– 40శాతం కూడా దాటని ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల వ్యయం
– అంకెల్లోనే ‘క్యారీ ఫార్వర్డ్’
– కేటాయింపులు, మంజూరీ, ఖర్చుకు మధ్య భారీ వ్యత్యాసం
– డిప్యూటీ సీఎం చెప్పినా బేఖాతర్
– సబ్‌ప్లాన్ లక్ష్యాలను నీరుగారుస్తున్న ప్రభుత్వాలు
మారేది పాలకులే తప్ప వారి విధానాలు కాదని మరోసారి స్పష్టమైపోయింది. గత బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్ని హుస్సేన్ సాగర్‌లో పూడికతీత, నాలాల మరమ్మతులు వంటి వాటికి ఖర్చు చేసిన ప్రభుత్వం అప్రదిష్టపాలైన విషయం తెలిసిందే. ఆ ప్రభుత్వం పోయి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా సబ్‌ప్లాన్ నిధుల వ్యయంలో ఏమాత్రం తేడా లేదు. బడ్జెట్ కేటాయింపులు, అంచనాల సవరణల తర్వాత కూడా కనీసం 40 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదంటే పాలకుల చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవు తోంది. ఈ విషయంలో స్వయంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వంద శాతం నిధులు ఖర్చు చేయాలని ఆదేశాలు ఇచ్చినా, వాటిని పట్టించుకున్న నాధుడే లేడు. తలకు మించిన అప్పులు, అరకొర ఆదాయం అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ ఖజానా గురించి ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే జనాభా ప్రాతిపదికగా ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన సబ్‌ప్లాన్ నిధుల విషయంలోనూ ‘ఖాళీ’ బోర్డునే చూపిస్తోంది.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏటా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సబ్‌ప్లాన్ కోసం చేసే కేటాయింపులు, చేస్తున్న ఖర్చు, క్యారీ ఫార్వర్డ్ అవుతున్న నిధుల సంఖ్యను పరిశీలిస్తే, పేదల పట్ల ప్రభుత్వాల వివక్ష ఏపాటిదో అర్థమవుతోంది. 27 ప్రభుత్వ శాఖల నుంచి సబ్‌ప్లాన్ కోసం ప్రత్యేకంగా నిధుల కేటాయింపు జరుగుతోంది. అసలు ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులే అరకొరగా ఉంటున్నాయి. వాటిలో ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చేస్తున్న కేటాయింపులు కేవలం కాగితాల్లోనే కనిపిస్తున్నాయి. సబ్‌ప్లాన్ చట్టం ప్రకారం శాఖల వారీగా చేసిన ఖర్చు వివరాలను ప్రతినెలా వెల్లడించాల్సి ఉంది. అయితే సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపు పరిధిలోకి వచ్చే పది శాఖలు ఇప్పటి వరకు ఒక్కపైసా కూడా ఖర్చు చేయలేదని గణాంకాలు చెప్తున్నాయి. సబ్‌ప్లాన్ పరిధిలోకి వచ్చే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రభుత్వ వ్యయం ఉండాలి. అసలు అలాంటి ప్రణాళికల్నే అధికారులు రూపొందించట్లేదని సమాచారం. నిధుల్లేవుకాబట్టి, ప్రణాళికలు ఉండి ఏం ప్రయోజనం అన్న తీరులో ఆయా శాఖల వ్యవహారాలు ఉంటున్నాయి. ఈ నిధుల వ్యయంపై ప్రభుత్వ సమీక్షల్లో ప్రత్యేక ఎజెండానే ఉండట్లేదని కొందరు అధికారులు చెప్తున్నారు. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం ద్వారా కేటాయించిన నిధుల్ని సంపూర్ణంగా ఖర్చు చేయాలి. కానీ ఆయా శాఖల బడ్జెట్ కేటాయింపుల్లో అలా జరగలేదు. దీనితో 2017-18లో అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని (ఎస్‌డీపీ) తీసుకొచ్చారు. అప్పుడూ నిధుల వ్యయంలో 15 నుంచి 25శాతం వరకు లోటు ఉంది. కానీ గడిచిన రెండేండ్లుగా ఈ వ్యత్యాసం 60 శాతానికి చేరింది. 40 శాతం లోపు నిధులు మాత్రమే ఖర్చవుతున్నాయి.
