గాజాలో కొనసాగుతున్న ఉన్మాద దాడులు
కాల్పుల విరమణ ఒప్పందానికి పదేపదే తూట్లు
ఆర్మీ కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి
గాజా/ ది హేగ్ : కుక్కతోక వంకర నానుడిలా ఇజ్రాయిల్ తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. శాంతి వచనాలు వల్లిస్తూనే ఉన్మాద దాడులకు తెగబడుతోంది. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినా.. అమాయకులైన పాలస్తీనియన్లను లక్ష్యంగా చేసుకొని నెతన్యాహూ బలగాలు చెదురుమదురుగా కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతునే వున్నాయి. తాజాగా ఒక పాలస్తీనా కుటుంబంపై జరిపిన ఇజ్రాయిల్ బలగాలు జరిపిన కాల్పుల్లో 11 మంది చనిపోయారు. బాధితుల్లో అత్యధికం చిన్నారులు, మహిళలలే. 8 రోజుల క్రితం ఒప్పందం కుదిరిన తర్వాత ఇదే అతిపెద్ద ఉల్లంఘన. గాజా నగరంలోని జీటూన్ ప్రాంతంలో అబూ షాబాన్ కుటుంబం ఒక వాహనంలో వస్తుండగా ఇజ్రాయిల్ సైనికులు ట్యాంక్ షెల్‌ను పేల్చారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మరణించారని గాజా పౌర రక్షణ బలగాలు వెల్లడించాయి.
వారిలో ఏడుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారు. దాడుల భయంతో ఇన్నాళ్ళు దూరంగా ఉండి.. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడుతున్నాయన్న ఆశతో తమ ఇల్లు చూసుకునేందుకు వస్తున్న ఆ కుటుంబంపై ఈ దాడి జరిగిందని పౌర రక్షణ దళ ప్రతినిధి మహమూద్ బసాల్ ఒక ప్రకటనలో తెలిపారు. వారు కనీసం ముందుగా హెచ్చరికలు కూడా చేయలేదన్నారు. ఈ సంఘటన చూస్తుంటే ఇంకా ఇజ్రాయిల్ సైన్యం రక్తదాహంతో వుందని అర్ధమవుతోందన్నారు. అమాయకులైన పౌరులపై దారుణాలకు పాల్పడాలని భావిస్తోందన్నారు. కాగా ఈ ఊచకోతను హమాస్ తీవ్రంగా ఖండించింది. అన్యాయంగా కుటుంబాన్ని పొట్టనబెట్టుకున్నారని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాల్సిందిగా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తేవాలని మధ్యవర్తులను, ట్రంప్‌ను కోరింది.
ఎల్లో లైన్ దాటారని…
కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం విభజన రేఖగా ఎల్లో లైన్ ఉందని, దాన్ని దాటినందుకే వారిపై కాల్పులు జరిపినట్టు సైన్యం చెబుతోంది. కానీ చాలామంది ప్రజలకు ఇంటర్‌నెట్ సౌలభ్యం లేకపోవటంతో వారికి ఎక్కడ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉందో, ఎక్కడ లేదో అనే విషయం తెలియదని అల్‌జజీరాకు చెందిన ఓ విలేకరి వ్యాఖ్యానించారు. ఇప్పటికీ గాజాలో దాదాపు 53శాతం ఇజ్రాయిల్ సైన్యం అధీనంలోనే ఉందన్నారు. ఇప్పటివరకు దాడుల్లో 28మంది మరణించారు. కాగా త్వరలోనే మరింత స్పష్టంగా ఎల్లో లైన్స్ ఏర్పాటు చేస్తామని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి చెప్పారు.
నెతన్యాహు అరెస్ట్ వారెంట్ల రద్దుకు ఐసీసీ తిరస్కరణ
ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు, మాజీ రక్షణ శాఖా మంత్రి యోవ్ గాలంట్ల అరెస్ట్ వారెంట్‌లను రద్దు చేయాలన్న వారి విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) శనివారం తిరస్కరించింది. వారెంట్లు రద్దు చేయాలని ఇజ్రాయిల్ చేసిన వాదనలు సమీక్షించడానికి, రద్దు చేయడానికి ఎటువంటి చట్టపరమైన కారణాలు లేవని ఐసీసీ తోసిపుచ్చింది. వారు అప్పీలు చేయడానికి అర్హత లేదని, ఇది యుద్ధ నేరాలు, మానవాళిపై జరిగిన హేయమైన దాడికి సంభందించిన తీవ్ర నేరాలని వివరించింది. కేసు దర్యాప్తు జరుగుతున్న ప్రస్తుత దశలో జోక్యం చేసుకోమని ఐసీసీ దర్మాసనం స్పష్టం చేసింది.
గాజాలో యుద్ధ నేరాలు చేసినందుకు గత సంవత్సరం నవంబర్‌లో నెతన్యాహు, గాలంట్లపై ఐసీసీ అరెస్ట్ వారెంట్‌లను జారీ చేసింది. 2023 అక్టోబర్‌లో గాజాపై ఇజ్రాయిల్ దాడులు ప్రారంభించినాటి నుంచి నేటి వరకు దాదాపు 20 వేల పిల్లలతో సహా 68 వేల పాలస్తీనియన్లు మరణించారు. లక్షలాది మంది గాయపడ్డారు. ఇటీవల హమాస్, ఇజ్రాయిల్ మధ్య జరిగిన కాల్పుల విరమణ అనంతరం గాజాలో శిథిలాల నుంచి అనేక మృతదేహాలు బయటపడుతున్నాయి. దీంతో మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఐసీసీ తీర్పుపై నెతన్యాహు స్పందించారు. ఈ తీర్పు రాజకీయంగా ఇజ్రాయిల్‌ను లక్ష్యంగా చేసుకుని ఇచ్చిందనీ, తమ ఆత్మరక్షణపై ప్రత్యక్ష దాడి అని ఆరోపించారు. ఐసీసీ దర్యాప్తుకు సహకరించబోమని ప్రకటించారు. గాజాలో ఇజ్రాయిల్ దాష్టీకాలకు అండదండలు అందించిన అమెరికా కూడా ఐసీసీ తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐసీసీ ఉన్నతాధికారులపై ఆంక్షలు విధించింది. ఐసీసీ నిర్ణయం రాజకీయ పక్షపాత వైఖరని అక్కసు వెళ్లగక్కింది.