Thursday, November 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబీసీలను మోసం చేసిన ద్రోహి కాంగ్రెస్‌

బీసీలను మోసం చేసిన ద్రోహి కాంగ్రెస్‌

- Advertisement -

– ఆ పార్టీకి బుద్ధి చెప్పాలి : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలను మోసం చేస్తున్న ద్రోహి కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి చెప్పాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. కులగణనలో ఐదారు శాతం బీసీ జనాభా తగ్గించి చూపించారని ఆమె విమర్శించారు. బీసీలకు అన్యాయం జరుగుతున్న స్పందించని బీజేపీ ప్రధాన దోషి అని దుయ్యబట్టారు. రిజర్వేషన్లు లేని చోట బీసీలు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి గెలవాలని ఆమె సూచించారు. అవసరమైతే ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీసీలకు మండల్‌ కమిషన్‌తో 27 శాతం రిజర్వేషన్లు కల్పించినా ఇప్పటి వరకు దేశంలో ఏ సంస్థలో కూడా సంపూర్ణంగా అమలు కాలేదని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇస్తామని చెప్పి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. పూలే ఫ్రంట్‌తో కలిసి చేసిన ఉద్యమంతోనే 42 శాతం రిజర్వేషన్ల బిల్లు తెచ్చారని చెప్పారు. ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద ఆగిపోవడంతో తాము రైల్‌రోకో చేస్తామని హెచ్చరిస్తే ఆర్డినెన్స్‌ తెచ్చారనీ, అదీ గవర్నర్‌ దగ్గర ఆగిపోయిందని తెలిపారు. బిల్లు తేవాల్సిన బీజేపీ మౌనంగా ఉన్న దోషి అని ఆమె విమర్శించారు. బీసీ కులగణన చేసి ఉంటే చాలా చోట్ల బీసీలకు రిజర్వేషన్లు వచ్చేవని తెలిపారు. గ్రామ పంచాయతీల వారీగా అన్ని కులాల జనాభా లెక్క బయటపెట్టాలని ఆమె డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్ల కేటాయింపుల్లో కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు నిద్రపోతున్నాయని విమర్శించారు. మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డిపై తాను చేసిన ఆరోపణలను తప్పు అని చెప్పలేదన్నారు. జీహెచ్‌ఎంసీలో చుట్టపక్కల ఉన్న ప్రాంతాలను కలిపితే పన్ను భారం ప్రజలపై పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -