-బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్
– బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరణ..
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారం సాధించడమే బీఎస్పీ అంతిమ లక్ష్యమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ అథర్ సింగ్ రావుతో కలిసి ఆయన అధికారికంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందని బలంగా నమ్మి, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు 36 మంది బీఎస్పీ ఎంపీలతో మద్దతు తెలిపిందని గుర్తుచేశారు.
మాన్యశ్రీ కాన్షీరామ్ గారు బహుజనులకు జరుగుతున్న అన్యాయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీని బలమైన రాజకీయ శక్తిగా మార్చి, మాయావతిని నాలుగు సార్లు ముఖ్యమంత్రిని చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం అగ్రవర్ణాలు చేసిన పోరాటంగా అభివర్ణించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలు బూటకమని, ప్రత్యేక తెలంగాణ కోసం వేలాది మంది బహుజనులు ఆత్మహత్య చేసుకుంటే అధికారం మాత్రం అగ్రవర్ణాలకు దక్కిందన్నారు. జనాభాలో 15 శాతం ఉన్న ఆధిపత్య కులాలు 85 శాతం ఉన్న ప్రజలను ఇంతకాలం పాలించడమెందని ప్రశ్నించారు.
పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ నీళ్లు,నిధులు, నియామకాల పేరుతో దోపిడీ చేసి, ప్రజలను మోసం చేసిందని అన్నారు. అవుటర్ రింగ్ రోడ్, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందన్న ఆయన ఫలితంగా అగ్రకులాల భూముల ధరలకు రేట్లు పెరిగి ఆ వర్గాలకే లాభం జరిగింది కానీ, బహుజనులకు ఒరిగింది ఏమీ లేదని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణ సంపద ఎక్కువ మొత్తం అగ్రకుల చేతుల్లోనే కేంద్రీకృతమైందని విమర్శించారు. ఆధిపత్య పాలకులు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు బహుజనుల బతుకులు మార్చవన్న ఆయన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పోరాడి,రాష్ట్రంలో బహుజన రాజ్యాన్ని సాధించాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికిన అనంతరం అక్కడి నుంచి కార్లతో భారీ ర్యాలీగా బయలుదేరి ట్యాంక్ బండ్ వద్ద తెలుగుతల్లి ఫ్లై ఓవర్ కింద ఉన్న డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల ఇంచార్జ్ గా ఎం.బాలయ్య తో పాటు స్టేట్ సెంట్రల్ కోఆర్డినేటర్లుగా దాగిళ్ళ దయానంద్, నిషాని రామచందర్ ప్రధాన కార్యదర్శులుగా బోయిని చంద్ర శేఖర్ ముదిరాజ్, బోడపట్ల ఈశ్వర్, మేతరి ప్రభు కుమార్, మంచాల శ్రీకాంత్ లు, కార్యదర్శులుగా శీలం అనితా రెడ్డి, లింగంపల్లి యాదగిరి, జాడి రాజు, కార్యవర్గ సభ్యులుగా ఎనగందుల వెంకన్న, మాతంగి అశోక్, కోశాధికారిగా నాయిని ప్రణయ్ కుమార్ లను నియమించారు.