ఇలా నిర్లక్ష్యం…
సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపులు, మంజూరీ, ఖర్చుల విషయంలో జమీన్ ఆస్మాన్ ఫరక్ కనిపిస్తోంది.
– 2019-20 ఆర్థిక సంవత్సరంలో సబ్‌ప్లాన్ కోసం రూ.12,400.22 కోట్లు కేటాయించారు. వాటిలో రూ.13,778.98 కోట్లు (క్యారీ ఫార్వర్డ్ నిధులతో కలిపి) విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు. కానీ చేసిన ఖర్చు కేవలం రూ.10,744.79కోట్లు మాత్రమే.
– 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.16,534.97 కోట్లు కేటాయించి, రూ.10,223.99 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు. కానీ చేసిన ఖర్చు రూ.11,474.80 కోట్లు (క్యారీ ఫార్వర్డ్‌తో కలిపి) మాత్రమే.
– 2021-22లో రూ.21,306.85 కోట్లు కేటాయించి, రూ.19,189.61కోట్లు విడుదల చేస్తున్నట్టు పేర్కొని, చేసిన ఖర్చు మాత్రం రూ.16,301.07 కోట్లు.
– 2022-23లో రూ.33,937.76 కోట్లు కేటాయించి, రూ.29,110.71 కోట్లు విడుదలకు ఉత్తర్వులు ఇచ్చి, రూ.11,430.75 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
– 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.36,750.48 కోట్లు కేటాయించి, మంజూరు రూ.22,096.33 కోట్లకు ఇచ్చి, రూ.14,648.94 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
– 2024-25లో రూ. 33,124 కోట్లు కేటాయింపు చేసి, రూ. 20,316.38 విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చి, రూ.12,700 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
శాఖలవారీగానూ డొల్లే!
ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్ కోసం 27 ప్రభుత్వ శాఖలు నిధుల్ని కేటాయిస్తాయి. వాటిలో ప్రధాన శాఖల వివరాలను మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తున్నాం.
– 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ సబ్‌ప్లాన్ కోసం రూ.1,644.63 కేటాయించి, రూ.1,379.02 కోట్ల నిధుల విడుదల ఉత్తర్వులు (బీఆర్‌ఓ) ఇచ్చింది. చేసిన ఖర్చు రూ.542.34 కోట్లు మాత్రమే.
– తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ద్వారా రూ.3,278.00కోట్లు కేటాయించి, రూ.1583.67కోట్లకు బీఆర్‌ఓ ఇచ్చి, కేవలం రూ.7.47 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
– వ్యవసాయశాఖలో ఎస్సీ ప్రత్యేక నిధి కింద ఖర్చు 18.91శాతం ఉంటే..ఎస్టీల్లో 37.82శాతంగా ఉంది.
– వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కేటాయించిన నిధుల్లోంచి ఎస్సీ ప్రత్యేక నిధి కింద ఒక్క రూపాయి కూడా ఖర్చుకాలేదు.
– పంచాయతీరాజ్ శాఖలోని రెండు విభాగాల ద్వారా రూ. 936 కోట్లు కేటాయిస్తే, వాటిలో కనీసం రూ. 5 కోట్లు కూడా ఖర్చుకాలేదు.
– మహిళా, శిశు సంక్షేమ శాఖలో మాత్రం పై ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్లు కేటాయిస్తే, క్యారీ ఫార్వర్డ్ ద్వారా వచ్చిన నిధులతో ఖర్చు రూ. 420 కోట్లు దాటింది.
సబ్‌ప్లాన్ చట్టంలోని నిబంధనల ప్రకారం గత ఏడాది ఖర్చుకాకుండా మిగిలిపోయిన నిధులను మరుసటి ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేయాలి. కానీ అది జరగట్లేదు. దీనిపై ఆ శాఖకు సంబంధించిన ఓ ఉన్నతాధికారిని ‘నవతెలంగాణ’ వివరణ అడిగితే…”అసలు తగిన బడ్జెట్ ఉంటే కదా? ఇవన్నీ చేయటానికి” అని సమాధానం చెప్పారు.
తీరు మారలే!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES