అమాయకులను రెచ్చగొడుతున్నారు అంటూ ఆగ్రకులాల యువకులు దళితులపై రుసరుసలాడారు. ఎద్దుల పెండ తీసే మీరే ఇలా అంటే, మాకెంత ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ తాతలు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. లేకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
పెండ్లిండ్లు, పేరంటాలకు దూరంగా..
గ్రామంలో ఎవరింట్లోనైనా పెండ్లయితే కార్డు ఇచ్చిపోతారు. వివాహం తర్వాత భోజనానికి వెళితే మేమంతా తిన్న తర్వాత అప్పుడు రండి అంటూ దళితులను దూరంగా ఉంచుతారు. వాళ్లు తిన్న తర్వాత మిగిలితే తినాలి. లేదంటే ఇంటికి రావాలి. ఇది ఆ గ్రామంలోని పరిస్థితి. వ్యవసాయ పనులకు వెళ్లినా, దళితుల దగ్గర కూర్చోరు. దూరంగా కూర్చోబెట్టి తాగునీటిని ఎత్తిపోస్తారు. ఏండ్ల తరబడి ఇలా జరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.
ఫిర్యాదు చేసినా కేసు కట్టని పోలీసులు
దళితులపై జరుగుతున్న వివక్ష, దాడుల పట్ల ఫిర్యాదు చేసినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు అందుకొని గ్రామానికి వచ్చినా, పోలీసుల ముందే తాము దళితులను గుడిలోనికి రానివ్వబోమని ఆగ్రకులాల వారు తెగేసి చెబుతున్నారు. అయినా పోలీసులు పెత్తందారు యువకులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇదే విషయమై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు.
ఘటనలు కొత్తేమీ కాదు..
దళితులపై దాడులు, వివక్ష జంగమోనిపల్లిలో కొత్తేమీ కాదు. 2021లో గ్రామంలో దుర్గామాతను నిలబెడుతున్నామని దళితుల దగ్గరకు అగ్రకుల యువకులు చందా కోసం వచ్చారు. చందా తీసుకొని తమకు గుడిలోకి రానిస్తారా అని దళితులు ప్రశ్నించారు. సరే అని డబ్బులు తీసుకొని మరుసటి రోజు మీ చందా మాకు అవసరం లేదు. మీరు గుడిలోకి రావొద్దంటూ హెచ్చరించారు. దుర్గామాత నిమజ్జనం సమయంలో బట్టలు వేలం వేస్తారు. ఆ సమయంలో దళితులు వస్తే మీరు వేలంలో పాల్గొనకూడదు. దుర్గామాత బట్టలు కాదు కదా కనీసం గాజు కూడా ఇవ్వబోమంటూ వేలంలో పాల్గొనకుండా చేశారు.
ఇప్పుడూ అదే తీరుగా గురువారం సాయంత్రం వేయాల్సిన వేలంపాటను ఉదయం 10గంటలకే పాడి దళితులను రాకుండా చేశారు. పెత్తందారులు ఉన్న మహిళా సంఘంలో ఒక మహిళ తక్కువ అయితే మాల సామాజిక తరగతికి చెందిన మహిళను తీసుకున్నారు. రెండో రోజు ఇంత మందిలో మీకు బీసీలు ఎవరు లేకున్నారా మాల, మాదిగలను ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నిస్తూ దళిత మహిళను మహిళా సంఘం నుంచి తొలగించారు. ఇలాంటి ఘటనలు ఆ గ్రామంలో తరచుగా జరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం ఆందోళన కలిగించే విషయం.
కించపరుస్తున్నారు : ఖాసిం
గ్రామంలో మమ్మల్ని కనీసం మనుషులుగా కూడా చూడటం లేదు. అడుగడుగునా కులవివక్షకు గురవుతున్నాం. గుడి ఏదైనా దళితులను రానివ్వడం లేదు. పెండ్లిండ్లు, పేరంటాల్లో సైతం మమ్మల్ని దూరంగా ఉంచుతున్నారు.
అంటరానివారంటూ దూరం పెడుతున్నారు : శైలజ
మమ్మల్ని అడుగడుగునా పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు. మేము ఆత్మ గౌరవంగా బతికే రోజులు లేవు. కూలికి పోయి దప్పికైతే చేతుల్లో నీళ్లు పోస్తున్నారు. ఇంతకన్నా హీనమైన బతుకు మాకు ఇంకేముంటుంది?
నిందితులపై చర్యలు తీసుకోవాలి: పరశురాములు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నాగర్‌కర్నూల్
78ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ దళితులను అంటరాని వాళ్ళుగా చూడటం ఆందోళన కలిగించే విషయం. సభ్య సమాజంలో తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం అంటరానితనం నిషేధమని చెప్పినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
చర్యలు తీసుకుంటాం : నరేష్, ఎస్‌ఐ తెలకపల్లి
తెలకపల్లి మండలం జంగమోనిపల్లిలో దళిత కుటుంబాలను దుర్గామాత ఆలయ ప్రవేశానికి రానివ్వకుండా అడ్డుకున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. నేను వెంటనే వెళ్లి పరిశీలించాను. బాధితులు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. పూర్వాపరాలు తెలుసుకొని కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటాం.