నవతెలంగాణ – నసురుల్లాబాద్
భూమి లేని రైతులు కౌలుకు తీసుకొని వరి పంటను సాగు చేస్తుండగా ప్రకృతి కన్నెర చెయ్యడంతో పెట్టిన పెట్టుబడి, దిగుబడి రాక పోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. బుదవారం నసురుల్లాబాద్ మండలంలోని కంశేట్ పల్లి, రాముల గుట్ట తండాకు చెందిన రైతులు కంశేట్ పల్లి గ్రామాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతులు మాట్లాడుతూ.. ఉమ్మడి మండలంలో పకృతి వైపరీత్యం, చీడ పురుగు సోకడంతో అనుకున్నంత దిగుబడి రాకపోవడం, పెట్టిన పెట్టుబడి రాక కౌలు రైతు అప్పుల పాలవడం జరిగిందన్నారు.
ఒక ఎకరానికి 18 నుంచి 20 బస్తాల చొప్పున వరి ధాన్యం పంట పండిందన్నారు. కౌలు తీసుకునే ముందు ఒక ఎకరానికి 10 నుండి 12 బస్తాలు కౌలు పట్టేదారుకు ఒప్పందం చేసుకోగా పంట దిగుబడి రాకపోవడం, కోసిన ధాన్యం వర్షానికి తడవడంతో కౌలు రైతులు అప్పుల పాలయ్యారు. అందుకు ఈ సారి ఎకరాన ఐదు బస్తాలు ఇస్తామని అందరి సమక్షంలో గ్రామ రైతుల సమక్షంలో తీర్మానించారు. కౌలు రైతుల సమస్యలను గుర్తించాలని కోరుతున్నారు.
భూమి లేదన్న కారణంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ప్రతి ఏటా కౌలు, పెట్టుబడి ధరలు పెరిగిపోతుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల ప్రభావం వరి పంటపై పడింది. పంట పూత, పాలు పోసుకునే స్టేజ్లో కురిసిన ఎడతెగని వానల కారణంగా పంటకు కొలికిరోగం, ఎండాకు తెగులు సోకాయి. క్రిమిసంహారక మందులు చల్లినా అదుపులోకి రాకపోవడంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. అలాగే కోసిన ధాన్యం 15 రోజులు అవుతున్న ధాన్యం కొనుగోలు కాక , తుపాన్ కారణంగా ధాన్యం తడిసిపోయింది. అష్టకష్టాలు పడి పంట పండిస్తే చేతికందే సమయంలో ప్రకృతి వైపరీత్యం కన్నెర్ర చేయడంతో కౌలు రైతులు అప్పుల పాలయ్యారని తెలిపారు. ఇప్పటికైనా కౌలు రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.



